సాక్షి స్ఫూర్తితో ఇంటిపంటల సాగు!

Cultivation of home crops! - Sakshi

నాలుగేళ్లుగా మేడపై సేంద్రియ ఇంటిపంటలు పండిస్తున్న ఎలిజబెత్‌

‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్‌ స్ఫూర్తితో చీరాల రూరల్‌ మండలం రామకృష్ణాపురం మండలం సిపాయిపేటకు చెందిన తేళ్ల ఎలిజబెత్‌ తమ ఇంటిపై సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఎమ్మే బీఈడీ చదివిన ఆమె ప్రైవేటు స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తుండగా భర్త సంజీవరావు ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో తమ మూడంతస్తుల భవనంపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. బాల్యం నుంచే ఆమెకు మొక్కల పెంపకంపై ఆసక్తి మెండు. వివాహానంతరం మెట్టినింటికి వచ్చిన తర్వాత మూడో అంతస్తులో నివాసం కావడంతో మొక్కల పెంపకానికి కొంతకాలం దూరమయ్యారు. ఆ దశలో ‘ఇంటిపంట’ కాలమ్‌ స్ఫూర్తితో గత నాలుగేళ్లుగా మేడపైన సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పెంచుతున్నారు. ఇంటిల్లిపాదీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు తింటున్నారు.

ఇసుక, ఎర్రమట్టి మిశ్రమం..
ఎర్రమట్టిలో పావు వంతు ఇసుకను కలిపి కుండీల్లో నింపి మొక్కలు నాటి, తర్వాత నెలా రెండు నెలలకోసారి గేదెల పేడ ఎరువును వేస్తూ ఉంటానని ఎలిజబెత్‌ తెలిపారు. చీడపీడల నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి లీటరు నీటిలో 10 ఎం.ఎల్‌. వేప నూనె కలపి పిచికారీ చేస్తున్నారు.  మొదట ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభించి క్రమంగా కూరగాయలు, పండ్ల సాగు చేపట్టారు. 16 పాత ఎయిర్‌కూలర్ల అడుగు భాగాలను సేకరించి వాటిల్లో టమాటా, వంగ తదితర కూరగాయలు పండిస్తుండటం విశేషం. తక్కువ లోతు, ఎక్కువ వెడల్పు గల టబ్‌లలో చుక్కకూర, పాలకూర, గోంగూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు.

పండ్ల మొక్కల సాగుకు లోతైన టబ్‌లు, బక్కెట్లు వాడుతున్నారు.వాటర్‌ యాపిల్, దానిమ్మ, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, నారింజ, అరటి, బొప్పాయి, కమల, వాటర్‌ యాపిల్, మామిడి, పనస, పంపర పనస, అంజూర, డ్రాగన్‌ ఫ్రూట్, ద్రాక్ష, బత్తాయి. కర్బూజ, చెర్రీ, ఉసిరి మొక్కలను పెంచుతున్నారు. కర్బూజ, వాటర్‌ యాపిల్, సీడ్‌లెస్‌ నిమ్మ, స్వీట్‌ నిమ్మ, జ్యూస్‌ నిమ్మ రకాల మొక్కలు కాయలతో కళకళలాడుతున్నాయి. నాలుగైదు రకాల గులాబీలు, మందారాలు, చేమంతులను పెంచుతున్నారు.
– కొప్పోలు వాసుబాబు, సాక్షి, చీరాల రూరల్, ప్రకాశం జిల్లా

ఇంటిపంటలు ఎంతో రుచికరం..
సేంద్రియ ఎరువులతో కుండీలలో పెంచిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎంతో రుచిగా ఉంటున్నాయి. చాలా వరకు మా మేడపైన పండిన కూరలే ఇంటిల్లిపాదీ తింటున్నాం. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ఇంటిపంటలకు సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాలు లేని వారు డాబాలపై కుండీలు ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకోవచ్చు. మంచి ఆహారం లభించడంతో పాటు మొక్కల్లో పనిచేస్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది.  
– తేళ్ల ఎలిజబెత్‌ (74167 06209), సిపాయిపేట, చీరాల రూరల్‌ మండలం, ప్రకాశం జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top