ఒకే పని... రెండు లాభాలు

Environment Should Take Care Of Both Our Personal Health - Sakshi

డబుల్‌ హెల్త్‌ బెనిఫిట్స్‌

ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న కాలుష్యానికి మున్ముందు మన తెలుగు రాష్ట్రాల నగరాలూ, పట్టణాలూ మినహాయింపు కాదు. కాకపోతే ఇప్పుడు అంతే తీవ్రత ఇక్కడ లేకపోవచ్చు. అటు పర్యావరణం, ఇటు మన వ్యక్తిగత ఆరోగ్యం... ఈ రెండూ బాగుపరచుకుంటూ ఢిల్లీ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా చూసుకోడానికి మనం చేయాల్సిందొకటే.

ఆ ఒక్క పనితోనే ఒనగూరే ప్రయోజనాలు రెండు!! మొదటిది మన ఆరోగ్యం.రెండోది మన పర్యావరణ రక్షణ. ఒకే పనితో రెండు ప్రయోజనాలంటే మనకెంత లాభం! డబుల్‌ బెనిఫిట్‌ కదా. ఒకే దెబ్బకు రెండు పిట్టలు దొరుకుతుంటే మరెందుకు ఆలస్యం. అనుసరిద్దాం. అటు మన దేహ ఆరోగ్యానికీ... ఇటు మన ధరిత్రి ఆరోగ్యానికీ ప్రయోజనాలు చేకూరేలా చేసుకుందాం.

వాకింగ్‌ ఇలా...
వాకింగ్‌ చాలా మంచి వ్యాయామం అన్నది అందరికీ తెలిసిన విషయమే. వాకింగ్‌ను కేవలం వ్యాయామంలా మాత్రమే గాక... వీలైనంత వరకు చిన్న దూరాలకూ ప్రతి రోజూ చేస్తూనే ఉండాలి. దీంతో మనకు రెండు లాభాలు. మొదటిది మోటార్‌సైకిల్‌గానీ, కార్లుగానీ ఉపయోగించనందున కర్బన కాలుష్యం తగ్గుతుంది. ఇక మనలో చాలామంది వాకర్స్‌ క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తూనే ఉంటారు. ఉదయాన్నే ఆరుబయటకు వెళ్లి వాకింగ్‌ చేయలేని చాలామంది ట్రెడ్‌ మిల్‌ని ఉపయోగిస్తుంటారు. మనం స్విచ్‌ ఆన్‌ చేసే ప్రతి విద్యుత్‌ ఉపకరణం వాతావరణ కాలుష్యానికి దోహదం చేస్తుంటుందన్న విషయం మనకు తెలిసిందే.

కాబట్టి నడక వ్యాయామం చేయాలనుకున్నవారు వీలైనంత వరకు ఆరుబయటే వాకింగ్‌ చేయడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు. మొదటిది విద్యుత్‌ వినియోగం తగ్గి వాతావరణం బాగుపడుతుంది. రెండోది ఆరుబయట నడకతో తాజా ఉదయపు తాజాగాలి పీల్చడం వల్ల దేహ ఆరోగ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం... రెండూ మెరుగవుతాయి. అయితే ఏదైనా కారణాల వల్ల ఆరుబయట వాకింగ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంటే ఎలక్ట్రిసిటీ సహాయం లేకుండా కాళ్లతోనే వెనక్కు నెడుతూ నడిచే ట్రెడ్‌మిల్‌ మిషన్‌తోనే వాకింగ్‌ చేయడం చాలా మంచిది.

చిన్న దూరాలకు సైకిల్‌
ఈమధ్య మనం కొద్దిపాటి దూరాలకు కూడా మోటార్‌సైకిల్‌ లేదా మోటార్‌ వాహనాన్ని ఉపయోగించడం బాగా పెరిగిపోయింది. మనం సైకిల్‌ను ఉపయోగిస్తే రెండు లాభాలు చేకూరతాయి. మొదటిది మన దేహానికి మంచి వ్యాయామం. దీనివల్ల మోకాళ్లు, కాలి కండరాలు బలంగా మారతాయి. సైక్లింగ్‌ వల్ల మోకాళ్ల నొప్పులు పెరుగుతాయని కొందరు అపోహ పడుతుంటారు.సైక్లింగ్‌లో మన బరువు మోకాళ్ల మీద పడదు. కాబట్టి అది వాస్తవం కాదు.

అప్పటికే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మినహా మిగతావారంతా నిరభ్యంతరంగా సైక్లింగ్‌ చేయవచ్చు. ఇక మోటారుసైకిల్‌ /మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధన ఆదా అవుతుంది. దాంతో వాతావరణంలోకి వెలువడే కర్బన కాలుష్యాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

ఒక మొబైలే వాడండి...
చాలామంది కొత్త కొత్త ఫీచర్లతో కొత్త బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చినప్పుడల్లా తమ పాత మొబైల్‌ మార్చేస్తుంటారు. ఎంతో అవసరమైతేనో తప్ప మీ పాత మొబైల్‌ మార్చకండి. ఎందుకంటే మీరు వాడి పారేసే ఒక సెల్‌ఫోన్‌ భూమిలోకి  చేరాక దాని నుంచి వచ్చే వ్యర్థాలు కనీసం 1,32,000 లీటర్ల నీటిని కలుషితం చేస్తాయి. అది పూర్తిగా చెడిపోయి వృథా పదార్థంగా మారాక దాంట్లోంచి లెడ్, క్యాడ్‌మియం, బ్రోమినేటెడ్‌ వ్యర్థాలు, ఆర్సినిక్‌ వంటి విషపదార్థాలు పర్యావరణంలోకి కలుస్తాయి. ఒకవేళ మీరు మీ క్రేజ్‌ కొద్దీ తప్పనిసరిగా  సెల్‌ మార్చాలనుకుంటే ముందుగా దాన్ని ఎవరైనా అవసరం ఉన్నవారికి ఇవ్వండి.

త్వరగా నిద్ర పోవాలి
మూడు నాలుగు దశాబ్దాల కిందట మనమంతా ఏ ఎనిమిదికో లేదా తొమ్మిదికో పడుకునేవాళ్లం. అయితే ఈ సమయం కాస్తా క్రమంగా వెనక్కుపోతూ ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది చాలా సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. మనం నిద్రపోయే ఒంటిగంట లేదా రెండు వరకూ కేవలం విద్యుద్దీపాలే కాకుండా కంప్యూటర్లు, టీవీ, మైక్రోఓవెన్, మ్యూజిక్‌సిస్టమ్‌ వంటివి కూడా పనిచేస్తుంటాయి. ఫలితంగా విద్యుత్తు వినియోగం పెరగడం, ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్‌ వినియోగం పెరిగి పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే నిద్రవేళలు వెనక్కి వెళ్లడం అటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని, ఇటు పర్యావరణ ఆరోగ్యాన్ని భగ్నం చేస్తోంది.

నిద్రపోయే వ్యవధి తగ్గడం స్థూలకాయానికి దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్‌ వంటి అనేక అనారోగ్యాలు వస్తాయి. పైగా నిద్ర తగ్గడం వల్ల జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్‌ అనే మరో హార్మోన్‌ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టించే హార్మోన్‌. మనం నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైనవన్నీ తింటూ ఉంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం మన ఆరోగ్యానికీ, పర్యావరణినికీ మంచిది.  

నో కూల్‌ డ్రింక్స్‌
మీరు పానీయాలు తీసుకోవాలనుకుంటే కూల్‌డ్రింక్స్‌ బదులు తాజా పళ్ల రసాలే తీసుకోండి. కూల్‌డ్రింక్స్‌ తయారు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో నీళ్లను ఉపయోగించాలి. అంతేకాదు... ఇందులో షుగర్స్‌/ తీపినిచ్చే పదార్థాలు సోడియం బెంజోయేట్‌ వంటి ప్రిజర్వేటివ్స్, సిట్రిక్‌ యాసిడ్, కలర్స్, ఫాస్ఫారిక్‌ యాసిడ్, నీళ్లు, కొంత కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంటాయి. వీటిల్లో పురుగుమందుల అవశేషాలుంటాయని రుజువైంది. కూల్‌డ్రింక్స్‌లోని చక్కెర కారణంగా పిల్లలు/పెద్దల్లో ఊబకాయం వస్తుంది. ఇది డయాబెటిస్‌ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. ఇక కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ దంతాలపై ఉండే అనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ ఎక్కువ కావడం వల్ల క్యాల్షియం మెటబాలిజమ్‌ దెబ్బతింటుంది.

ఫలితంగా ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఉండే కృత్రిమ రంగులు శరీరానికి హానికరం. వీటిని బయటకు పంపే ప్రక్రియలో మూత్రపిండాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు పాడవుతా యి. కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచే రసాయనాల వల్ల పిల్లల్లో అతి ధోరణులు పెరుగుతాయి.. మన డీఎన్‌ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్‌ పరిశోధనలు చెబుతున్నాయి.
డాక్టర్‌ జి. నవోదయ
కన్సల్టెంట్, జనరల్‌ మెడిసన్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top