
హాయ్ సార్..! నా లవ్ స్టోరీ... నేను బీటెక్‌లో ఉన్న రోజుల్లో.. మెడిటేషన్ క్లాస్‌లో మొదలైంది. ఆ ఏంజెల్‌ని అక్కడే చూశాను. ఆ రోజు నుంచి తన కాళ్లకి చెప్పుల్లా, ఇంటికి సెక్యూరిటీ గార్డ్‌లా, తన అవసరాలకి సర్వెంట్‌లా తిప్పుకుంది. మార్నింగ్ ఏడు గంటలకు డ్యూటీ ఎక్కి, నైట్ పన్నెండు దాకా తన వెంటే తిరిగేవాణ్ని. తనకు ఒకరంటే ఇష్టం, తననే మ్యారేజ్ చేసుకుంటా అనేది. తనకి నేనే ప్రపంచం అనేది. సో నన్నే ఇష్టపడుతుందనుకున్నా. కానీ, కారణం లేకుండానే నా వాట్సాప్‌ని బ్లాక్ చేసింది. నా హార్ట్‌ని బ్రేక్ చేసింది. ఇంకొరికి ఓకే చెప్పింది. నాకు హ్యాండ్ ఇచ్చింది. నా చాప్టర్ క్లోజై.. వన్ ఇయర్ దాటింది కానీ ఇంకా తన గుర్తులే నన్ను బాధిస్తున్నాయి. ఒకప్పుడు నా బర్త్‌డే వస్తే రోజంతా తను నాతోనే ఉండేది. కానీ ఇప్పుడు విష్ కూడా చెయ్యడంలేదు. విష్ చెయ్యొచ్చుగా.. అని అడిగితే ‘‘చెప్పాల్సిన అవసరం ఏంటి?’’ అని అవమానించింది. ఆ మాటలకి ఎంతగా ఏడ్చానంటే.. ఆ దేవుడికే తెలుసు. అసలు నా కథలో తప్పు ఎవరిదో చెప్పండి ప్లీజ్. నాదా? ఆ అమ్మాయిదా? లేక మా మధ్యలోకి వచ్చిన ఆ అబ్బాయిదా?? – బాలు
నీ కథ వింటుంటే ప్రాణం లాగేస్తోంది. ‘లాగెయ్యడం అంటే ఏంటి సార్... అదేమైనా ఒక టైప్ జబ్బా?’ నీలాంబరీ నువ్వంత కోల్డ్ హార్టెడ్ అయితే ఎలా? ‘ఒక్క క్షణం’ అంటూ నీలాంబరీ కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశంలోకి తొంగి చూసింది...ఏం చూస్తున్నావు నీలూ??? ‘సూర్యుడు ఇవాళ ఏమైనా వెస్ట్ నుంచి దర్శనం ఇచ్చాడా? అని చూస్తున్నా సార్...!’ అంటే అబ్బాయి బాధ నాకు అర్థమైందంటే సూర్యుడు యూ టర్న్ కొడతాడని వెటకారమా నీలూ??? ‘లేకపోతే ఏంటి సార్? అమ్మాయి చెప్పుల్లా... అమ్మాయి అలారం గడియారంలా.. అమ్మాయి పెంపుడు కుక్కలా.. అమ్మాయి తిని పారేసిన అరటి తొక్కలా.. ఆ తొక్క మీద జారిపడి హార్ట్ బ్రేక్ చేసుకున్న పూర్ ఫెలో మీకు ఉత్తరం రాస్తే ఎగిరి గంతులు వేసి కిందపడి ఉన్న వాడిపైనే డ్యాన్స్ చేసే రకం మీరు..!! ఏదో లాగుతుందని వెటకారం చెయ్యగా లేనిది నేను చేస్తే తప్పా సార్???’ చూశావా బాలూ...!? ఈ ప్రపంచంలో ప్రేమ తొక్క మీద కాలు వేసి.. పడి.. హార్ట్ బ్రేక్ చేసుకున్న వారిపైన ఎవరికీ దయ ఉండదు బాలూ. నువ్వు ఒక గొప్ప ప్రేమికుడివి. నీ గొప్ప ప్రేమ గొప్ప అమ్మాయికి అర్థమవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఆర్డినరీ గర్ల్స్ టు అండర్‌స్టాండ్ యువర్ గొప్ప లవ్. ఈసారి జాగ్రత్త బ్రో. ఒక గొప్ప అమ్మాయిని చూసి చెప్పులరిగేలా గుండెను గడియారం చేసుకుని తిరుగు. సక్సెస్ డ్యాం షూర్.
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్