క్యాబ్‌ డ్రైవింగ్‌లో రాణించింది

 Rani Is The First Trans Woman Driver In Ubar - Sakshi

ఆర్టికల్‌ 377ను సడలించినా.. సమాజంలో ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని ఇంకా చిన్న చూపే చూస్తోంది సమాజం. ‘‘ఏ పనిలో పెట్టుకోరు, మాతో మర్యాదగా మాట్లాడరు, నోటి దురుసుతనమే కాదు చేయి కూడా చేసుకుంటారు. అందుకే చాలామంది ట్రాన్స్‌జెండర్లు భిక్షాటన, సెక్స్‌వర్క్‌లో దిగుతారు’’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌ ఉమన్‌ ఆవేదనగా.  చుట్టూ ఉన్నవాళ్లు హేళన చేస్తున్నా, అడుగడుగునా అవమానపరుస్తున్నా ఆత్మవిశ్వాసం విడవకుండా ఇంకెంతోమంది ట్రాన్స్‌జెండర్లు పలురంగాల్లో రాణిస్తూ, తమను వెక్కిరిస్తున్న సమాజానికే పాఠం నేర్పుతున్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాళ్లలో ముందు వరసలో ఉంటుంది రాణీ కిరణ్‌. ఒడిషా, భువనేశ్వర్‌కు చెందిన ఆమె కూడా తోటి ట్రాన్స్‌జెండర్లలాగే మొదట్లో రైళ్లల్లో భిక్షాటన చేసింది. చీదరింపులను ఎదుర్కొంది.

ఆత్మాభిమానం దెబ్బతిని ఆ పనికి స్వస్తి చెప్పి ఆటోరిక్షా నడపడం స్టార్ట్‌ చేసింది. ఇక్కడా తిరస్కారమే ఎదురైంది. జనాలు ఆమె ఆటో ఎక్కడానికి సంకోచించేవాళ్లు. దాంతో పూట గడవక ఆటోకు బ్రేక్‌ వేయాల్సి ఇచ్చింది. ఆ టైమ్‌లోనే పూరీలో జరిగిన రథయాత్రలో అంబులెన్స్‌ నడిపే అవకాశం వచ్చింది. కాని ఎంతకాలం? పదిహేను రోజులే. తర్వాత మళ్లీ పని వెదుక్కోవాల్సిన స్థితి. అప్పుడే మేఘనా సాహూ అనే ట్రాన్స్‌ ఉమన్‌ గురించి తెలిసింది రాణీకి. ఊబర్‌లో ఫస్ట్‌ ట్రాన్స్‌ ఉమన్‌ డ్రైవర్‌ ఆమె. ఆ ప్రేరణతో కార్‌ డ్రైవింగ్‌ నేర్చుకొని, ఊబర్‌ వాళ్ల ఇంటర్వ్యూలోనూ నెగ్గింది. దాచుకున్న డబ్బు, కొంత లోన్‌ తీసుకొని సొంతంగా కారు కొనుక్కొంది.

ఇప్పుడు భువనేశ్వర్‌లో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఫస్ట్‌ అండ్‌ మోస్ట్‌ ఎఫీషియెంట్‌ ట్రాన్స్‌జెండర్‌ డ్రైవర్‌ తనే. మహిళా ప్యాసెంజర్లు చాలామంది రాణీ కారులోనే ప్రయాణించడానికి ఇష్టపడ్తారట. ‘‘మగవాళ్లు నడిపే టాక్సీ కన్నా రాణీ టాక్సీ చాలా సేఫ్‌ అన్నిరకాలుగా. జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తుంది. సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుంది’’ అంటారు భువనేశ్వర్‌లోని వర్కింగ్‌ విమెన్‌.‘‘ఎవరమైనా గౌరవంగా బతకాలనే కోరుకుంటాం. కొంతమందికి పుట్టు్టకతోనే అది ప్రివిలేజ్‌. మాలాంటి వాళ్లకు ఎంత కష్టపడ్డా దొరకదు’’ అంటుంది రాణీ కిరణ్‌. ఇప్పుడు రాణీ కిరణ్‌ చాలామందికి ఆదర్శం. ‘‘నా ప్రతి రైడ్‌కు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ వస్తుంది’’ అని చెప్తుంది గర్వంగా!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top