స్లీప్‌ కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

స్లీప్‌ కౌన్సెలింగ్‌

Published Mon, Apr 2 2018 2:18 AM

Sleep counseling - Sakshi

మావాడు రాత్రి చాలాసేపు మేల్కొనే ఉంటున్నాడు
మా అబ్బాయి వయసు 14 ఏళ్లు. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మేం ఎంతగా నిద్రపుచ్చడానికి ప్రయత్నించినా రాత్రివేళ త్వరగా పడుకోవడం లేదు. ఒక్కోసారి ఒంటిగంట వరకు మొబైల్‌లో గేమ్స్‌ ఆడుతూ ఉంటున్నాడు. లైట్లు ఆర్పేసినా వాడు నిద్రపోవడం లేదు. అదేమిటంటే నిద్రపట్టడం లేదని అంటున్నాడు. ఇలా నిద్రపోకపోవడం వల్ల వాడికి ఏదైనా నష్టమా? దయచేసి చెప్పండి. – షేక్‌ సుహానా, హైదరాబాద్‌
చిన్నపిల్లలకు నిద్ర చాలా అవసరం. పిల్లలు నిద్రలేమితో బాధపడుతుంటే అది  భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఈ వయసులో కంటినిండా నిద్రతో వాళ్ల జ్ఞాపకశక్తి మరింత ఇనుమడిస్తుంది. నిద్రలో మన మెదడులో కొన్ని తరంగాలు లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. వాటినే ‘షార్ట్‌ వేవ్‌ రిపుల్స్‌’ అంటారు. మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అది మరింతగా గుర్తుండిపోవడానికి కారణం ఈ తరంగాలే. 2009లో అమెరికన్, ఫ్రెంచ్‌ శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం మన జ్ఞాపకాలు మన మెదడులోని హిప్పోక్యాంపస్‌ నుంచి మరో ప్రాంతం అయిన నియోకార్టెక్స్‌కు బదిలీ అయి... అక్కడ దీర్ఘకాలపు జ్ఞాపకాలుగా నిల్వ ఉంటాయి.

తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన కంప్యూటర్‌లో నిల్వ ఉంచుకోడానికి స్థలం సరిపోదని,  డాటాను ఏదైనా హార్డ్‌ డిస్క్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటాం కదా... అలాగన్నమాట. ఇక్కడ షార్ట్‌ టర్మ్‌ మెమరీగా ఉన్న జ్ఞాపకాలు... అక్కడ లాంగ్‌ టర్మ్‌ మెమరీస్‌గా మారి శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకు కారణమైన ‘షార్ట్‌ వేవ్‌ రిపుల్స్‌’ కేవలం గాఢనిద్రలోనే సాధ్యమవుతాయి. అందుకే పిల్లలు చదివింది జ్ఞాపకం ఉండాలంటే వాళ్లకు కంటినిండా నిద్ర ఉండాలి.

అంతేకాదు ఒకవేళ పిల్లల్లో తగినంత నిద్రలేకపోతే వారు భవిష్యత్తులో మానసిక సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది. డిప్రెషన్, యాంగై్జటీ వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే నిద్రకు ముందు టీవీలో ఉద్వేగపరమైన సన్నివేశాలున్న సినిమాలు చూడనివ్వకండి. ఇక మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వంటివి బ్లూ–లైట్‌ను వెదజల్లుతాయి. ఈ బ్లూ–లైట్‌ మెదడును ఉత్తేజితం చేసి, నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే నిద్రపుచ్చడానికి కనీసం మూడు గంటల ముందు నుంచి పిల్లలను ఈ ఉపకరణాలకు దూరంగా ఉంచండి.

ఇక కాఫీ, కూల్‌డ్రింక్స్‌ వంటి కెఫిన్‌ ఉండే డ్రింక్స్‌ తాగనివ్వకపోవడం వల్ల మంచి నిద్రపడుతుంది. మంచి నిద్ర పట్టేలా చేసేందుకు రాత్రి బాబుకు గోరువెచ్చని పాలు తాగించడం మంచిది. ఇందులో నిద్రను ప్రేరేపించే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉన్నందున అది నిద్రకు పురిగొల్పుతుంది. ఇవన్నీ చేశాక కూడా పిల్లలు నిద్రకు ఉపక్రమించడం లేదంటే ఒకసారి స్లీప్‌ స్పెషలిస్ట్‌ను కలవండి.

నిద్రలో అలా కాళ్ల కదలికలు ఎందుకు?
నా భార్య వయసు 47 ఏళ్లు. ఆమె కొన్నేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఇటీవల మేం గమనించిందేమిటంటే నిద్రలో ఆమె తన కాళ్లను చాలా వేగంగా కదిలిస్తోంది. ఎందుకలా జరుగుతోంది? దయచేసి తగిన పరిష్కారం చూపండి.     – కె. మోహన్‌రావు, మార్టూరు

నిద్రలో ఇలా కుదుపుతున్నట్లుగా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్‌ లింబ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. మనం నిద్రపోతున్న సమయంలో  మన ఊపిరితిత్తులు, డయాఫ్రమ్‌ కదలిక తప్ప ఒంట్లో మరే కదలికా సాధారణంగా కనిపించదు.  కానీ పీఎల్‌ఎమ్‌డీ నిద్రలో కదలికలు ఉండేలా చేస్తుంది. ఇక్కడ ‘పీరియాడిక్‌’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు. ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తుంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి.

దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్‌ఎమ్‌డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది. లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు.

సెకండరీ పీఎల్‌ఎమ్‌డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ∙డయాబెటిస్‌ ∙ఐరన్‌ లోపం ∙వెన్నెముకలో కణుతులు ∙వెన్నెముక దెబ్బతినడం ∙స్లీప్‌ ఆప్నియా (గురక సమస్య)  నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం) ∙యురేమియా (రక్తంలో యూరియా, నైట్రోజన్‌ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి.

పీఎల్‌ఎమ్‌డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు ప్రత్యేకంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని కొంతవరకు ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్‌ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్‌ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్‌ వంటి మందులతో చికిత్స చేయవచ్చు.


పాప నిద్రలో ఉలిక్కిపడి మేల్కొంటోంది..!
మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. అమ్మాయి ఎందుకిలా చేస్తోంది. తగిన సలహా ఇవ్వండి.   – డి. జనార్దన్, వైరా

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అమ్మాయి ‘స్లీప్‌ టెర్రర్‌’ అనే సమస్యతో బాధపడుతోంది. నిద్రలో అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఈ తరహాకు చెందిన సమస్యలే. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌–నాన్‌ ఆర్‌ఈఎమ్‌) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది.

సాధారణంగా తాము పరిష్కరించలేని సమస్యను ఎదుర్కొంటూ పిల్లలు బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్లు అకస్మాత్తుగా లేచి, ఈ నైట్‌టెర్రర్‌ దశలో 1–2 నిమిషాలుంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. ఈ స్థితిలో ఉన్న  చిన్నారులను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు.

చాలామందిలో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న విషయమే వాళ్లకు గుర్తుండదు. ఇదేమీ మానసిక సమస్య కాబోదు. ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తూంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగై్జటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్‌ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు.

మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలమనే నమ్మకాన్ని ఆమెలో నింపి, ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పండి. వీలైతే మీరు ఒకసారి స్లీప్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.


- డాక్టర్‌ రమణ ప్రసాద్‌ ,కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ పల్మునాలజిస్ట్‌ కిమ్స్, సికింద్రాబాద్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement