జ్ఞానమే ముక్తి మార్గం

Interview with swaroopanandendra saraswathi - Sakshi

ధర్మపరిరక్షణలో భాగంగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు పంచారామ పాదయాత్ర చేశారు. ఆగమ పరిరక్షణ కోసం తిరుమల శ్రీవారి ఆస్థానమండపంలో వైఖానస ఆగమ సదస్సు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు గోవులను పంపిణీ చేసి, వారిని ధర్మమార్గం వైపు నడిపిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలలో వేదపాఠశాలలను నిర్వహిస్తూ వేద పరిరక్షణ చేస్తున్నారు.  ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షకోసం హృషీకేశ్‌లో ఉన్న స్వామి వారు 27న దీక్ష ప్రారంభిస్తారు. ఈ పర్వదినాన గురుపూజతోపాటు అనేక కార్యక్రమాలుంటాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ కి ప్రశ్నోత్తరాల రూపంలో అందించిన ప్రత్యేక అనుగ్రహ భాషణమిది.

చాతుర్మాస్య వ్రతం చేయవలసిన సమయం ఏది? ఆ సమయాన ఏమి చేయాలి?  
స్వామీజీ: ఆషాఢ పున్నమినాడు∙మొదలుపెట్టి కార్తీక పున్నమికి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. శ్రీ మహావిష్ణువు నిదురించు కాలమైన ఈ నాలుగు మాసాల కాలంలో ఈ వ్రతాన్ని శైవ,

వైష్ణవభేదం లేక గృహస్థులందరూ ఆహారాది నియమాలను పాటిస్తూ ఆచరించాలి. లోకానికి ఆదర్శంగా నిలచే యతీంద్రులు ఈ చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు. మానవ జన్మ లక్ష్యం ఏమిటి?
విశ్వమంతటికి కారణమైన ఒకే ఒక తత్త్వం ఉన్నది. అదే బ్రహ్మం. దానికే సత్యం, అక్షరం, పురుషుడు తదితర పేర్లు. ఆ బ్రహ్మతత్వమే మనందరి నిజ స్వరూపం. సకల జీవులు ఈ బ్రహ్మ స్వరూపమే అయి ఉన్నారు. దీనికి సరియైన రీతిలో అనుభవంతో తెలిసికొనిన వారికి సంసార  భయం లేదు. దీనికే మోక్షం అని పేరు. ఇదే మానవ జన్మ లక్ష్యం.
 

పిల్లలకు మంచి అలవాట్లు ఎలా వస్తాయి?
భారతీయ సంస్కృతి, నాగరికతను, జీవన విధానాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అలవాటు చేయాలి. అలా చేయాలంటే ముందు వారికి అలవాటు ఉండాలి. తరువాత తమ సంతానానికి అలవాటు చేయగలుగుతారు. అలా ప్రవర్తిస్తుంటే మనం మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము.

దీక్ష అంటే ఏమిటి?
గురువునుండి శిష్యుడు పొందే అనుగ్రçహాన్ని లేక ఉపాసనను దీక్ష అంటారు. ఇది లౌకిక వ్యవహారానికి  సంబంధించినది కాదు. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పాపాన్ని నిర్మూలించేది దీక్ష. శిష్యుడు సరైన మార్గం అనుసరించడానికి ఇచ్చే దీక్ష సమయదీక్ష. యోగమార్గం, మోక్షమార్గాలకు సంబంధించినది నిర్వాణ దీక్ష.

వివాహితకి పతే ప్రత్యక్షదైవమంటారు. మరి దైవం ప్రధానం కాదా?
స్త్రీ దైవాన్ని విడనాడాలని శాస్త్రం చెప్పలేదు. అలాగని దైవారాధనలు చేస్తూ భర్తను విస్మరించమనలేదు. అటు దైవారాధన చేస్తూనే, ఇటు భర్త చెప్పినట్లు వింటూ కుటుంబ జీవితం గడపాలి. అప్పుడు ఆ స్త్రీ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది.

ఈనాటి వేగవంతమైన జీవితంలో మంత్రానుష్ఠానాన్ని సావకాశంగా చేయడానికి కాలం సరిపోవడంలేదు. దీనిని సంక్షిప్తంగా చేసే మార్గం..?
కాలం సరిపోవడం లేదన్నది సరియైన అంశం కాదు. కాలం నీ అధీనంలో ఉంది. నీవు కాలం అధీనంలో లేవు. మనకు శ్రద్ధ తగ్గడం చేత కాలం చాలడం లేదనే సాకు చెపుతున్నాము. నిత్యపూజను, ధ్యానాన్ని క్లుప్త పరచే వీలు లేదు.

కర్మలకు ఫలితం ఉంటుందా?
‘న హి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకత్‌’ శరీరం ప్రతిక్షణం ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. మనిషి పని చేయకుండా ఒక్క క్షణమైనా ఉండజాలడు. అలాగే భూమి తిరగటం మనం చూస్తున్నామా? లేదు. అలా తిరగటం ఒక క్రియ. భూమి తన చుట్టు తాను తిరగటం వలన రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. తిరగటం అనే కర్మఫలితమే రేయింబవళ్ళు. ఇలాగే భూమి సూర్యుని చుట్టు తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. ఈ కర్మ అంతా మనకు కన్పించదు. ఇది అవ్యక్త కర్మ. దీని ఫలితమే రాత్రింబవళ్ళు. ఋతువులు కనిపిస్తున్నాయి.

ప్రత్యక్షదైవాలు ఎవరు?
తల్లిని మించిన దైవం లేద’ని, ‘న మాతుః పరదైవతం’ అన్నారు. ‘మాతృదేవో భవ, పితృదేవోభవ’ అని తైత్తిరీయం. తల్లిదండ్రులను దైవంగా భావించాలని శ్రుతి ఆదేశించింది. తల్లి చల్లని చూపులు లేకపోతే లోకమే లేదు కదా? కరుణామూర్తియైన భగవంతుడే మాతృమూర్తి రూపంలో అందరిని రక్షిస్తున్నాడు. తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరులని భావించి సేవిస్తే అంతకంటె గొప్ప ఉపాసనయే లేదు. ఇది సకల మానవులకు స్వధర్మం.

దేవుడు ఉన్నాడా?
మనకు కనిపించనంత మాత్రాన దేముడు లేడని చెప్పడం సరికాదు. దేముని యీ చర్మచక్షువులతో చూడడం సాధ్యంకాదు. జ్ఞానదృష్టితో అనుభవం ఆధారంగా చూడగలం. వాయువునకు రూపంలేదు. అంతమాత్రాన వాయువు లేదని చెప్పగలమా? వెన్నెల, నక్షత్ర కాంతి, గ్రహసంచారం ఆ పరమాత్ముని అనుగ్రహం వల్లనే కలుగుతున్నాయి. భగవంతుడు సర్వవ్యాపి. ఆయనకు నామరూపాలు లేవు. అది వర్ణనకు అందని చైతన్యం. మనయందే చైతన్యంగా ఉన్నాడు.

దైవసాక్షాత్కారం ఎలా కలుగుతుంది?
దైవసాక్షాత్కారమన్నది మామూలు విషయం కాదు. మన అజ్ఞానం వల్ల యీ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకుంటున్నాము. దృఢచిత్తంతో సద్గురువుని సమీపించి శాస్త్రాధ్యయనం చేసి యీ దేహమే నేను అనే మన అపోహను తొలగించుకోవాలి. అప్పుడు మనకు గల అత్యాశ తొలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమార్గంలో పయనిస్తూ ముందుకు సాగితే భగవదనుభూతి కలుగుతుంది.

దైవీ సంపదతో కూడిన దేవతామూర్తులు గొప్పవా? గ్రహాలు గొప్పవా?
హెచ్చుతగ్గులు అన్నవి లోక వ్యవహార దృష్టిలో సహజం. గ్రçహాలకు ఉన్న శక్తి గ్రహాలకు ఉంటుంది. అందువలన గ్రహశాంతి అవసరం. గ్రహశాంతులు నిత్యం చేసేవి కావు. ఆయా గ్రహాలకు సంబంధించి అవసరమైన కాలంలో గ్రహశాంతులు చేస్తారు. అనునిత్యం దైవారాధన చేయవచ్చు. దైవశక్తి ముందు ఏ గ్రహశక్తియైనా తలవంచవలసిందే.

గ్రామదేవతల ప్రాధాన్యం ఏమిటి?
పరాశక్తి రూపాలు అనేకం. ఈ రూపాలే గ్రామ దేవతలుగా కొలువబడుతూ గ్రామ ప్రజలను మారీ, విషూచ్యాది రోగాల నుండి, భూతప్రేతాల నుండి  కాపాడుతుంటాయి. గ్రామదేవత మందిరం కొన్ని గ్రామాలలో ఊరిచివర ఉంటుంది. ఈ గ్రామ దేవతలకు బహుకొద్ది ప్రాంతాలలో నిత్యపూజలు జరుగుతాయి. మిగిలిన చోట్ల విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు జరుపుతారు. సాధారణంగా గ్రామదేవత పూజ అవైదికంగా ఉంటుంది. గ్రామదేవతలను అందరూ పూజించి నైవేద్యం సమర్పిస్తారు.

దానధర్మాలవల్ల ఫలితం ఉంటుందా?
‘‘యజ్ఞం, దానం, తపశ్చైవ, పావనాని మనీషిణావ్‌ు’’ అని భగవంతుడే చెప్పి ఉన్నాడు. దానం చేత మన దారిద్య్రం తొలగుతుంది. దానం మూడు విధాలు. మనస్సు, వాక్కు, కాయము, మనస్సు ద్వారా, ఇతరులకు శుభం జరగాలనే సంకల్పంతో కాలాన్ని వినియోగించడం.

దానం చేస్తూ తనదైన ఆ వస్తువును యిచ్చివేస్తున్నాననే శంక భావంలో కూడా ఉండరాదు. ఆవిధంగా సత్యహరిశ్చంద్రుడు చేసినట్లు పురాణాలలో తెలుసుకుంటాము. కర్ణుడు, శిబి, మొదలయినవారు. వారంతా తమ దానధర్మాలవల్ల ప్రసిద్ధులయి పుణ్యలోకాలకు వెళ్ళారు.

అర్చనలో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎందుకు ?
భగవంతుడు సర్వవ్యాపి. యావత్తు సృష్టిని ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనను మించి వ్యాపకం గల వస్తువు వేరొకటి లేదు. పంచభూతాలు అంటే పృథ్వి, ఆప, తేజో, వాయు, ఆకాశాల ఆధారంగా యీ సృష్ఠి కృతజ్ఞతాభావంతో మనం పూజావిధానం ద్వారా ఆయనకు అర్పిస్తున్నాము.

కలలు ఎందుకు వస్తాయి? స్వప్నంలో వచ్చే విషయాలు భవిష్యత్తును సూచిస్తాయా?
జాగ్రదవస్థలో జరిగిన కొన్ని అంశాలు స్వప్నంలో రావడం సహజం. అనేక జన్మల సంస్కారం వల్ల చిత్రవిచిత్రంగా తోచే కలలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో వచ్చినవన్నీ వాస్తం కావాలనే నియమమేది ఎక్కడా చెప్పలేదు. మెలకువలోకి వచ్చినపుడు మాత్రమే మనం స్వప్నం గురించి చెప్పుకుంటూ అది మంచిని సూచిస్తున్నది, లేక చెడును సూచిస్తున్నది అని చెప్పుకుంటాము. ఇది అంతా మన భ్రాంతి.

జపస్థానాన్ని బట్టి ఫలితం మారుతుందా?
మారుతుంది. ఇంటిలో జపం చేసిన ఒక ఫలితమైతే, గోశాలలో దానికి పదింతలు, వనంలో నూరురెట్లు, చెరువునందు వేయింతలు, నదీతీరాన లక్షరెట్లు, పర్వతాగ్రాన కోటిరెట్లు, శివాలయంలో నూరుకోట్ల అధిక ఫలం కలుగుతుంది. గురుసాన్నిధ్యాన చేస్తే అనంత ఫలం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

సత్యం అంటే ఏమిటి?
సత్యానికి పదమూడు రూపాలున్నాయి. వాటిని మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. ఏవిధంగా నంటే సత్యం, శమం, దమం, అమాత్సర్య, క్షమ, లజ్జ, తితిక్ష, అసూయ, త్యాగం, ధ్యానం, ఆర్యత, ధృతి, అహింస ఈ పదమూడున్నూ సత్యానికి ఆకారాలు. అన్ని ధర్మాలూ సత్యంలోనే వెలిసినాయి.

సత్యం అన్ని ధర్మాలకు ప్రాణం. సత్యం లేని అహింస అహింస కాదు. సత్యం లేని ఆచారం దురాచారమే. సత్యం లేని శమాదులు వ్యర్థమే. సత్యం లేని బ్రహ్మచర్యం, తపస్సు, శౌచం అంతా కపట నాటకమే. రావణుడు కూడా తపస్సు చేశాడు. కాని ఆ తపస్సులో సత్యం లేదు. దుర్యోధనుడు సదా అన్నదాననిరతుడు.

కాని ఆ దానధర్మానికి సత్యం అనే ఆధారశిల లేనందున నశించిపోయాడు. సత్యం అనే ధర్మం ఒక్కటుంటే చాలు ‘శతే పఞ్చాశత్‌’ వందలో యాభై అణగి ఉన్నట్లు సత్యంలో అన్ని ధర్మాలు నెలకొన్నాయి. ‘సర్వం పదం హస్తిపదే నిమగ్నం’ అన్నట్లు ఏనుగు అడుగు జాడలో అన్ని ప్రాణులు ఇమిడి ఉన్నట్లు సత్యధర్మం సకల ధర్మాలను తనలో ఇముడ్చుకుంది.

అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనను అంగీకరిస్తుందా?
అద్వైత సిద్ధాంతం విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు. మంత్ర, శిల్ప శాస్త్రాలలో, పురాణాలలో విగ్రహారాధనను గూర్చి వివిరంగా చెప్పారు. స్వర్గలోకప్రాప్తి లేదా చిత్తశుద్ధి ద్వారా క్రమ ముక్తిని గూర్చి తెలిపారు. మందమధ్యమాధికారులకు విగ్రహారాధన అవసరం. తెలిసిన వారు కూడా లోకసంగ్రహం కోసం విగ్రహారాధన చేస్తారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top