ఆన్‌లైన్‌ నిర్భయలు

nirbhaya incidents in online - Sakshi

‘నిర్భయ’ ఘటనలు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ మొదలయ్యాయి! గళమెత్తిన మహిళా సోషల్‌ వర్కర్‌లపై సామాజిక మాధ్యమాలలో దుర్భాషల లైంగిక దాడి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అయితే తమ నోరు నొక్కేయడానికి జరుగుతున్న ఈ దొంగ దాడికి భయపడేది లేదని బాధితులు అంటున్నారు.

ఐక్యరాజ్య సమితి ఎప్పుడో గాని ఒక దేశాన్ని అలెర్ట్‌ చెయ్యదు. ఇప్పుడు చేసింది! ‘రాణా ఆయుబ్‌ అనే మహిళా జర్నలిస్టు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మేము భావిస్తున్నాం. ఆమెకు తక్షణం రక్షణ కల్పించండి’ అని భారతదేశాన్ని అలెర్ట్‌ చేసింది. ఆన్‌లైన్‌లో ఆయుబ్‌ మీద, మరికొందరు మహిళా సామాజిక కార్యకర్తల మీద ‘హేట్‌ క్యాంపెయిన్‌’ అవాంఛనీయమైన స్థాయికి చేరుకుందని.. ఐరాస చేసిన ఈ హెచ్చరిక వల్ల తేటతెల్లం అవుతోంది.  

రాణా ఆయుబ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్, రిపోర్టర్, రచయిత్రి. ఈ రింగుల జుట్టు అమ్మాయిని మీరిప్పటికే ఎక్కడైనా చూసి ఉండే అవకాశాలే ఎక్కువ. తరచూ టీవీ డిబేట్‌లలో కనిపిస్తుంటారు. సమాజిక సమస్యలపై సోషల్‌ సైట్‌లలోనూ చాలా బలంగా వాదిస్తుంటారు. అయితే కొంతకాలంగా రాణాకు ట్విట్టర్‌లో అసభ్యకరంగా బెదిరింపులు వస్తున్నాయి.

‘రేప్‌ చెయ్యడానికి నీ శరీరం అన్ని విధాలా అనువైనది, అర్హతగలదీ’ అని ఇటీవల కూడా ఆన్‌లైన్‌లో ఆమె ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ ఒక పోస్టు ప్రత్యక్షం అయింది! అదొక్కటే కాదు, సోషల్‌ మీడియాలో ఆమె పేరుతో ఫేక్‌ అకౌంట్‌లు, ఫేక్‌ పోస్టులు పెడుతున్నారు. ఈమధ్య రాణా పేరుతో ఒక ఫేక్‌ పోస్ట్‌ వైరల్‌ అయింది.

చిన్నపిల్లలపై అత్యాచారం చేస్తున్న రేపిస్టులకు ఉరిశిక్ష విధించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ ఫేక్‌ పోస్టులో ఉంది! రాణా విస్తుపోయారు. దీనిపై ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాణా ఆయుబ్‌ గౌరవ మర్యాదలపై ఆన్‌లైన్‌లో జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆమె పేరుతో, ఆమె ఫొటోతో ప్రస్తుతం 14 ఫేక్‌ అకౌంట్‌లు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి!

‘నీ అకౌంట్‌ని క్లోజ్‌ చేసెయ్‌’
కిరుబ మునుసామి సుప్రీంకోర్టు న్యాయవాది. రాణా ఆయుబ్‌ మీద జరుగుతున్నట్లే ప్రస్తుతం ఈమె మీద కూడా ఆన్‌లైన్‌లో లైంగిక దాడి జరుగుతోంది. దళితులకు మద్ధతుగా ఆమె తన అభిప్రాయాన్ని గానీ, తన ఫొటోను గానీ పోస్ట్‌ చేసినప్పుడు ఈ దాడి మరింత ఎక్కువవడం ఆమె గమనించారు.

తనపై లైంగికంగా ఒత్తిడి తెచ్చిన ఒక పర్యావరణవేత్త గురించి ఆన్‌లైన్‌లో ఆమె బహిర్గతం చేసినప్పటి నుంచీ ఆమె తన సహ న్యాయవాదుల సానుభూతిని కూడా కోల్పోయారు! ‘ఎందుకు అవన్నీ బయటపెట్టుకోవడం. నీ అకౌంట్‌ని క్లోజ్‌ చేసేయ్‌’ మని ఆమెపై వారు ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ఆమె ప్రమేయం లేకుండానే ఫేస్‌బుక్‌లో ఆమెపై వచ్చిన కొన్ని కామెంట్‌లు డిలీట్‌ అయ్యాయి. అంటే ఫిర్యాదు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలను నిర్మూలించడం!

‘పొగరు అణిచే వరకు నువ్వింతే’
వీళ్లిద్దరి లాగే షీలా రషీద్, స్వరాభాస్కర్‌ ఆన్‌లైన్‌ అత్యాచారాలకు గురవుతున్నవారు. బయటి ప్రసంగాలలో, ఆన్‌లైన్‌ పోస్టులలో సామాజిక అంశాలపై షీలా, స్వరా వ్యక్తం చేసే అభిప్రాయాలు ఆలోచన రేకెత్తించి, తక్షణ ప్రేరకాల్లా పనిచేస్తుంటాయి. షీలా పీహెచ్‌డీ విద్యార్థిని.

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు. తరచూ ఆమె మానవహక్కుల ఉల్లంఘనపై తిరుగుబాటు గళాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆ గళానికి ప్రతిగళంగా ఆన్‌లైన్‌లో అంతే తరచుగా ఆమెపై దాడి జరుగుతుంటుంది. ‘నీ పొగరు అణిచే వరకు నువ్వింతే’ అనే అర్థంలో ఇటీవల కూడా ఆమెపై కొందరు సోషల్‌ మీడియాలో లైంగిక దాడి చేశారు.

‘ఆ రోజు ఎంతో దూరంలో లేదు’
స్వరాభాస్కర్‌ బాలీవుడ్‌ నటి. అవార్డు విజేత కూడా. పని చేస్తున్న చోట మహిళలపై జరిగే వేధింపుల గురించి, క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించీ, పెద్ద హీరోల చెత్త సినిమాలు, చెత్త డైలాగుల గురించి స్వరా నిర్భయంగా తన అభిప్రాయాలను బయటపెడుతుంటారు. తన అనుభవాలను సామాజిక అంశాల చర్చావేదికలపై పంచుకుంటూ ఉంటారు.

సోషల్‌ సైట్‌లలో పోస్టులు పెడుతుంటారు. ఇవి నచ్చని వారు స్వరాపై ఆన్‌లైన్‌లో నిరంతరం ఏదో ఒక విధమైన మానసిక హింసకు పాల్పడుతూనే ఉన్నారు. సర్వసాధారణంగా ఆమెపై జరుగుతుండే హింస.. ‘నిన్ను రేప్‌ చేసే రోజు ఎంతో దూరంలో లేదు’ అనే కామెంట్‌.

టార్చర్‌కు పరాకాష్ట ‘డాక్సింగ్‌’
షీలా, స్వరా ఇలాంటి కామెంట్‌లను లెక్క చెయ్యరు కానీ, వీటిని నిరోధించే యంత్రాంగం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. వీళ్లపై ఆన్‌లైన్‌లో ‘డాక్సింగ్‌’ కూడా జరిగింది. డాక్సింగ్‌ అంటే.. వీళ్ల వ్యక్తిగతమైన వివరాలను డాక్యుమెంట్‌లతో సహా సంపాదించి వాటిని అప్‌లోడ్‌ చెయ్యడం.

డాక్సింగ్‌ సాధారణంగా కులం గురించి, డేటాఫ్‌ బర్త్‌ అండ్‌ ప్లేస్‌ గురించి; స్నేహితులు సన్నిహితుల గురించి జరుగుతుంటుంది. ఒక విధమైన ‘రహస్యఛేదన’ లాంటిది డాక్సింగ్‌. కొన్నిసార్లు డాక్సింగ్‌æ వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుంది. మహిళలపై జరిగే ఆన్‌లైన్‌ టార్చర్‌కు ఇది పరాకాష్ట.

ఫిర్యాదు చేసే చోటా వివక్షే!!
స్త్రీద్వేషంతో, స్త్రీలపై చులకన భావంతో ఆన్‌లైన్‌లో స్త్రీలపై జరుగుతున్న వర్చువల్‌ లైంగిక అకృత్యాలపై ఏప్రిల్‌ 24న ఢిల్లీలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ (ఇండియా) ఒక సదస్సును నిర్వహించింది. ఆ సందర్భంగా ఆమ్నెస్టీ ప్రతినిధులు ఆన్‌లైన్‌లో చురుగ్గా ఉండి, ఆన్‌లైన్‌ హింసను ఎదుర్కొంటున్న మహిళల్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ సదస్సుకు రాణా ఆయుబ్, కిరుబ మునుసామి వంటి ప్రముఖ మహిళలూ హాజరై తమ అనుభవాలను వెల్లడించారు.

ఆన్‌లైన్‌ వేధింపులను అరికట్టే చట్టాలు ఇండియాలో ఉండడానికైతే ఉన్నాయి. కానీ అవి సరిగ్గా అమలవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు.. ‘అసలు ఆన్‌లైన్‌ జోలికి ఎందుకు వెళ్లారు?’ అన్నట్లుగా చూస్తున్నారని ఈ సదస్సులో కొందరు చెప్పడాన్ని బట్టి అణువణువునా లైంగిక వివక్ష వేళ్లూనుకుని ఉన్న చోట అన్యాయాన్ని పెకిలించడం సాధ్యమేనా అనిపిస్తుంది. కిరుబ, షీలా, స్వరాలాంటి యువ మహిళా పోరాట యోధులు మాత్రం.. ‘చూద్దాం.. ఎందుకు సాధ్యం కాదో’ అంటున్నారు.

‘ఆడదానివి ఆడదానిలా ఉండు’
గత ఏడాది ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ యు.కె., యు.ఎస్‌., సహా  ఎనిమిది దేశాలలోని (వాటిల్లో ఇండియా లేదు) నాలుగు వేల మంది మహిళల్ని సర్వే చేసి దాదాపు 76 శాతం మంది మహిళలు.. సామాన్యులైనా, సుప్రసిద్ధులైనా.. ఆన్‌లైన్‌ టార్చర్‌కు గురవుతున్నట్లు వెల్లడించింది. అయితే ఆ దేశాలకు భిన్నంగా ఇండియాలో ఏమీ  లేదని సీపీఐ (ఎంఎల్‌) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి కవితా కృష్ణన్‌ అంటున్నారు.

కవిత కూడా ఆన్‌లైన్‌లో అత్యాచార బెదిరింపులను ఎదుర్కొన్నవారే! ‘ఆడదానివి. ఆడదానిలా ఉండు’ అనేది ఆమెకు వచ్చిన స్త్రీద్వేష పోస్టులలో ఒకటి. అంతకంటే ఘోరమైన దాడి కూడా కవితపై జరిగింది. ప్రధాని ‘పటుత్వాన్ని’ ఆమె ప్రశ్నించినట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన ఒక ఫేక్‌ పోస్టును చూసి దిగ్భ్రాంతికి లోనైన కవిత అభిమానులు ‘మీ శీల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం జరుగుతోంది. జాగ్రత్త పడండి’ అని ఆవేదన చెందారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top