దేవుని పని విశ్వాసులందరిదీ

devotional information by prabhu kiran - Sakshi

నిజమైన భక్తి అడుగంటినపుడు మూఢభక్తి రాజ్యమేలుతుంది. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకూ మధ్య తరతరాలుగా బద్ధ వైరం. అప్పట్లో షిలోహు అనే పట్టణంలో ఏలీ అనే ప్రధాన యాజకుని నేతత్వం లోని దేవుని మందిరంలో  దేవుని ‘నిబంధన మందసం’ ఉండేది. కానీ ఏలీ అసమర్థత యాజకత్వంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్న కారణంగా దేవుడు వారి మధ్య నుండి తన సన్నిధిని తీసివేశాడు. యాజకులున్నారు, మందిరముంది, మందసముంది కాని అక్కడ లేనిదల్లా దేవుడే! ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధాల్లో ఆ కారణంగా ఇశ్రాయేలీయులు వరుసగా ఓడిపోయారు.

మందసం తమతో పాటే యుద్ధభూమిలో ఉంటేనైనా గెలుస్తామేమోనన్న మూఢవిశ్వాసంతో మందసాన్ని మందిరంనుండి తొలగించి ఇశ్రాయేలీయులు తమ వెంట ఒకసారి యుద్ధానికి తీసుకెళ్లారు. అయితే ఈసారి మరీ  భయంకరంగా ఓడిపోయారు. పైగా ఫిలిష్తీయులు ఆ మందసాన్ని వారివశం నుంచి తప్పించి చేజిక్కించుకు వెళ్లారు. ఇశ్రాయేలీయుల మధ్య, దేవుని మందిరంలో దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉండాల్సిన ‘నిబంధన మందసం’, దాన్ని కాపాడలేకపోయిన ఏలీ అనే ప్రధాన యాజకుని అసమర్ధత వల్ల, ఇశ్రాయేలీయుల విచ్చలవిడి జీవితంవల్ల శత్రువుల వశమైంది.

నిజానికి ఇశ్రాయేలీయులకు కాదు, వారి దేవునికే శత్రువులు భయపడేవారు. కాని ఇప్పుడు దేవుడు వారితో లేడన్నది రుజువుకావడమేకాక, పవిత్రమైన నిబంధన మందసాన్ని కూడా కాపాడుకోలేక పోయిన నిష్పయ్రోజకులు, దుర్బలులు ఇశ్రాయేలీయులన్న అపవాదు కూడా ఇపుడు దేవుని ప్రజలకొచ్చింది.నాటి మందిరం ఈనాటి చర్చికి, నాటి యాజకులు నేటి పాస్టర్లకు సాదృశ్యం. విశ్వాసుల్లో దైవభయాన్ని నింపి సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత పాస్టర్లది, ఇతర దైవ పరిచారకులది వారి ఆధ్వర్యంలోని చర్చిలది. దైవపరిచారకులు దారితప్పిపోతే  చర్చికొచ్చే విశ్వాసులు ఆత్మీయంగా భ్రష్టులవుతారు. ఆవు చేనిలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? దేవుని పని పూటగడవడానికి, జీవనోపాధికి, ఆస్తులు సంపాదించుకోవడానికి చేసే వత్తి కాదు.

తొలినాళ్లలో కూడా దేవుడు తన ప్రజల్లోని లేవీయులనే ఒక గోత్రీకులను తన సేవకోసం ప్రత్యేకించుకొని వారికి అన్ని గోత్రాలవారికిచ్చినట్టు వాగ్దానభూమిలో భాగాలివ్వకుండా ‘నేనే మీ స్వాస్త్య భాగమన్నాడు’. వారికి కావాలనే భూములు, ఆస్తులివ్వలేదు. ఆ లేవీయులైన యాజకులు పవిత్రంగా, నిబద్ధతతో పని చేసినంతకాలం అక్కడి మందిరం కూడా పవిత్రంగా నిలిచింది, ప్రజల్లో దేవుని భయాన్ని నింపి వారిని  సన్మార్గులను చేసింది. ఆ తర్వాత ఏలీ లాంటి అసమర్థులు, అపవిత్రులు, దేవునికన్నా తమ సంతానాన్నే ఎక్కువగా ప్రేమించే యాజకుల హయాంలో ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది, ప్రజలు మార్గం తప్పి భ్రష్టులయ్యారు.

పరిస్థితి అప్పుడూ ఇప్పుడూ అంతే. ఏ చర్చి చూసినా ఏమున్నది గర్వకారణం? అన్నట్టుగా ఉన్న నేటి పరిస్థితుల్లో అక్కడి అవినీతిని, అపవిత్రతను రూపుమాపేందుకు విశ్వాసులే పూనుకోవాలి. ప్రేమ, క్షమ, నిబద్ధత, నిస్వార్థతకు నిలయంగా ఉండాల్సిన పాదిర్లు, చర్చిలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే దేవుడు లేని, నిబంధన మందసమూ లేని నాటి షిలోహు మందిరం లాగా ప్రాభవం కోల్పోయిన శిథిలాలే మిగులుతాయి. పుష్కలంగా, కష్టపడకుండా డబ్బు దొరికే రంగాల్లోని వారు తమ పిల్లల్ని కూడా ఆవే రంగాల్లోకి వారసులుగా తెస్తుంటారు. ఈనాడు దేవుని సేవలో కూడా అదే చూస్తున్నాం. అయితే  డబ్బే ప్రధానమైన ఏ రంగంలోనైనా దేవుడుండడన్నది వేరుగా చెప్పాలా? దేవుని పని ఒక్క యాజకులది మాత్రమే కాదు విశ్వాసులందరిదీ. చర్చిల్లో, దైవపరిచర్యల్లోని పరిస్థితుల్ని చక్కదిద్దే బాధ్యత కూడా దేవుని ప్రేమించేవారందిరిదీ.
– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top