డీమ్యాట్‌లో పడేసి ధీమాగా ఉండండి | how to save money? | Sakshi
Sakshi News home page

డీమ్యాట్‌లో పడేసి ధీమాగా ఉండండి

Jan 25 2016 11:18 PM | Updated on Sep 3 2017 4:18 PM

డీమ్యాట్‌లో పడేసి ధీమాగా ఉండండి

డీమ్యాట్‌లో పడేసి ధీమాగా ఉండండి

చాలామంది రకరకాల పెట్టుబడి మార్గాలలో తమ భవిష్యత్తు అవసరాల కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని మదుపు చేస్తూ ఉంటారు.

ఉమన్ ఫైనాన్స్
 
చాలామంది రకరకాల పెట్టుబడి మార్గాలలో తమ భవిష్యత్తు అవసరాల కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని మదుపు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది మహిళలకు తమ భర్త లేదా తమ సంపాదనలో పొదుపు చేసిన సొమ్మును ఏయే మదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టారో తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు తదితర వివరాలు కూడా అంతగా పట్టించుకోరు. మదుపు చేయడం ఎంత ముఖ్యమో, వాటికి సంబంధించిన వివరాలను ఆలుమగలు ఇద్దరూ తెలుసుకొని ఉండటం కూడా అంతే ముఖ్యం. అలాగే తమ తదనంతరం ఆ పెట్టుబడులు ఎవరికి చెందాలో పొందుపరచటం కూడా చాలా అవసరం. ఇదివరకు అన్నీ పత్ర రూపేణా ఉంచేవారు. ఇప్పుడు చాలామటుకు పెట్టుబడులను ఎలక్ట్రానిక్ (పేపర్‌లెస్) రూపంలో ఉంచడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డీ-మ్యాట్ (డీ మెటీరియలైజేషన్) ఒకటి.

మనం బ్యాంకులో ఏవిధంగానైతే డబ్బును ఎలక్ట్రానిక్ రూపంలో వ్యవహరిస్తామో, దాచిపెడతామో అదేవిధంగా డీ-మ్యాట్ అకౌంట్‌లో షేర్లు, బాండ్లు తదితరాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరుస్తారు. డీ-మ్యాట్ ఖాతాను ఎన్‌ఎస్‌డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) / సీడీఎస్‌ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌తో రిజిస్టర్ చేసుకొన్న డిపాజిటరీ పార్టిసిపేంట్స్ (డీపీ) వద్ద ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు తదితరాలను పొందుపరచవచ్చు. డీ-మ్యాట్ ఖాతాని ప్రారంభించటానికి కొన్ని డీపీలు అప్లికేషన్ ఛార్జీని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని డీపీలు ఫ్రీగా కూడా అందజేస్తున్నాయి. ఖాతా నిర్వహణ కోసం వార్షిక నిర్వహణ ఛార్జీని కట్టవలసి ఉంటుంది. ఫిజికల్ షేర్లు ఉంటే డీ-మ్యాట్ ఖాతాలో నమోదు చేయటానికి ఒక్కో ట్రాన్సాక్షన్‌కి నిర్ణీత రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఈ ఖాతా వల్ల ఒనగూడే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.  మీ పెట్టుబడులను వివిధ పెట్టుబడి మార్గాలలో (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, బాండ్స్) పెట్టడం, అలాగే వెనక్కి తీసుకోవటం చాలా సులభం.
     
మీ సెక్యూరిటీస్ దొంగతనం అవుతాయేమోననే భయం ఉండదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్... ఇలాంటివన్నీ ఒకే ఖాతాలో ఉండటం ఆ ఖాతాకి సంబంధించిన స్టేట్‌మెంట్స్ ఎప్పటికప్పుడు అందడం జరుగుతుంది కాబట్టి సరైన టైమ్‌లో అవసరమైన నిర్ణయాలు సులువుగా తీసుకోవచ్చు.మీ పెట్టుబడులకు సంబంధించిన వడ్డీ, డివిడెండ్ మొదలైనవి మీ డీ-మ్యాట్ ఖాతాలో నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు డెరైక్టుగా క్రెడిట్ అవుతాయి. బోనస్ షేర్లు/ రైట్ షేర్లు వస్తే డెరైక్ట్‌గా మీ డీ-మ్యాట్ ఖాతాకు క్రెడిట్ అవుతాయి.మీ తదనంతరం మీ పెట్టుబడులు ఎవరికి చెందాలో వారిని నామినేట్ చేసుకోవచ్చు.
 
ఈ కింది జాగ్రత్తలు తప్పక తీసుకోండి:
మీ బ్యాంకు ఖాతాకు చెక్ బుక్ ఎలాగో ఈ డీ-మ్యాట్ ఖాతాకు డీఐఎస్ (డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్) అలాగ. కనుక ఎవరికీ ఖాళీ డీఐఎస్ ఇవ్వకండి.నామినీని తప్పక రిజిస్టర్ చేయండి.ఒకవేళ మీ బ్యాంకు ఖాతా, అడ్రస్ తదితరాలు మారితే తప్పనిసరిగా ఆ మార్పులను మీ డీ-మ్యాట్ ఖాతాలో కూడా నమోదు చేయండి. ఫోర్జరీ, దొంగతనం, మానవ తప్పిదం, ప్రకృతి వైపరీత్యం మొదలైనవాటి నుండి మీ షేర్లు, బాండ్లు మొదలైనవాటిని కాపాడాలన్నా, పెట్టుబడులను అతి తక్కువ ఖర్చుతో నిర్వహించాలన్నా, ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోళ్లు, అమ్మకాలు చేయాలన్నా డీ-మ్యాట్ ఖాతా తప్పనిసరి.
 
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement