మీ సమస్య స్లీప్‌ పెరాలసిస్‌ కావచ్చు... | Sakshi
Sakshi News home page

మీ సమస్య స్లీప్‌ పెరాలసిస్‌ కావచ్చు...

Published Sat, Jan 28 2017 12:18 AM

మీ సమస్య స్లీప్‌ పెరాలసిస్‌ కావచ్చు...

నా వయసు 50. నేను నిద్రలేచాక కొద్దిసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.     – వెంకటయ్య, డోర్నకల్‌
మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు స్లీప్‌ పెరాలసిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువకి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్‌కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. స్లీప్‌ పెరాలసిస్‌ నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు సంభవిస్తుంది.

ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇందుకు దోహదపడే మరికొన్ని అంశాలు... ∙నిద్రలేమి  ∙మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం ∙బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక వ్యాధులు ∙ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం ∙నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం ∙కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) ∙తీవ్ర అవమానానికి గురికావడం
చికిత్స:  స్లీప్‌ పెరాలసిస్‌ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్‌ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

ప్యాంక్రియటైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకూ దెబ్బ!
నా వయసు 36 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు చాలా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. తరచు పొత్తి కడుపులో నొప్పి. రక్తపరీక్ష చేయించుకున్నాను. షుగర్‌ ఉన్నట్లు తేలింది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడదామని వెళ్తే, ఆయన కొన్ని ఇతర పరీక్షలు చేసి, నేను అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నానని, వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదమన్నారు. నేను తరచూ మద్యం తాగుతాను. అందుకే ఈ వ్యాధి వచ్చిందా? – డి. దాస్, విజయవాడ

పాంక్రియాటైటిస్‌ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. కానీ దీర్ఘకాలం దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పాంక్రియాస్‌ (క్లోమ గ్రంథి) చిన్నపేగుకు పక్కనే ఉండి జీర్ణప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్‌ అనే హార్మోన్లను రక్తంలోకి విడదుల చేసి దానిని శక్తిగా మారుస్తుంది. డయాబెటిస్‌ నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. ఈ రసం ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీన్ని పాంక్రియాటైటిస్‌ అంటారు. కొన్ని సందర్భాల్లో క్లోమరసంలో ప్రోటీన్లు పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు మితిమీరిన మద్యంపానం, జన్యువుల ప్రభావం, జంక్‌ఫుడ్‌ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొన్నేళ్ల తర్వాత బయటపడతాయి. మీకు ఈ వ్యాధి చాలాకాలం నుంచి ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువతో పాటు బరువు తగ్గడం లాంటి లక్షణాలతో బాధపడ్డారు.

మీరు వెంటనే మద్యం పూర్తిగా మానేయండి. దీనిని మొదటిదశలోనే కనిపెట్టకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మీకు రక్తపరీక్షలు, సీరమ్‌ లైపేజ్‌ పరీక్షలు, సీటీ స్కాన్‌ లేదా ఎమ్మారై స్కాన్‌ లాంటివి చేయాల్సి ఉంటుంది. క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స అందించాలి. లేకపోతే ‘అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌’ కాస్తా ‘క్రానిక్‌ పాంక్రియాటైటిస్‌’గా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి చెడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాలలో మందులతో ఈ జబ్బు తగ్గనప్పుడు ఇప్పుడు అందివచ్చిన అత్యాధునిక చికిత్స సదుపాయం ల్యాపరోస్కోపిక్‌ సర్జరీ/కీహోల్‌ సర్జరీ విధానం ద్వారా ఒకవేళ క్లోమగ్రంథి చెడిపోయి ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఈ శస్త్రచికిత్స వల్ల రోగి హాస్పిటల్‌లో ఉండే వ్యవధి తగ్గడంతో త్వరగానే మీరు మీ సాధారణ వృత్తి వ్యాపకాలు కొనసాగించవచ్చు.

Advertisement
Advertisement