స్కిల్ గ్యాప్ అనే మాట తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లోనూ యువతకు వృత్తి విద్య నైపుణ్యాలు...
స్కిల్ గ్యాప్ అనే మాట తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లోనూ యువతకు వృత్తి విద్య నైపుణ్యాలు అందించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లకు అదనంగా రూపొందిస్తున్న ఈ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది మార్చి నుంచి అమలు కానున్నట్లు సమాచారం. ఈ కొత్త పథకం మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ లక్ష్యంగా ఉంటుందని ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగావకాశాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు లభిస్తాయని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ నిర్వహణకు జర్మనీ సహకారం తీసుకోనున్నారు.
యూనివర్సిటీల్లో ‘యోగా’ క్లాసులు తప్పనిసరి
నిరంతరం అకడమిక్స్ అభ్యసనంలో తలమునకలై ఉంటున్న విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసే విధంగా యోగా క్లాసులు నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. పాజిటివ్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా యోగా సెషన్స్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు యూజీసీ వర్గాలు తెలిపాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ సందర్భంగా మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ యోగా క్లాస్‌లకు ఉపక్రమించినప్పటికీ.. ప్రమోషన్ ఆఫ్ యోగా ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ అండ్ పాజిటివ్ హెల్త్ ఇన్ యూనివర్సిటీస్ అనే పథకాన్ని పదకొండో పంచవర్ష ప్రణాళికలోనే సిఫార్సు చేశారు. కానీ ఇంతవరకు అమలు కాలేదు.