'ఏమిచ్చాన్రా నేను మీకు. ఆస్తులిచ్చానా ఏదైనా ఇచ్చానా?

happiness at home, there is money - Sakshi

జీవితంలో బంధాలు, అనుబంధాలు ఉంటే అంతకు మించిన సిరి లేదు. బడ్జెట్‌లు వస్తాయి. పోతాయి. మధ్య తరగతికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకచోట తగ్గితే ఇంకోచోట పెరుగుతుంది. ప్రభుత్వాల పనే అది.. బ్యాలెన్స్‌ చెయ్యడం! డబ్బుతో.. కిందా మీదా అయ్యే రిలేషన్స్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవడం మన పనే. ఇంట్లో సంతోషం ఉంటే డబ్బు ఉన్నట్లే. సిరిచెట్టు ఉన్నట్లే. ‘డబ్బులు... చెట్లకు కాస్తాయా?’ అంటారు! కాయవు. కానీ సిరిచెట్టుకు సంతోషం కాస్తుంది. అంతకు మించిన సంపద ఏముంటుంది?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌. పెళ్లి మండపంలో వెంకటేశ్, మహేశ్‌బాబు కూర్చొని ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వస్తాడు ప్రకాష్‌రాజ్‌. వచ్చి ఇద్దరి మధ్యా కూర్చుంటాడు. వాళ్లిద్దరూ కొడుకులు. ఆయన తండ్రి. ‘‘ఏమిచ్చాన్రా నేను మీకు. ఆస్తులిచ్చానా ఏదైనా ఇచ్చానా? రెక్కలిచ్చాను... పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా.. మనం ఏమివ్వగలంరా ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప. దానికి మించింది ఇంకేదైనా ఉందేంట్రా? ఆ భగవంతుడిని మన కోసం ఏం కోరుకోనక్కర్లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడి గురించి కోరుకోవాలి. భగవంతుడా నిజాయితీ బతికే ఏ ఒక్కడినీ చిరునవ్వుకు దూరం చేయకు తండ్రీ.. చిరునవ్వు నుంచి దూరం చెయ్యకు’’ అని.. అంటాడు.  చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అనుబంధాల నుంచి. అనుబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బు నుంచా? డబ్బు లేకపోవడం నుంచా? 

కలిమి లేములు.. కష్టసుఖాలు
చేతిలో డబ్బుంటే నొప్పి తెలీదు. నొప్పి తెలియడం లేదని ఖర్చు పెట్టేస్తే చెయ్యే ఉండదు. అదీ డబ్బు వ్యాల్యూ. మరి చేతికి వ్యాల్యూ లేదా? ఉంటుంది. పట్టు విడుపులు ఉన్న చేతికి మాత్రమే ఆ వ్యాల్యూ ఉంటుంది. డబ్బుని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. ఎక్కడ వదలాలో అక్కడ వదలాలి.  పట్టుకోవడం కోసం వదిలేవాడు బిజినెస్‌మేన్‌.   వదల్లేక వదల్లేక పట్టుకునేవాడు టాక్స్‌పేయర్‌.
పట్టు బిగించడం కోసం వదిలేసేవాడు ఇన్వెస్టర్‌. పట్టు విడుపులు పట్టనివాడు కన్‌జ్యూమర్‌. ఏవరేజ్‌ కుటుంబీకుడు.  ఏ బడ్జెట్‌ అయినా టోటల్‌గా ఈ నలుగురి చుట్టూనే తిరుగుతుంది. నిన్న జైట్లీ బడ్జెట్‌ కూడా ఇంతే. సుఖ దుఃఖాలన్నీ ఈ నలుగురివే. లాభ నష్టాలన్నీ ఈ నలుగురికే. ఆర్థిక లోకంలోని స్వర్గం నరకం ఈ నలుగురి కోసమే!  బడ్జెట్‌ని బట్టి కలిమి లేములు.. కష్టసుఖాలు. 

మనుషుల్లోనే ఎక్కువ తక్కువలు
చేతిలో ఉన్న పది నోటు.. అది మిగులైనా, తగులైనా.. అందులోంచి మళ్లీ.. వచ్చే రూపాయి, పోయే రూపాయి అని బడ్జెట్‌ వేసుకునే మనుషులమే మనమందరం. ఊహించని విధంగా వచ్చిన ఒక్క నోటుతో.. స్విచ్‌ వేసినట్లుగా మన ముఖం వెలిగిపోతుంది. ఊహించని విధంగా చెయ్యిజారిన ఒక్క నోటుతో ‘టప్‌’మన్న బల్బులా మన ముఖం మాడిపోతుంది.  డబ్బులో ఎక్కువ తక్కువలుండొచ్చు. డబ్బు దగ్గర మాత్రం అందరూ ఒక్కటే. రూపాయొస్తే సంతోషం. రూపాయి పోతే సారో ఫీలింగ్‌.

లోక్‌సభలో జైట్లీ మొన్న.. సూట్‌కేస్‌ ఓపెన్‌ చేస్తున్నప్పుడు లోపలంతా సీరియస్‌గా కూర్చొని ఉన్నారు. రాష్ట్రపతికీ, ఉప రాష్ట్రపతికీ, గవర్నర్‌లకు జీతాలు పెరుగుతున్నాయ్‌ అని బడ్జెట్‌ చదువుతూ, జైట్లీ ప్రకటించగానే ఎంపీల ముఖాల్లో ఒక్కసారిగా చిరునవ్వులు విరిశాయి! వాళ్లకు పెరిగితే ఆటోమేటిగ్గా వీళ్లకు పెరుగుతాయి. అదీ సంతోషం.
ఎందుకంత సంతోషం? వాళ్లకేం తక్కువ? తక్కువనీ కాదు, ఎక్కువనీ కాదు. పెరగడం సంతోషం. డినామినేషన్‌ ఎంతైనా డబ్బు డబ్బే. అదొక డివైన్‌ గిఫ్ట్‌. మోదీ ఇచ్చేదో, జైట్లీ ఇచ్చేదో కాదు. దేవుడిచ్చిన నోటు. కింద పడిన నోటును ప్రైమ్‌ మినిస్టర్‌ అయినా, ప్రింట్‌ కొట్టేవాడైనా కళ్లకు అద్దుకోవాల్సిందే. 

పెట్టినంత పెట్టాలి
మనిషికి దేవుడు రెండు చేతులు ఇచ్చింది.. పట్టినంత తీసుకుని, పెట్టినంత పెట్టమనే! కోట్‌ బాగుంది. ఎవరి కోట్‌ అయి వుంటుంది? బాగా డబ్బున్న మనిషిదా? డబ్బులేని బికారిదా? చూశారా.. డబ్బున్న వాళ్లను మనిషి అనీ, డబ్బు లేని మనిషిని బికారి అనీ అనేస్తున్నాం. డబ్బు ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఎలా ఉంటారో చెప్పలేం. ఏం ఆలోచిస్తారో చెప్పలేం. కానీ డబ్బు ఉన్నవాళ్ల పట్ల, లేనివాళ్ల పట్ల మనం ఎలాగుంటామో మన మనసుకు తెలుసు. ఎవరు ఎలా ఉన్నా.. ఇవ్వడం అనేది గొప్ప. డబ్బు ఇవ్వడం ఇంకా గొప్ప. కష్టపడి సంపాదించినదాన్ని ఇష్టపడి ఇవ్వడం మరీ మరీ గొప్ప. గొప్పే కానీ, డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విలువ తెలియనివాళ్లకు డబ్బివ్వడం.. డబ్బు అవసరం లేనివాళ్లకు పిలిచి డబ్బివ్వడమే! మన కష్టం విలువను మనం తగ్గించుకున్నట్లు.  తాత్వికులు చాలా చెప్తారు. డబ్బుదేముంది? పోయేటప్పుడు కట్టకట్టుకుపోతామా అని! పోము నిజమే. ఉన్నప్పుడు (డబ్బు కాదు.. మనుషులం) పోయినట్లు ఎందుకుండాలి? ఎలాగూ పోతాం కదా అని  చేతిలోనిది ఎందుకు పోగొట్టుకోవాలి? 

డబ్బుకు ఎన్ని మరకలైనా అంటుకోవచ్చు. చెల్లుబాటు అవుతుంది. ఫిలాసఫీ అంటుకోకూడదు. జీవితాన్ని చెల్లుబాటు కాకుండా చేస్తుంది. ‘డబ్బు బ్రెయిన్‌లో ఉండాలి కానీ హార్ట్‌లో ఉండకూడదు’ అంటాడు జొన్నాథన్‌ స్విఫ్ట్‌. ఆయన సెటైరిస్టు. అందుకని అలా అనలేదు. డబ్బంటే కూడికలు, తీసివేతల లెక్క. లెక్కల్లో గుండె.. పూర్‌ స్టూడెంట్‌. ఆన్సర్లు కరెక్టుగా చేయలేదు. బ్రెయిన్‌.. క్లవర్‌ స్టూడెంట్‌. పర్‌ఫెక్టుగా చేస్తుంది. చివరికి మిగిలిందేదో అదే.. గుండె ఉన్నవాడి ఆన్సర్‌. చివరికి ఏం మిగలాలో అదే.. బ్రెయిన్‌ ఉన్నవాడి ఆన్సర్‌. 

లేనప్పుడే ఉన్నట్లుండాలి
డబ్బు విషయంలో నిజాయితీ, ఉదారత పనికిరావంటాడు చాణక్యుడు. మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని గురువు ఈయన. ఆయన రాసిన ‘అర్థశాస్త్రం’ రెండువేల మూడొందల ఏళ్ల తర్వాత కూడా ఇవాళ్టికీ ప్రపంచ దేశాలకు ఒక ఎకనమిక్‌ గైడ్‌. కష్టం వచ్చినప్పుడు మనిషి దేవుడివైపు చూసినట్టుగా, చేతిలో డబ్బుల్లేనప్పుడు అగ్రరాజ్యాలు సైతం చాణక్యుడి బుక్‌ని తిరగేస్తాయి. ‘పూట గడవడం ఎలా?’ అని తెలుసుకోవడం కోసం. అయితే అంత ‘లేని పరిస్థితి’ ఎందుకొస్తుంది!   ఉన్నవాళ్లు లేనివాళ్లకు ఇస్తే సమాజం ‘ఈక్వల్‌ ఈక్వల్‌’ అవుతుందంటుంది కమ్యూనిజం. ఉన్నవాళ్లు వ్యాపారాలు చేస్తే సమాజం ‘డెవలప్‌’ అవుతుంది అంటుంది క్యాపిటలిజం. ప్రపంచంలో కమ్యూనిస్టులూ ఉన్నారు, క్యాపిటలిస్టులూ ఉన్నారు. సహజంగానే ఈ రెండు ఇజాల మధ్యా క్లాష్‌ మొదలౌతుంది. అభివృద్ధితో సమానంగా అసమానతలూ పెరిగితే క్లాష్‌ కాక మరేమొస్తుంది? చివరికది ‘క్యాష్‌ క్రంచ్‌’కి దారితీస్తుంది. ఏ పాపమూ తెలియని డబ్బు నలిగిపోతుంది. బ్లాక్‌ అయిపోతుంది. అప్పుడు మళ్లీ చాణక్యుడు సీన్‌లోకి వస్తాడు. డబ్బు ఒకేచోట ఉండిపోకూడదు. ఒకే దారిలో తిరక్కూడదు. ఎప్పుడూ ఒకే పని చేస్తుండకూడదు. ఇవన్నీ పెద్ద పెద్దవాళ్లకు. డబ్బే లోకంగా బతక్కూడదు. డబ్బు ఏ దారిలో ఉంటే ఆ దారిలోకి వెళ్లిపోకూడదు. డబ్బును దాచేయడమే జీవిత లక్ష్యం కాకూడదు. ఇవన్నీ చిన్న చిన్నవాళ్లకు. 

బంధాల వల్లే విలువ
చేతి నిండా డబ్బుండీ ఊరికే కూర్చుంటే ఆర్బీఐ గవర్నర్‌ సంతకం ఉన్నా సరే, ఆ డబ్బుకు వ్యాల్యూ ఉండదు!చేతిలో అసలేం లేకుండా అవీ ఇవీ ఇంటికి తెచ్చేసుకుంటూ ఉంటే.. ఎన్ని సౌఖ్యాలున్నా ఆ మనిషికి వ్యాల్యూ ఉండదు.డబ్బుని కష్టపడి సంపాదించాలి. జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. అప్పుడే ఆ డబ్బుకి, ఆ మనిషికి విలువ. ఇలాంటి విలువే బంధాలను, అనుబంధా లను నిలబెడుతుంది. ఆ నిలబెట్టే వ్యాల్యూ ‘మనీ’ది కాదు. మనిషిది!

సుఖ దుఃఖాల లెక్క
చార్ల్‌ డికెన్స్‌ లెక్క ఒకటి ఉంది. వార్షిక ఆదాయం 20 పౌండ్లు. వార్షిక వ్యయం 19 పౌండ్ల 6 షిల్లింగ్స్‌. ఫలితం.. సంతోషం. వార్షిక ఆదాయం 20 పౌండ్లు. వార్షిక వ్యయం 20 పౌండ్ల 6 షిల్లింగ్స్‌. ఫలితం.. విచారం. డబ్బు లెక్క ఇలాగే ఉండాలి. దేశానికైనా, మనిషికైనా. సూట్‌కేస్‌లోని బడ్జెట్‌కైనా, పర్సులోని అరల్లోనైనా. చార్ల్స్‌ ఆర్థికవేత్త కాదు. చాణక్యుడు కాదు. డబ్బుల్లేని మనిషి. డబ్బుల్లేక పస్తులున్న మనిషి. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చడానికి ఉద్యోగం చేసిన మనిషి. తల్లికి, తోబుట్టువులకు ఇంత గోధుమ రొట్టెను సంపాదించడానికి రెక్కలు ముక్కలు చేసుకున్న మనిషి. పుస్తకాలు రాయడం కూడా నాలుగు పౌండ్ల కోసమే చేసిన మనిషి. ‘డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌’ ఆయన ఆటోబయోగ్రఫీ. అందులో డబ్బు గురించేమీ లేదు. కానీ డబ్బున్నవాళ్లు, డబ్బు లేనివాళ్లు, డబ్బంటే ఇంట్రెస్ట్‌ లేనివాళ్లు కూడా చదవాల్సిన పుస్తకం. బుక్‌గా వెయ్యకూడదనుకున్నాడు చార్ల్స్‌ మొదట. ‘నా తలనొప్పులెందుకు ఈ ప్రపంచానికి?’ అనుకున్నాడు. కానీ పబ్లిషర్‌లు వేయించారు. ముందు సీరియల్‌గా (1849–59), తర్వాత బుక్‌గా! బ్రిటన్‌లో ఆ సీరియల్‌ని అప్పట్లో చదవనివారు దాదాపుగా లేరు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top