పరిస్థితిని మార్చే ప్రార్థన

Devotional information by prabhu kiran - Sakshi

పరమ దుర్మార్గులు, క్రూరులు అయిన నీనెవె ప్రజలకు దుర్గతి కలుగబోతోందని ప్రకటించి పరివర్తన చెందేందుకు దేవుడు వారికొక అవకాశమిద్దామనుకున్నాడు. వారికి ఈ విషయం ప్రకటించే బాధ్యతను యోనా అనే ప్రవక్తకిచ్చాడు, అయితే యోనా అవిధేయుడై నీనెవెకు కాకుండా తర్షీషు అనే చోటికి పారిపోయేందుకు ఓడలో ప్రయాణమయ్యాడు. నీనెవె లోని లక్షా ఇరవై వేలమంది ఉజ్జీవానికి  దేవుడు సంకల్పిస్తే, ఆ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తే దేవుడూరుకుంటాడా? యోనా ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుంది.

ఆ విపత్తు యోనా అవిధేయతకు దేవుడు చూపిస్తున్న ఉగ్రత అని తెలుసుకున్న మిగతా ప్రయాణికులు, యోనాను సముద్రంలోకి విసిరేశారు. అక్కడ దేవుడు నియమించిన ఒక మహా మత్స్యం, యోనాను మింగగా, మూడు రోజులపాటు యోనా దాని గర్భంలో మోకరించి పాశ్చ్యాత్తాప ప్రార్థన చేశాడు. తాను నీనెవెకు వెళ్తానని మొక్కుబడి కూడా చేశాడు. అప్పుడు దేవుడాజ్ఞ ఇయ్యగా మత్స్యం అతన్ని ఒడ్డున కక్కి వేసింది.

వెంటనే యోనా నీనెవె పట్టణానికి వెళ్లి దేవుని మాటలు ప్రకటించగా, అంతటి దుర్మార్గులూ అనూహ్యంగా సాధువులైపోయి, ఉపవాసప్రార్థనలు చేసి తమ దుర్మార్గతను వదిలేశారు. అంతకాలం దుర్మార్గత అనే దుర్గంధంతో నిండిన నీనెవె పట్టణం, దేవుని ప్రేమ, క్షమ అనే అద్భుతమైన పరిమళంతో నిండిపోయింది. నరకం ఒక్కసారిగా పరలోకంగా మారితే ఎలాఉంటుందో నీనెవెలో ప్రత్యక్హంగా యోనాకు అనుభవమైంది.

రగిలే ఒక నిప్పురవ్వే, ఉవ్వెత్తున లేచే మహాజ్వాలను సృష్టిస్తుంది.. తాను మారి ఉజ్జీవించబడితేనే విశ్వాసి తానున్న సమాజాన్ని మార్చి ఉజ్జీవింప చేయగలడు. దేవుడెవరో ఎరుగని లక్షా ఇరవైవేల మంది నీనెవె ప్రజలను మార్చడం కన్నా, తానెన్నుకున్న, తన సొంతవాడైన యోనాప్రవక్తను మార్చడానికే దేవుడు ఎక్కువగా శ్రమించవలసి వచ్చింది. అంతటి దుర్మార్గులైన నీనెవె ప్రజలూ ఒక్క ప్రసంగంతోనే తాము చేసేది తప్పని తెలుసుకున్నారు. కాని దేవునికెంతో సన్నిహితుడై వుండీ, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా పోవడం తప్పని యోనాకు అనిపించలేదు.

అయితే నీనెవె ప్రజల దుర్మార్గత అయినా, యోనా చూపించిన అవిధేయత అయినా, దేవుని దష్టిలో పాపమే!! నాలాంటి పవిత్రుడు నీనెవె ప్రజలవంటి దుర్మార్గుల వద్దకు పోవడమేమిటి? అనుకున్నాడు యోనా. నువ్వూ , నీనెవె ప్రజలూ సమాన పాపులే అన్నాడు దేవుడు. పాపాల్లో చిన్నవి, పెద్దవి అని లేవు. దేవుని దృష్టిలో ఎంతదైనా, ఏదైనా పాపం పాపమే. పాపి దాని నుండి విడుదల కావల్సిందే. దుర్మార్గులైన పాపులు, ఆంతర్యంలో పాపంతో నిండినా పైకెంతో పరిశుద్ధంగా నటించే వేషధారులు... అంతా దేవుని దృష్టిలో సమానమే.

అయితే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు నీనెవె ప్రజలనూ వదులుకోలేదు, యోనాను కూడా వదులుకోలేదు. మిమ్మల్ని, నన్నూ వదులుకోడు. యోనా ప్రార్థన అతని జీవితాన్ని, నీనెవె ప్రజల ఉపవాస ప్రార్థన వారందరి జీవితాల్ని మార్చింది. కోరికలు తీర్చే ప్రార్థనలు కాదు, జీవితాల్ని మార్చుకునే ప్రార్థనలు ఈ లెంట్‌లో చేద్దాం.

– రెవ.డా.టి.ఏ.ప్రభు కిరణ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top