మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా? | Our boy's battle with addiction to manpincadam? | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?

Dec 21 2013 12:27 AM | Updated on Sep 2 2017 1:48 AM

మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?

మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?

కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి ఒకవిధమైన ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల గారాబం వల్ల, పుష్కలంగా...

మా అబ్బాయి చెన్నైలో మంచి పేరున్న కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే చెడుసావాసాలకు అలవాటుపడి, కానబీస్ అనే  మత్తుపదార్థాన్ని సేవిస్తున్నాడని తెలిసి, కాలేజీ మాన్పించి ఇంటికి తీసుకొచ్చేశాం. చిన్నప్పటినుంచి కూడా ఆటలాడుకుంటూ, కులాసాగా గడిపేద్దామనే తప్ప చదువు ధ్యాస బొత్తిగా లేదు. ఎలాగో ఇంజినీరింగ్ వరకు నెట్టుకొచ్చాం. వాడికి మంచి లక్ష్యాలు ఉన్నాయి కానీ, వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించడు. మాకు వాడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
 - ఒక తల్లి, హైదరాబాద్.


మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. అయితే దేనినైనా మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. లేదంటే పెద్దయ్యాక ఇలాగే తయారవుతారు. అందుకే పిల్లలకు చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా చూడటం ముఖ్యం. కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి ఒకవిధమైన ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల గారాబం వల్ల, పుష్కలంగా డబ్బుండటం వల్ల, జల్సాకు అలవాటుపడి, చదువును నిర్లక్ష్యం చేస్తారు. క్లాసులో టీచర్లు చెప్పేది వినరు, నోట్సు రాసుకోరు. క్లాసులే కాదు, పరీక్షలు కూడా ఎగ్గొడుతుంటారు. డబ్బుండటం వల్ల  రకరకాల స్వభావాలుండే స్నేహితులు వీరి వెనకాల తిరుగుతుంటారు. పిల్లలు ఇలా ఉన్నప్పుడే పెద్దలు దానిని ఖండించి, నయానో, భయానో నచ్చజెప్పి వారిని గాడిలో పడేలా చేయాలి. లేదంటే పెద్దయినా వారిలో ఇదే ధోరణి కొనసాగుతుంది.
 
సాధారణంగా ఇటువంటి పిల్లలు క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తుపదార్థాలు, మద్యపాన ం, ధూమపానం తదితర దురలవాట్లకు అలవాటుపడి, వాటికి తొందరగా బానిసలుగా మారతారు. ఫలితంగా సంఘవిద్రోహశక్తులుగా కూడా మారతారు. మీ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతుంటే మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారంటున్నారు. అలా ఖాళీగా ఉంటే మరింతగా చెడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అతన్ని తనకిష్టమైన మరో మార్గం వైపు మళ్లించేందుకు ప్రయత్నించండి. అంటే స్పోర్ట్స్, గేమ్స్ లాంటి వాటివైపన్నమాట.

మీరు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ అతన్ని బాగా చూసుకోండి, ప్రేమగా మెలగండి. తాను చేస్తున్నది తప్పని తనే తెలుసుకునేలా చేయండి. సైకోథెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటిద్వారా అతని మనసును మంచి మార్గంవైపు మళ్లేలా చూడండి. అంతేకానీ, హిప్నాటిజం వంటి వాటివల్ల అద్భుతం జరిగి, అతను అనూహ్యంగా మారతాడని మాత్రం ఆశించకండి. మీ అబ్బాయిని తీసుకుని మంచి సైకాలజిస్టును కలవండి.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్
  సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement