యశో గుణ సంపన్నుడు

యశో గుణ సంపన్నుడు


పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ అతడు పరిపూర్ణంగా నచ్చుతాడో శ్రీకృష్ణుడు స్వయంగా ఆచరించి చూపాడు. తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నో చిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన తల్లికి నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. తల్లి ప్రేమపాశానికి లొంగిపోయి, గÆ ధర్వులకి శాపవిముక్తి కావించాడు.  మేనమామ కంసుడు పంపిన రాక్షసులనెందరినో మట్టి కరిపించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు.  కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను పరిపూర్ణంగా ప్రేమించాడు.



తననే గుండెల్లో నింపుకుని, తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం అందరినీ ఎదిరించాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నిన తన్నుకు కూడా  చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మాన సÆ రక్షణ చేశాడు. సుభద్రా తనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. తననే అన్నీ అనుకున్న పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారాడు.



కొన్నితరాల వరకు స్థిరంగా నిలబడిపోయేటటువంటి లోకోత్తరమైన భగవద్గీతను మానవాళికి అందించాడు. తాను అండగా నిలచిన పాండుపుత్రులకోసం మంత్రాంగం నడిపి కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గేలా చేశాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి  మామూలు మానవునిలా బోయవాని చేతిలో మరణించిన కృష్ణుడు యశోగుణ సంపన్నుడు.



ఈ పండగను ఇలా జరుపుకోవాలి

శ్రావణ బహుళ అష్టమినాటి అర్ధరాత్రిపూట సాక్షాత్తూ ఆ పరమాత్ముడే దేవకీదేవి అష్టమగర్భాన జన్మించాడు. భూభారాన్ని తగ్గించడానికి అవతరించినప్పటికీ తన దివ్యప్రేమతో అందరినీ ఉద్ధరించిన అమృతమూర్తి. ఆబాలగోపాలం ఆయన పుట్టినరోజునే జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని  పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top