చెరై.. ఆక్వాపోనిక్స్‌ గ్రామం!

Organic vegetable and aquaculture - Sakshi

కేరళలోని చెరై అనే తీరప్రాంత గ్రామం తొలి పూర్తి ఆక్వాపోనిక్‌ వ్యవసాయ గ్రామంగా మారిపోయింది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ సేంద్రియ కూరగాయలతోపాటు చేపలను కూడా ఆక్వాపోనిక్స్‌ పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం కొద్ది మంది ప్రారంభించిన ఆక్వాపోనిక్స్‌ సాగు తామర తంపరగా గ్రామం మొత్తానికీ పాకింది. పల్లిపురం సర్వీసు కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ (పి.ఎస్‌.సి.బి.) చొరవ తీసుకొని రసాయనాల్లేని ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి ఆక్వాపోనిక్స్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించింది. తొలుత కొద్ది మందితో ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు ఇప్పుడు దాదాపు ఆ చిన్న ఊళ్లో ఉన్న 200 పైచిలుకు కుటుంబాలన్నీ చేపలు, కూరగాయలను రసాయనాల్లేకుండా పండించుకొని తింటున్నారు.

ఆక్వాపోనిక్స్‌ అంటే?
ఆక్వాకల్చర్‌+హైడ్రోపోనిక్స్‌ కలిస్తే ఆక్వాపోనిక్స్‌ అవుతుంది. చెరువులు, మడుల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్‌ అంటారు. మట్టితో సంబంధం లేకుండా నీటిలో కరిగే మినరల్‌ సప్లిమెంట్లతో టబ్‌లు, బక్కెట్లలో కూరగాయలు / పండ్ల మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్‌ అంటారు. చేపలు పెరుగుతున్న టబ్‌లో నుంచి నీటిని కూరగాయలు, పండ్ల మొక్కలు పెరిగే కుండీలు, మడుల్లోకి నిరంతరం చిన్న విద్యుత్తు పంపు ద్వారా రీసర్క్యులేట్‌ చేస్తూ ఉంటారు. తవుడు, నూనె తీసిన వేరుశనగ / కొబ్బరి తెలగపిండిని చేపలకు ఆహారంగా వేస్తారు.

మిగిలినపోయిన మేత, చేపల విసర్జితాలలోని పోషకాలతో కూడిన నీరు కూరగాయలు / పండ్ల మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గ్రోబాగ్స్, టబ్‌లు, కుండీల్లో రాతి చిప్స్‌ను పోసి వాటిలోనే కూరగాయలు, పండ్ల మొక్కలను నాటుతారు. ఈ టబ్‌లు, కుండీల పక్కనే ప్లాస్టిక్‌ షీట్లతో ఏర్పాటు చేసిన తొట్లలో చేపలు పెరుగుతూ ఉంటాయి. చేపల విసర్జితాలు మొక్కలకు ఆహారం అవుతుండగా.. మొక్కల వేళ్లు నీటిని శుద్ధి చేసి తిరిగి చేపలకు అందిస్తూ ఉండటం వల్ల పరస్పరాధారితంగా ఆక్వాపోనిక్స్‌ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నీటి వృథా లేకుండా, రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకోవడానికి ఆక్వాపోనిక్స్‌ యూనిట్లు చెరై గ్రామ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఖర్చు ఏడాదిలో తిరిగొస్తుంది!
‘మొదట్లో చాన్నాళ్లు బ్రతిమిలాడినా చాలా మంది రైతులు రుణం ఇస్తామన్నా ఆక్వాపోనిక్స్‌ యూనిట్లను తీసుకోలేదు. కొద్ది మందే తీసుకున్నారు. ఏర్పాటు చేసుకోవడానికి మొదట ఖర్చు బాగానే ఉంటుంది. అయితే, ఏడాదిలోనే ఆ ఖర్చు చేపలు, కూరగాయల రూపంలో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 200 మందికిపై ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.’ అని కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ మాజీ అధ్యక్షుడు సత్యన మయ్యత్తిల్‌ అన్నారు.

తొలిగా ఆక్వాపోనిక్స్‌ యూనిట్‌ పెట్టుకున్న రైతు శశిధరన్‌ చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘14,000 లీటర్ల నీరు పట్టే చేపల ట్యాంకులో 1,500కు పైగా చేప పిల్లలను వేశాను. వందకు పైగా గ్రోబాగ్స్‌లో కూరగాయలు పెంచుకుంటున్నా. చేపలు, కూరగాయలు మా ఇంటిల్లపాదికీ సరిపోను అందుతున్నాయి..’ అన్నారాయన. రైతులే కాక దిలీప్‌ వంటి వ్యాపారులు, మాజీ అటవీ శాఖాధికారి కిషోర్‌ కుమార్‌ వంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఇళ్ల దగ్గర ఆక్వాపోనిక్స్‌ యూనిట్లు పెట్టుకున్నారు. అందువల్లనే చెరై గ్రామం సంపూర్ణ ఆక్వాపోనిక్స్‌ గ్రామంగా మారింది.

నీటిని నిమిషం ఆగకుండా పంప్‌ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా నీటిని రీసర్క్యులేట్‌ చేయడానికి సోలార్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కిషోర్‌ కుమార్‌ మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేయడం విశేషం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) తోడ్పాటుతో పల్లిపురం సహకార బ్యాంకు తీసుకున్న చొరవే సేంద్రియ చేపలు, కూరగాయలను ఈ గ్రామస్తులందరూ పండించుకోగలుగుతున్నారు. ఏ విటమిన్‌ అధికంగా ఉండే ‘మోల’ / మెత్తళ్లు వంటి చిరు చేపలను ఈ పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి పిల్లలను వేస్తే చాలు నిరంతరం తనంతట తానే సంతతిని పెంపొందించుకునే లక్షణం కలిగి ఉండటం ఈ చిరు చేపల ప్రత్యేకత. మనం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయలేమా?


 ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు పండించుకుంటున్న మహిళ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top