పిలిస్తే పలికే భక్తసులభుడు

పిలిస్తే పలికే భక్తసులభుడు


అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి అత్రివరదుడిచ్చిన వరానికి అనుగుణంగా దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువుగా  వినుతికెక్కాడు. మాయా ప్రభావితులై దారి తప్పుతున్న మానవులకు జ్ఞానబోధనలకు, ఆచారవ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్ట రక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే దత్తుడు పెద్దపీట వేశాడు.


అందుకే ఆయన బోధగురువుగా మన్ననలను పొందారు. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకంచేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. విష్ణువు ధరించిన అనేక అవతారాలలో ఎంతో సనాతన మైనది, విలక్షణమైనది దత్తావతారం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేస్తాడు. సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహిస్తాడు. దత్త సాంప్రదాయం సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చని తెలుపుతుంది.



దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగ విద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆధ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతో మంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలెందరో ఉన్నారు.



దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒకే సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతి నాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

– దువ్వూరి భాస్కరరావు

శ్రీపాద శ్రీవల్లభ కథాసుధ, దత్తగురుత్రయం గ్రంథాల రచయిత ఈ నెల13న ‘దత్త జయంతి’

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top