Organic Products
-
ఆర్గానిక్ ఎగుమతులకు చక్కని అవకాశాలు
న్యూఢిల్లీ: సేంద్రీయ ఉత్పత్తుల (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించని) ఎగుమతులకు చక్కని అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే మూడేళ్లలో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరుకోవచ్చన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) ఎనిమిదో ఎడిషన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. సేంద్రీయ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాణాలు, పారదర్శకత, నిబంధనలపై ఇందులో స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రస్తుతానికి ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,000–6,000 కోట్లుగా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.20,000 కోట్లను సులభంగా చేరుకుంటాం. ప్రస్తుత స్థాయితో పోల్చితే 3–3.5 రెట్లు’’అని తెలిపారు. అంతర్జాతీయంగా రూ.లక్ష కోట్ల మేర సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, రానున్న సంవత్సరాల్లో ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇది భారత్‌కు చక్కని అవకాశమని, దీన్ని జారవిడుచుకోరాదన్నారు. సేంద్రీయ సాగును ఎక్కువ మంది రైతులు చేపట్టిన దేశాల్లో భారత్ కూడా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ రంగం వృద్ధికి అవసరమైన పరిష్కారాలతో స్టార్టప్‌లు ముందుకు రావాలని పిలపునిచ్చారు. భారత సేంద్రీయ ఎగుమతుల రంగాన్ని బలోపేతం చేయడం, 2030 నాటికి 2 బిలియన్ డాలర్ల విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులను చేరుకునే లక్ష్యాలతో ఎనిమిదో ఎడిషన్ ఎన్పీవోపీని విడుదల చేయడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేంద్రీయ ఉత్పత్తులకు విశ్వసనీయత పెంచడం, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రమాణాలను పెంచడంలోనూ ఎన్‌పీవోపీ కీలక పాత్ర పోషిస్తుంటుంది. -
రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్‌టీ ఘజియాబాద్‌లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి. అంతా కల్తీ.. తినేదెలా? అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం పాడితో కూడి.. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్‌ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశోధించి.. పరిశీలించి.. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ఒకే సీజన్లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం, ఎన్జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్ సీడ్ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్ కంటెంట్ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్ రకం గురించి అన్వేషిస్తే బ్లాక్ రైస్ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్‌కి బాగా డిమాండ్ ఉంది. మన దేశంలో మణిపూర్‌లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్ రైస్ తెస్తున్నా. అలాగే కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం. -
ఎఫ్ఎంసీజీ.. ఆరోగ్య‘మస్తు’!
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది. గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి. ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం. అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఫిట్నెస్.. లైఫ్ స్టయిల్... నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ. డిమాండ్ ఫుల్.. సరఫరా డల్కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు
పిఠాపురం: రసాయన ఎరువులకు స్వస్తి పలికి సేంద్రియ సాగులో ముందడుగు వేసిన ఏపీ రైతులు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇతర దేశాల చూపు పడింది. రసాయనాలతో సహజత్వం కోల్పోయిన భూముల్లో తిరిగి సత్తువ పెంచేందుకు మన రైతులు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు. రసాయనాల వాడకంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులు చేసిన కృషి ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తోంది. గడచిన ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రకృతి వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల ప్రతినిధులు, ఆయా దేశాల్లోని ఔత్సాహిక రైతులు మన రాష్ట్రానికి వచి్చన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐల రాకతో కాకినాడ జిల్లాలో మారుమూల గ్రామమైన గొల్లప్రోలు మండలం దుర్గాడ వస్తున్నారు. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారో తెలుసుకుని.. ఏయే సందర్భాల్లో వాటిని వినియోగించాలని, ప్రకృతి సాగు ఎలా చేయాలనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది మాది ఆంధ్రప్రదేశ్. నా చిన్నతనంలోనే అమెరికాలో సెటిలయ్యాం. అమెరికాలో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన పంటలకు మంచి గిరాకీ ఉంది. రసాయనాలు వాడని వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే కొనడానికి ఇక్కడివారు ఇష్టపడుతున్నారు. అందుకే ఇక్కడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి అమెరికాలో ఈ తరహా పంటలను పండించేందుకు ప్రయతి్నస్తున్నాం. అందుకే.. దుర్గాడ గ్రామానికి వచ్చాం. ఇక్కడి రైతులు అన్ని రకాల సేంద్రియ ఎరువులు, మందులు తయారు చేస్తున్నారు. బయో ఇన్పుట్ సెంటర్లు నిర్వహిస్తూ ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, మందులు సరఫరా చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సైతం మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గత ఐదేళ్ల నుంచే ప్రకృతి వ్యవసాయం పెరిగిందని రైతులు చెప్పారు. – ఎన్.దేవి, ఎన్ఆర్ఐ, కాలిఫోర్నియా, అమెరికాప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం పెరిగింది గత ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాం. ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభించి వివిధ రకాల పద్ధతులతో నిత్యం ఆదాయం వచ్చేవిధంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం. శాస్త్రవేత్తలు, ఎన్ఆర్ఐలు మమ్మల్ని సంప్రదించి ప్రకృతి వ్యవసాయ సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. మా గ్రామంలో బయో ఇన్పుట్ సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నాం. మా ప్రాంతంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు విదేశీయులు రావడం గర్వకారణం. – గుండ్ర శిశచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ విదేశీ ప్రతినిధులు వస్తున్నారు కాకినాడ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం, జీవ ఉ్రత్పేరకాలు, బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ని కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, మీనామృతం, చిల్లీ స్పెషల్ కషాయం, లింగాకర్షణ బుట్టలు, ఎల్లో–బ్లూ స్టిక్కీ ప్లేట్స్, పీఎండ్స్ (నవధాన్యాల విత్తనాలు) ఎలా తయారు చేస్తారనే విషయాలపై ఎన్ఆర్ఐలు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నారు. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు దుర్గాడ వచ్చి ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్నారు. మరికొందరు విదేశీయులు త్వరలో రానున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
దేశంలో వివిధ రంగాల్లో అనేక స్టార్టప్‌లు పురుడు పోసుకుంటున్నాయి. విభన్నమైన వ్యూహాలతో విజయ పథంలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విజయవంతమైన పలు స్టార్టప్‌లు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి టెండ్రిల్స్ నేచురల్స్.మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ సూక్ష్మ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం పని చేస్తుంది. ప్రారంభంలో తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతుల ద్వారా ఈ మొక్కల నుంచి సేకరించిన నూనె నుంచి సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు.తర్వాత క్రమంగా పలు సేంద్రియ ఉత్పత్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించారు. మహిళలు తయారు చేసిన చేతి ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా నెలకు రూ.5 లక్షలకు పైగా విక్రయాలు చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మరిన్ని ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని ఆఫ్‌లైన్ స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీని వ్యవస్థాపకుడు చెబుతున్నారు. -
ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రీయ ఉత్పత్తుల నాణ్యత పెంచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడకుండా, రైతులకు వ్యయప్రయాసలను తొలగిస్తూ ఇకపై రాష్ట్రంలోనే ధ్రువీకరణ సర్టిఫికెట్ పొందొచ్చు. ఈ సర్టిఫికెట్ జారీకి సేంద్రీయ ధ్రువీకరణకు వ్యవసాయం, ఆహారశుద్ధి ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి అనుమతినిచి్చంది. ఫలితంగా సేంద్రీయ పంట ఉత్పత్తులకు రైతులు గిట్టుబాటు ధర పొందడంతో పాటు ఆ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. సర్టిఫికేషన్ ఉంటే ’ఏపీ’కి తిరుగేలేదు ఏపెడా లెక్కల ప్రకారం సేంద్రీయ సాగులో మన దేశం 8వ స్థానంలో, ఉత్పత్తిదారుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో 1.07 కోట్ల ఎకరాల్లో సేంద్రీయ పంటలు సాగవుతున్నాయి. వాటిలో 65.73 లక్షల ఎకరాలు వాస్తవ సాగు ప్రాంతం కాగా, 41.51 లక్షల ఎకరాలు అటవీ ప్రాంతం. ధ్రువీకరించిన సేంద్రీయ ఆహార ఉత్పత్తులు 3.50 మిలియన్ మెట్రిక్ టన్నులు. వాటిలో రూ.7078 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో విదేశాలకు ఎగుమతవుతున్నాయి.పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే రాష్ట్రంలోని ఉత్పత్తులకు సర్టిఫికేషన్ లేకపోవడం ఎగుమతులకు ప్రధాన సమస్యగా మారింది. దీంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆక్వా ఉత్పత్తులు, ఉద్యాన పంటలకు క్రాప్ సర్టిఫికేషన్ చేసుకునే రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. మూడేళ్లలోనే ఏపీకి గుర్తింపు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 8.50 లక్షల ఎకరాలు సాగవుతున్నప్పటికీ, ఎపెడా లెక్కల ప్రకారం పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగయ్యే విస్తీర్ణం 60 వేల ఎకరాలే. దిగుబడులు 20వేల టన్నులు వస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఇంటర్ననేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులే జరుగుతున్నాయి. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటే రూ.2 వేల కోట్లకు పైగా జరుగుతుందని అంచనా వేసింది. జాతీయ సేంద్రీయ ఉత్పత్తుల కార్యక్రమం (ఎన్పీఓపీ) కింద దేశంలో 37 సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలున్నాయి. వాటిలో ఏపీ, తెలంగాణాతో పాటు 14 రాష్ట్ర ప్రభుత్వ, 23 ప్రైవేటు ఏజెన్సీలకు గుర్తింపు ఉంది. మూడేళ్లలోనే ఏపీకి ఈ గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ విభాగం సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సేంద్రీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఎన్పీఓపీ నిర్దేశించిన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్లను తనిఖీ చేసి ధ్రువీకరించేందుకు ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఎస్సీఏ)కి అనుబంధంగా 2021–22లో ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్ఓసీఏ)ని ఏర్పాటు చేశారు. క్వాలిటీ మేనేజర్ పర్యవేక్షణలో జోన్‌కి ఒకరు చొప్పున ఇద్దరు ఎవాల్యుయేటర్స్, జోన్‌కి ఇద్దరు చొప్పున నలుగురు ఇన్స్పెక్టర్స్/ఆడిటర్స్‌ను నియమించారు.ఈ విభాగం ద్వారా తొలి దశలో పొలం బడులు, తోటబడుల ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికేషన్, రెండో దశలో సేంద్రీయ సాగు పద్ధతుల్లో పండించే ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీ చేయాలని సంకలి్పంచారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటికీ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ జారీకి లైసెన్సు జారీ చేసింది. పొలం బడులు, తోట బడులు ప్రామాణికంగా 2023 ఖరీఫ్ సీజన్ నుంచి గ్యాప్ సర్టిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సర్టిఫికెట్తో రైతులు మద్దతు ధరకంటే 2, 3 రెట్ల ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతున్నారు.ధ్రువీకరణ ఇలా..⇒ సీజన్‌వారీగా ఇప్పటికే సాగయ్యే వ్యవసాయ, ఉద్యాన పంటలు (ఫీల్డ్ క్రాప్స్)కు 2 ఏళ్లు, పండ్ల తోటలకు మూడేళ్ల పాటు సాగు పద్ధతులను పరిశీలించిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ ఇప్పటికే గ్యాప్ సర్టిఫికేషన్‌తో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే పంట ఉత్పత్తులకు రిజి్రస్టేషన్ చేసుకుంటే నిర్దేశిత కాలపరిమితిలో ప్రమాణాలు పాటిస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంది ⇒ సేంద్రీయ వ్యవసాయం కోసం తప్పనిసరిగా భూమిని మార్చాలి ⇒ సేంద్రీయ పద్ధతుల్లోనే సాగు చెయ్యాలి ⇒ ఇన్పుట్స్ అన్నీ సహజంగానే ఉండాలి ⇒ కలుపు మొక్కల నివారణతో సహా తెగుళ్లు, వ్యాధులను సహజ పద్ధతుల్లో మాత్రమే నియంత్రించాలి ⇒ 25 ఎకరాల లోపు సన్న, చిన్న కారు రైతులతో పాటు 25 ఎకరాలకు పైబడిన పెద్ద రైతులతో 25 నుంచి 500 మంది సభ్యులతో కూడిన రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాసెసర్స్, రిటైలర్స్, ఎగుమతిదారులు ఎవరైనా సేంద్రీయ సాగు కోసం రిజి్రస్టేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ⇒ దశలవారీగా తనిఖీలు, పరీక్షల అనంతరం సర్టిఫికేషన్ ఇస్తారు ⇒ వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులతో పాటు సమీప భవిష్యత్తులో అటవీ సేకరణలు, ఏపి కల్చర్, ఆక్వా కల్చర్, సముద్రపు నాచు, జల మొక్కలు, పుట్ట గొడుగుల ఉత్పత్తి, పశువుల ఉత్పత్తుల ప్రాసెసింగ్ అండ్ హ్యాండలింగ్, జంతువుల ఫీడ్ ప్రొసెసింగ్‌కు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేషన్‌తో రైతుకు మేలు సేంద్రీయ ధ్రువీకరణకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఎపెడా గుర్తింపునిచి్చంది. 2027 వరకు లైసెన్సు జారీ చేసింది. ఆ తర్వాత మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. ఈ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు ఉత్పత్తిదారుడి నుంచి వినియోగదారుని వరకు భరోసా లభిస్తుంది. రసాయన అవశేషాల్లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులు పొందే వీలు కలుగుతుంది. మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడడం, ఎగుమతులు పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. మొక్కలు, జంతువుల్లో జీవ వైవిధ్యతను కాపాడేందుకు సేంద్రీయ వ్యవసాయ సుస్థిరత, పర్యావరణ హితమైన ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. –ఎ.త్రివిక్రమరెడ్డి, డైరెక్టర్, ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ -
భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి అమిత్ షా నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సీఓఎల్)– ’భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను ఆవిష్కరించారు. రాబోయే సంవత్సరాల్లో ఇది భారత్ అలాగే విదేశాలలో అత్యంత ‘‘విశ్వసనీయ’’ బ్రాండ్‌గా ఉద్భవించనుందని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా, జాతీయ వృక్ష సంరక్షణ సంస్థ (ఎన్‌పీపీఓ) ఆమోదించిన ప్రస్తుత 34 ల్యాబ్‌ల సంఖ్యను దేశవ్యాప్తంగా మరింత పెంచనున్నట్లు వివరించారు. ప్రారంభంలో ఎన్‌సీఓఎల్ భారతదేశంలో ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుందని, అటు తర్వాత ఇతర దేశాల్లోకి విక్రయాలను విస్తరిస్తుందని అమిత్ షా తెలిపారు. ‘సహకార సంస్థల ద్వారా ఆర్గానిక్ ప్రొడక్టుల ప్రమోషన్’ అన్న అంశంపై ఎన్‌సీఓఎల్ న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సిపోజియంలో ఎన్‌సీఓఎల్ లోగో, వెబ్సైట్, బ్రోచర్, కొన్ని ఉత్పత్తులను కూడా షా ఆవిష్కరించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సేంద్రీయ ఎరువును కూడా ఆయన ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. ఐదు సహకార సంఘాలకు ఎన్‌సీఓఎల్ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ)చీఫ్ ప్రమోటర్‌గా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 కింద ఈ ఏడాది జనవరి 25న ఎన్‌సీఓల్ రిజిస్టర్ అయ్యింది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మూడు కొత్త సహకార సంస్థలలో ఎన్‌సీఓఎల్ ఒకటి. మిగిలిన రెండు సహకార సంఘాలు విత్తనాలు– ఎగుమతుల రంగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 7.89 కోట్ల సహకార సంఘాలు ఉండగా వీటిలో మొత్తం 29 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. -
ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను సేకరిస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్ ఆర్గానిక్స్ బిజినెస్ హెడ్ నిమిత్ దోషి వెల్లడించారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కలిగిన రైతుల నుంచి మార్కెట్ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో అమూల్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమూల్ ఆర్గానిక్స్ ద్వారా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. నిమిత్ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్‌లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్ కో–ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్‌లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, రైతు బజార్ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్సాల్కర్ పాల్గొన్నారు. -
‘అమూల్’.. ఆర్గానిక్
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు. విస్తృత మార్కెటింగ్ రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది. అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకురానుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ మార్కెటింగ్‌కు తోడ్పాటు అందిస్తాం తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు. కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
ఒక కష్టం దశ... దిశను మార్చింది!!
ఓ పండు కన్నతల్లిని కాపాడింది... కన్న బిడ్డను రక్షించింది. ఒక బిడ్డగా ఒక తల్లిగా ఎదురైన అనుభవాలు... ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. కంప్యూటర్స్ నుంచి పంటపొలానికి దారి మళ్లించాయి. పంట పొలం నుంచి పరిశ్రమ దిశగా నడిపించాయి. ‘ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు చాలా సులువుగా ఖర్చు చేయగలుగుతారు. తిరిగి తాము పనిచేసే దేశాల్లో అంత డబ్బును సులువుగా సంపాదించుకోవచ్చనే ధీమా అది. అదే ఎన్ఆర్ఐలు ఇండియాలో వెయ్యి రూపాయలు సంపాదించడం చాలా కష్టం’ అన్నారు చికోటి కీర్తి. జీవితం నేర్పించిన పాఠాలనుంచి ఆమె తెలుసుకున్న జ్ఞానం అది. ‘నా జీవితమే నన్ను నడిపించింది. హైదరాబాద్‌లో కంప్యూటర్ సెంటర్ నిర్వహించి, పెళ్లితో నైజీరియా వెళ్లాను. ముగ్గురు పిల్లల తల్లిగా ఇండియాకి వచ్చి నా సవాళ్లకు జవాబుల కోసం అన్వేషణ మొదలు పెట్టాను. సంజీవనిలాంటి పరిష్కారం దొరికింది. తొగరు పండు నన్ను పారిశ్రామికవేత్తగా మార్చింది’ అని క్లుప్తంగా వివరించారు కీర్తి. విజయవంతమైన కీర్తి ప్రయోగాల జీవితం ఇలా సాగింది. బాబు తక్కువ బరువుతో పుట్టాడు ‘‘నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. బీఎస్సీ కంప్యూటర్స్ చేసి లిబర్టీ సెంటర్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించాను. నాన్న నైజీరియాలో మెకానికల్ ఇంజనీర్, అమ్మ మా కోసం గాంధీ హాస్పిటల్లో గవర్నమెంట్ ఉద్యోగం మానేసింది. మూడు నెలలకోసారి ఎవరో ఒకరు ఇండియా– నైజీరియాల మధ్య ప్రయాణించేవాళ్లం. పెళ్లి కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇక్కడి అబ్బాయితో కుదరడం యాదృచ్ఛికమే. నా పిల్లలు ఇండియాలోనే పుట్టాలనే ఆకాంక్ష కొద్దీ మూడు డెలివరీలకూ ఇండియాలోనే ప్లాన్ చేసుకున్నాను. రెండవసారి గర్భిణిగా ఉన్న సమయంలో సరిగ్గా ఏడవ నెలలో అమ్మ ఆరోగ్యం మా కుటుంబాన్ని కుదిపేసింది. అక్కడ (నైజీరియా) మలేరియా సర్వసాధారణం. అమ్మకు మలేరియా మెదడుకు సోకడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అక్కడ అన్నిరకాల వైద్యం అందించిన తర్వాత ఇండియాకి తీసుకువచ్చి డాక్టర్ సూచనతో నోని ఫ్రూట్ (తొగరు పండు) జ్యూస్ పట్టించాం. ఆమె రికవరీ స్పీడ్ మాకే ఆశ్చర్యం కలిగింది. నా డెలివరీ టైముకు పూర్తిగా కోలుకుని అంతా తనే చూసుకుంది. నాకది మిరకిల్. అయితే ఆ మిరకిల్ నా తదుపరి జీవితానికి ఒక సంకేతమని ఆ తర్వాత తెలిసింది. నాకు బాబు డౌన్ సిండ్రోమ్‌తో పుట్టాడు. బరువు ఒకటిరన్నర కిలోలు. మేము ఏ మాత్రం ఊహించని పరిణామం అది. నాలుగు నెలలు నిండినా బరువు గ్రాము కూడా పెరగ లేదు. డాక్టర్లు ఏ భరోసా ఇవ్వలేకపోయారు. అప్పుడు అమ్మ తనను కాపాడిన నోని జ్యూస్ బాబు ఆరోగ్యాన్ని కూడా బాగు చేస్తుందేమో చూద్దామన్నది. దేవుడి మీద భారం వేసి పట్టించాం. నెల రోజుల్లో ఏడు వందల గ్రాములు పెరిగాడు. అప్పటి నుంచి నోని మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. కంపెనీ మాట మార్చింది మార్కెట్లో ఉన్న నోని ఫ్రూట్ జ్యూస్ కంపెనీలను సంప్రదించాను. ఇదీ అదీ అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సేకరించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. అదే సమయంలో అమ్మ ఆరోగ్య దృష్ట్యా నాన్న బయటి దేశాల్లో ఉండడానికి ఇష్టపడక ఉద్యోగం మానేసి ఇండియాకి వచ్చేశారు. ఆయన తనకంటూ వ్యాపకం కోసం వ్యవసాయం చేయాలనుకున్నారు. అలా పదెకరాల పొలం కొని తొగరు చెట్లను పెంచాం. ఓ కంపెనీ ఇచ్చిన భరోసాతో పంటను యాభై ఎకరాలకు విస్తరించాం. అయితే పంట పెద్ద మొత్తంలో వచ్చే సమయానికి కంపెనీ మాకిచ్చే ధర తగ్గించింది. ఖర్చులు కూడా రానంత తక్కువ ధరకు అమ్మడంకంటే ఈ పండ్లతో మనమే పరిశ్రమ స్థాపిద్దామనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు మా కుటుంబ అవసరాలకు తగినట్లు తయారు చేస్తున్న జ్యూస్, లోషన్, షాంపూ, హెయిర్ ఆయిల్ వంటి మొత్తం పాతిక రకాల ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తయారు చేసి ‘చెక్ బయో ఆర్గానిక్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చాం. మా పొలంలో పండించి తయారు చేయడం వల్ల క్వాలిటీ విషయంలో మోసపోవడం, రాజీ పడడం రెండూ ఉండవు. మా అమ్మను, నా బిడ్డను కాపాడిన ఈ పండులోని ఔషధగుణాలను ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో సంజీవని వంటి ఈ పండును ఎన్ని రకాలుగా అందించవచ్చనే పరిశోధనలు చేస్తున్నాను. ప్రభుత్వ అనుమతుల ప్రకారం సర్టిఫికేట్లతోపాటు నాచురల్ హెల్త్ సైన్స్ అసోసియేషన్ అవార్డు, ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ పురస్కారం అందుకున్నాను’’ అని తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన వైనాన్ని వివరించారామె. ‘పరిశ్రమ స్థాపించిన ప్రతి మహిళ వెనుక ఒక కథ ఉంటుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’ అన్నారు కీర్తి. సంజీవని పండుతో పరిశోధన తొగరు చెట్లు చలిని తట్టుకోలేవు. పాశ్చాత్య దేశాల్లో ఈ పండు మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఈ పంట అక్కడ పండదు. కాబట్టి ఎన్నో ఔషధగుణాలున్న సంజీవని వంటి ఈ పండుకు ప్రచారం కూడా పెద్దగా లభించలేదు. ఈ పండు నేరుగా మన దేహంలోని కణాల మీద పనిచేస్తుంది. అనేక రోగాలను నయం చేస్తుంది. కణాల శక్తిని పెంచి, దేహాన్ని వ్యర్థరహితం, విషరహితం చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా మంచి గుణాన్నిస్తుంది. అనారోగ్యాలు వచ్చిన తర్వాత స్వస్థత కోసం వాడడమే కాదు. మామూలు వాళ్లు కూడా రోజుకు 30 మిల్లీలీటర్ల రసం తాగితే సమగ్రమైన ఆరోగ్యం చేకూరుతుంది. రసాయన రహితంగా తయారు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వచ్చింది. ఆయుష్ అనుమతి కోసం అప్లయ్ చేశాను. – చికోటి కీర్తి ఫౌండర్, చెక్ బయో ఆర్గానిక్స్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
పెండలం ఆకులతో పురుగుమందులు
కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు. శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు. నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్‌పామ్ వీవిల్తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. డీఆర్డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు. కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com డా. సి.ఎ.జయప్రకాశ్ -
Baby Accessories: కిక్స్ – క్రాల్ ఆర్గానిక్ ఉత్పత్తులు
హైదరాబాద్: ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసినట్లు కిక్స్ అండ్ క్రాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. పసి పిల్లల అవసరాలు నెరవేర్చడానికి సంబంధించి తల్లుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమ కంపెనీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తుల్లో ‘ఆర్గానిక్’ విధానానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపింది. పసి పిల్లలకు అవసరమైన క్లాతింగ్, బేబీ యాక్సెసరీస్, మెటర్నిటీ వియర్, సాక్స్ వంటి పలు రకాల ఉత్పాదనల విషయంలో తల్లిదండ్రులకు తమ బ్రాండ్‌పై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడంలో భాగంగా తాజా ప్రొడక్టులను తీసుకువస్తున్నట్లు వివరించింది. తమ సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, అజియో, ఫస్ట్ క్రై, మింత్రా, నైకా ఫ్యాషన్ వంటి మార్కెట్ ప్లేస్ వేదికలపై అన్ని రకాల నాణ్యమైన, విభిన్న ప్రొడక్టులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని వివరించింది. చదవండి: GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్! -
మనసు దోచిన మహానటి
ఆర్తి డెహ్రాడూన్ నుంచి వచ్చింది. మృగాక్షిది హిమాచల్ ప్రదేశ్. అరుణా చద్దా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. రేఖాశర్మ ఉత్తరాఖండ్ మహిళ. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి ఓల్గా, ఇంకా.. గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కశ్మీర్, తమిళనాడు, కేరళల నుంచి వచ్చిన మహిళలు శిల్పారామంలో సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించి, నిన్ననే.. తమ రాష్ట్రాలకు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. వీళ్లందరూ జీవితంలో ఎదగాలనే తపన ఉన్న వాళ్లు మాత్రమే కాదు.. కష్టపడితే కొత్త అభివృద్ధి పథాన్ని నిర్మించడం సాధ్యమేనని నిరూపించాలనే కృత నిశ్చయం కలిగిన మహిళలు. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం కంటే.. చాలెంజింగ్‌గా ఉండే పరిశ్రమల రంగంలో విజయం సాధించడమే అసలైన గెలుపు అన్నది కంప్యూటర్ కోర్సు చేసిన మృగాక్షి భావన. ఆమె కేవలం హెయిర్ ఆయిల్స్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం హిమాచల్ ప్రదేశ్ అడవుల్లోని ఔషధ వృక్షాల నుంచి ఆకులు, బెరళ్లు, వేర్లను సేకరించి, నువ్వుల నూనెలో మగ్గపెట్టి హెయిర్ ఆయిల్స్ చేస్తుంది. ఈ పరిశ్రమ కోసం ఆమె హెర్బల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా చేసింది. ఆర్తి 1990లో డెహ్రాడూన్‌లో అసోసియేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ స్థాపించింది. ఈ సంస్థ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 3,800 మంది రైతులతో అనుసంధానమై ఉంది. వాళ్లు సేకరించిన ముడిసరుకుతో కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌తోపాటు ఔషధతైలాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే చ్యవన్‌ప్రాశ్ వంటి మందులను తయారు చేస్తోందామె. తమ ఉత్పత్తులను తేజస్విని బ్రాండ్‌నేమ్‌తో ఎగ్జిబిషన్లో నేరుగా తానే ప్రదర్శించడంతోపాటు ఆన్లైన్లో మార్కెట్ చేస్తోంది ఆర్తి.ఇక ఉత్తరాఖండ్‌లోని, అల్మోరా కేంద్రంగా పని చేస్తున్న రేఖాశర్మ తన యూనిట్‌ని మహిళలతోనే నడిపిస్తోంది. హ్యాండ్‌మేడ్ సోప్ తయారు చేయడం అంటే ఒక యజ్ఞం వంటిదనీ, సబ్బు తయారీకి మూడు నెలలు పడుతుందని చెప్పింది రేఖ. ‘‘అరోమా ఆయిల్, ఇతర ముడిసరుకులను కలిపి ఆ మిశ్రమాన్ని చెక్క మూసలో పోస్తారు. ఆ మూసలను కదిలించకూడదు. నెల రోజులకు తేమ ఆరిపోయి మిశ్రమం ద్రవ రూపం నుంచి కొద్దిగా గట్టి పడుతుంది. మరో రెండు నెలలకు తేమ పూర్తిగా ఆవిరై పోతుంది. అప్పుడు మూసల్లో నుంచి సబ్బును వేరు చేస్తాం. మిశ్రమం త్వరగా ఆరాలనే తొందరలో మూసలను ఎండకు ఆరబెడితే తేమతోపాటు మిశ్రమంలోని సుగంధం ఆవిరైపోతుంది. నీడలో ఆరబెట్టినప్పుడే సబ్బులో పూల రెక్కల పరిమళం నిలుస్తుంది’’ అని వివరంగా చెప్పింది రేఖ.అరుణ అయితే.. తమ ఉత్పత్తులను కొనమని ఎవ్వరినీ బలవంతం చేయడం లేదు. వచ్చిన వాళ్లందరికీ స్పూన్‌తో తీపి వంటలను రుచి చూపిస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మధ్యప్రదేశ్, మాండ్లాలో స్థానిక గిరిజనుల కోసం ఆమె ఒక కో ఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. ఐదు వేల మంది గిరిజనులకు ముడిసరుకు ఇచ్చి వ్యవసాయం చేయిస్తారు. వారి ఉత్పత్తులను తిరిగి సొసైటీ కొంటుంది. ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చి, వారి చేతనే తయారు చేయిస్తారు. మాండ్లా ఆర్గానిక్ పేరుతో మార్కెట్ చేస్తారు. అరుణ నిర్వహిస్తున్న కో ఆపరేటివ్ సొసైటీలో ఐదు వేల మంది గిరిజనులు మమేకమై ఉన్నారు.పరిశ్రమ నిర్వహించడం ఒక ఎత్తు. అది మెళకువతో కూడిన పని. ఉత్పత్తులను ప్రదర్శించడం మరో ఎత్తు. అది నైపుణ్యంతో కూడిన పని. రేఖాశర్మ, ఆర్తి, మృగాక్షితోపాటు ఆ మేళాలో పాల్గొన్న మహిళలందరిలోనూ ఆ మెళకువ, నైపుణ్యం కనిపించాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఈ ఫెస్టివల్లో జ్యూట్ బ్యాగ్ స్టాల్ కూడా ఉంది. జ్యూట్ బ్యాగ్‌ల మీద మహానటి సావిత్రి ఫొటో ముద్రించి ఉంది. ఫెస్టివల్‌ను చూడడానికి వచ్చిన మహిళలు ఆ స్టాల్ దగ్గర గుమిగూడి పోయారు. సావిత్రిని నేరుగా చూసినంత మురిపెంగా ఆ బ్యాగ్‌లను చేతుల్లోకి తీసుకున్నారు. కేంద్ర మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ– తెలంగాణ రాష్ట్ర మహిళశిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు ‘ఉమెన్ ఆఫ్ ఇండియా– ఆర్గానిక్ ఫెస్టివల్’ జరిగింది. హైదరాబాద్, శిల్పారామంలోని సంప్రదాయ వేదిక ప్రాంగణంలో జరిగిన ఈ ఆర్గానిక్ మేళాలో దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారు. తొంభైకి పైగా స్టాళ్లలో వెయ్యి రకాలకు పైగా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శించారు. రసాయనాలు దేహానికి హాని చేస్తాయని, ఆ హాని నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగిన ఏకైక మార్గం సేంద్రియ ఉత్పత్తుల వాడకమేనని చెప్పింది ‘ఉమెన్ ఆఫ్ ఇండియా– ఆర్గానిక్ఫెస్టివల్. -
సేంద్రియ మహిళా రైతుల బజార్!
తమిళనాడు ప్రభుత్వం స్వయం ఉపాధి సంఘాలకు చెందిన వేలాది మంది మహిళలను సేంద్రియ సాగుకు ప్రోత్సహించడంతోపాటు.. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు దేశంలోనే తొలి మహిళా రైతుల బజార్‌ను ఏర్పాటు చేయటం ప్రశంసనీయం. గ్రామీణ ప్రాంతాల నుంచి సేంద్రియ ఉత్పత్తులను చెన్నై నగర వినియోగదారుల వద్దకు చేర్చడంలో తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్, ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్(ఓఎఫ్ఎమ్) సంయుక్తంగా మహిళా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. చెన్నై వల్లువర్‌కోట్టం హైరోడ్డులోని మదర్ థెరిసా ఉమెన్ కాంప్లెక్స్‌లో ప్రతి నెలా మొదటి శని, ఆదివారాల్లో మహిళల నేతృత్వంలో సేంద్రియ ఉత్పత్తుల బజార్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మహిళా రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులను ఇక్కడకు తెచ్చి విక్రయించుకోగలుగుతున్నారు. కూరగాయలు, పండ్లు, దేశవాళీ రకాల వరి బియ్యం, చిరుధాన్యాల బియ్యం, పప్పుధాన్యాలు, గానుగ నూనెలతోపాటు.. విలువను జోడించిన వివిధ ఉత్పత్తులను మహిళా సేంద్రియ రైతులు విక్రయిస్తున్నారు. ఒకే ఉత్పత్తిపై ఎక్కువమంది దృష్టి పెట్టి ధరపడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. సేంద్రియ సాగు, మార్కెటింగ్‌లో ఆరోగ్యకరమైన పోటీకి అద్దంపడుతున్నారు. తమా ఊరంతా సేంద్రియ సేద్యమే! మా ముత్తాత కాలం నుంచీ మా కుటుంబం వ్యవసాయంలో ఉంది. నేను నాలుగో తరం రైతును. గతంలో సాధారణ వ్యవసాయం చేసి, రెండేళ్ల క్రితం నుంచే సేంద్రియ సేద్యం చేస్తున్నాను. ఎనిమిదెకరాల్లో వరి, మూడెకరాల్లో కాయగూరలు పండిస్తున్నాం. వరిలో పెద్దగా లాభం రాకున్నా కాయగూరల్లో మంచి గిట్టుబాటుంది. గత నెల ఏర్పాటు చేసిన తొలి ఎగ్జిబిషన్ స్టాల్లో ఒకే రోజున రూ.12 వేల విలువైన కూరగాయలు అమ్మాను. రెండోరోజు స్టాల్ ఉన్నా సరకులేకపోయింది. మా ఊళ్లో రైతులంతా సేంద్రియ సాగే చేస్తున్నారు. – జయ, కారణపట్టి గ్రామం, కడలూరు జిల్లా 20 రకాల సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతున్నా.. నా సొంతూరు తిరుత్తణి. తిరువళ్లూరులో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివి కొన్నేళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశాను. సొంత ఊరు, వ్యవసాయంపై మమకారంతో తిరిగొచ్చేశా. వ్యవసాయంతోపాటు గోశాల, చేపల పెంపకం ఉంది. 2012లో పొలం కొన్నప్పటి నుంచి సేంద్రియ సేద్యంలోకి మారాను. నాలుగు తరాలుగా మా కుటుంబాలకు వ్యవసాయమే అధారం. ఉసిరి తదితరాలతో తయారు చేసిన 20 సేంద్రియ ఉత్పత్తులను అమ్ముతాను. సౌందర్య పోషక సామాగ్రిని తయారు చేసి అమ్మటం మా ప్రత్యేకత. ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని తమిళనాడులోని అనేక ఆర్గానిక్ షాపులకు సౌందర్య సామాగ్రిని సరఫరా చేస్తాను. – అనురాధ బాలాజీ, పెరియపాళయం, తిరువళ్లూరు జిల్లా 12 సంవత్సరాలుగా సేంద్రియ ఉత్పత్తులు అమ్ముతున్నా.. బీఎస్సీ చదివాను. 12 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. నాలుగు ఎకరాల్లో వరి, ఒక ఎకరా కొబ్బరి తోట వేశాను. 18 పాడి ఆవులు, 22 బర్రెలు ఉన్నాయి. నేను, మా వారు కలిసి వీటి పనులు చూసుకుంటాం. 7 రకాల దేశవాళీ బియ్యం, నెయ్యి, పసుపు, కొబ్బరి నూనె, వర్మికంపోస్ట్, పంచగవ్య సహా 12 ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నాం. – సీతాలక్ష్మి, అరలికోటై్ట గ్రామం, శివగంగా జిల్లా వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు గర్విస్తున్నా! ప్లస్‌టూ వరకు చదువుకున్నాను. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తూ రైతును అని చెప్పుకునేందుకు గర్వబడుతున్నా. యజమాని పంట పొలాల్లో దిగి పని చేసినప్పుడే కూలీలు కూడా శ్రద్ధగా పని చేస్తారు. రెండెకరాల్లో వరి, ఒక ఎకరాలో పప్పు ధాన్యాలు, ఉసిరి కాయలు, చిరుధాన్యాలను పండిస్తున్నా. ఆరోగ్యదాయకమైన మురుకులు, వాంపొడి వంటి వాటితో చిరుతిళ్లలతోపాటు సుమారు 20 రకాల వస్తువులు తయారు చేసి అమ్ముతున్నాను. ఈ ఉత్పత్తుల వల్ల ఎదుటి వారికి ఆరోగ్యం లభించడం వల్ల నాకు ఆదాయం, పుణ్యం రెండూ లభిస్తున్నాయి. సేంద్రియ సేద్యంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాను. గత నెలలో స్టాల్ పెట్టినప్పుడు మొదటి రోజునే రూ. 15 వేలు, రెండో రోజున రూ. 17 వేలు అమ్మాను. – కవితా ఇళంగోవన్, పులియకుడి, తంజావూరు జిల్లా చదువు రాకపోయినా ఆర్థికంగా నిలదొక్కుకున్నా మా గ్రూప్‌లో 12 మంది మహిళా రైతులం కలసి సేంద్రియ పంటలు పండించి ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కోల్కత్తా, ముంబై తదితర రాష్ట్రాల నుంచి మాకు ఆర్డర్లు వస్తుంటాయి. కొరియర్ ద్వారా సరఫరా చేస్తున్నాం. కొరియర్ ఖర్చులు కూడా వినియోగదారులే భరిస్తారు. 12 రకాల మసాలా వస్తువులు, పది రకాల టీ పొడులు అమ్ముతున్నా. తీరిక వేళల్లో నీలగిరిలోని సేంద్రీయ టీ ఆకు తోటల్లో పని చేస్తున్నా. రాయడం, చదవడం నాకు బొత్తిగా రాకున్నా, సేంద్రియ వ్యవసాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నా. – ఎస్.గోమతి, నీలగిరి ఉద్యోగం వదిలేసి వచ్చా.. బీఈ పాస్సై కొన్నాళ్లు ఐటీ కంపెనీలో పని చేశాను. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఈ రంగంలోకి వచ్చాను. సోప్ నట్స్, శీకాకాయలు, కుంకుళ్లు వినియోగించి 40 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాను. మల్టీపర్పస్ క్లీనింగ్ ల్విక్విడ్ ఎంతో మేలైనది. ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని గడపాలని రెండేళ్ల క్రితం నుంచి ఆర్గానిక్ ఫుడ్ ట్రైనింగ్, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నా. – ప్రియదర్శిని, చెన్నై ఉత్పత్తులకు రైతమ్మలే గిట్టుబాటు ధర నిర్ణయించుకుంటారు! సేంద్రియ ఉత్పత్తులు తినటంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబర్చడం వల్ల అమ్మకాలు సులువైనాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా సేంద్రియ రైతులు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ధర ల విషయానికి వస్తే ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఏమీ లేదు. డిమాండ్, దిగుబడిని బట్టి ధర పలుకుతోంది. మధుమేహ రోగులకు ప్రీతిపాత్రమైన బియ్యం మంచి ధర పలుకుతుంది. రైతులు తమ ప్రాంతాల్లో వనరులు, సాగుబడి ఖర్చులు, మార్కెట్‌కు చేరవేయండం తదితర ఖర్చులను బేరీజు వేసుకొని ఎవరికి వారే గిట్టుబాటు ధరను నిర్ణయించుకుంటారు. స్టాక్ ఎక్కువైనపుడు ధర పడిపోవడం సహజం. నేను రైతును కాను. అయితే, సమాజం, మార్కెటింగ్‌పై ఉన్న అవగాహనతో రైతమ్మలకు మార్గదర్శకం చేస్తుంటాను. – శుభ భరద్వాజ్(94449 26128), సమన్వయకర్త, సేంద్రియ మహిళా రైతుల మార్కెట్, చెన్నై ఉచితంగా స్టాళ్లు.. ప్రయాణ ఖర్చులు సేంద్రియ ఉత్పత్తులకు ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఒకే చోట క్రమం తప్పకుండా ప్రజలకు సేంద్రియ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడానికి ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి నెలా రెండు రోజుల పాటు సేంద్రియ మహిళా రైతులకు స్టాళ్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రయాణ ఖర్చులు, భత్యం కూడా చెల్లించి ప్రోత్సహిస్తున్నాం. – సెంథిల్ కుమార్(97875 04035), తమిళనాడు పౌరసరఫరాలు, మార్కెటింగ్ విభాగం అధికారి, చెన్నై – కథనం: కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
26న హైదరాబాద్ హైటెక్స్‌లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి, సిరిధాన్యాల సాగు– సిరిధాన్యాల ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై అటవీ కృషి, ఆరోగ్య, ఆహార నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 26న అనేక సదస్సుల్లో ప్రసంగించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘సేంద్రియ ఉత్పత్తులు–చిరుధాన్యాలు– సంప్రదాయ వైద్య రీతులు’ పేరిట ఏర్పాటయ్యే మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా ఈనెల 26 (ఆదివారం)న ఉ. 10 గం.–మ.12, మ.1 గం.–4 గం. మధ్య జరిగే సదస్సుల్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారని నిర్వాహకురాలు మాధవి తెలిపారు. రైతులు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ఉచిత సదస్సులకు అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 89782 45673, 81066 44699. ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ ఆంగ్ల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. 28న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం. నుంచి రా. 7 గం. వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979 -
పాల వ్యాపారంలోకి ప్రముఖ నిర్మాత
ఇన్నాళ్లు సినిమా, థియేటర్ల వ్యాపారంతో బిజీబిజీగా ఉన్న నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. 'హ్యాపీ ఆవులు' పేరుతో స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి ఆయన శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగర శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 30 ఆవులను పెంచుతున్నారు. మార్కెట్లో లభిస్తున్న పాలు, కూరగాయల్లో రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్వచ్ఛమైన పాలు, సేంద్రీయ సేద్యంతో కూరగాయలు అందించాలని నిర్ణయానికి వచ్చారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఆవులకు సేంద్రీయ ఆహారం, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు సురేష్ బాబు తెలిపారు. దీంతో అవి స్వచ్ఛమైన పాలను ఇస్తున్నాయన్నారు. డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో కాకుండా స్వచ్ఛమైన పాలకు, బయట దొరుకుతున్న పాలకు ఉన్న తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన ఫాంలోని ఆవు ఇచ్చిన పాలను లీటరు 150 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా రామానాయుడు స్టూడియోని పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదిగా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్బాటిళ్ల స్థానంలో స్టీలు సీసాలను వాడుతున్నామని సురేష్‌బాబు తెలిపారు. -
సాక్షి స్ఫూర్తితో ఇంటిపంటల సాగు!
‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో చీరాల రూరల్ మండలం రామకృష్ణాపురం మండలం సిపాయిపేటకు చెందిన తేళ్ల ఎలిజబెత్ తమ ఇంటిపై సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఎమ్మే బీఈడీ చదివిన ఆమె ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తుండగా భర్త సంజీవరావు ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో తమ మూడంతస్తుల భవనంపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. బాల్యం నుంచే ఆమెకు మొక్కల పెంపకంపై ఆసక్తి మెండు. వివాహానంతరం మెట్టినింటికి వచ్చిన తర్వాత మూడో అంతస్తులో నివాసం కావడంతో మొక్కల పెంపకానికి కొంతకాలం దూరమయ్యారు. ఆ దశలో ‘ఇంటిపంట’ కాలమ్ స్ఫూర్తితో గత నాలుగేళ్లుగా మేడపైన సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పెంచుతున్నారు. ఇంటిల్లిపాదీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు తింటున్నారు. ఇసుక, ఎర్రమట్టి మిశ్రమం.. ఎర్రమట్టిలో పావు వంతు ఇసుకను కలిపి కుండీల్లో నింపి మొక్కలు నాటి, తర్వాత నెలా రెండు నెలలకోసారి గేదెల పేడ ఎరువును వేస్తూ ఉంటానని ఎలిజబెత్ తెలిపారు. చీడపీడల నుంచి ఇంటిపంటలను కాపాడుకోవడానికి లీటరు నీటిలో 10 ఎం.ఎల్. వేప నూనె కలపి పిచికారీ చేస్తున్నారు. మొదట ఆకుకూరలతో ఇంటిపంటల సాగు ప్రారంభించి క్రమంగా కూరగాయలు, పండ్ల సాగు చేపట్టారు. 16 పాత ఎయిర్‌కూలర్ల అడుగు భాగాలను సేకరించి వాటిల్లో టమాటా, వంగ తదితర కూరగాయలు పండిస్తుండటం విశేషం. తక్కువ లోతు, ఎక్కువ వెడల్పు గల టబ్‌లలో చుక్కకూర, పాలకూర, గోంగూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. పండ్ల మొక్కల సాగుకు లోతైన టబ్‌లు, బక్కెట్లు వాడుతున్నారు.వాటర్ యాపిల్, దానిమ్మ, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, నారింజ, అరటి, బొప్పాయి, కమల, వాటర్ యాపిల్, మామిడి, పనస, పంపర పనస, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, బత్తాయి. కర్బూజ, చెర్రీ, ఉసిరి మొక్కలను పెంచుతున్నారు. కర్బూజ, వాటర్ యాపిల్, సీడ్లెస్ నిమ్మ, స్వీట్ నిమ్మ, జ్యూస్ నిమ్మ రకాల మొక్కలు కాయలతో కళకళలాడుతున్నాయి. నాలుగైదు రకాల గులాబీలు, మందారాలు, చేమంతులను పెంచుతున్నారు. – కొప్పోలు వాసుబాబు, సాక్షి, చీరాల రూరల్, ప్రకాశం జిల్లా ఇంటిపంటలు ఎంతో రుచికరం.. సేంద్రియ ఎరువులతో కుండీలలో పెంచిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎంతో రుచిగా ఉంటున్నాయి. చాలా వరకు మా మేడపైన పండిన కూరలే ఇంటిల్లిపాదీ తింటున్నాం. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు ఇంటిపంటలకు సమయం కేటాయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. ఇళ్ల ముందు ఖాళీ ప్రదేశాలు లేని వారు డాబాలపై కుండీలు ఏర్పాటు చేసుకొని పంటలు పండించుకోవచ్చు. మంచి ఆహారం లభించడంతో పాటు మొక్కల్లో పనిచేస్తూ ఉంటే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. – తేళ్ల ఎలిజబెత్ (74167 06209), సిపాయిపేట, చీరాల రూరల్ మండలం, ప్రకాశం జిల్లా -
మట్టి లేని సేంద్రియ ఇంటిపంట!
ఆసక్తి ఉంటే ఇంటిల్లిపాదికీ కావలసినన్ని సేంద్రియ ఆకుకూరలు, తీగ జాతి – చెట్టు జాతి కూరగాయలను మేడపైన పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చని అంటున్నారు పొట్లూరి రాజశేఖర్. మట్టి వాడకుండా.. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులతో భేషుగ్గా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. టెలికం సేవల కంపెనీని నిర్వహిస్తున్న రాజశేఖర్.. రైతు కుటుంబంలో పుట్టి వ్యాపార రీత్యా హైదరాబాద్ బంజారాహిల్స్ 3వ నంబరు రోడ్డులోని శ్రీనికేతన్ కాలనీలో స్థిరపడ్డారు. బయట మార్కెట్లో లభించే సేంద్రియ ఉత్పత్తులు ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని అనుమానాస్పద స్థితిలో సొంతంగా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకుందామని భావించారు. సేంద్రియ ఇంటి పంటల సేవలు అందించే స్టార్టప్ కంపెనీ హోమ్క్రాప్ను సంప్రదించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (నార్మ్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతులు మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి ఈ స్టార్టప్ కంపెనీని గత ఏడాది స్థాపించారు. 7 బెడ్స్.. అనేక పంటలు రాజశేఖర్ ఏడు బెడ్స్(మొత్తం 125 చదరపు అడుగులు)ను 9 నెలల క్రితం ఏర్పాటు చేసుకొని సమృద్ధిగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. చిక్కుడు, దొండ, కాకర, బీర, సొర తీగజాతి కూరగాయలు.. గోంగూర, తోటకూర, పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు.. క్యాబేజి, కాలీఫ్లవర్, వంగ, బెండ, టమాటా వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. మేడపైన గుప్పెడు ఎత్తున ఫైబర్ ఫ్రేమ్ మీద ఫైబర్ షీట్లో (మట్టి అసలు వాడటం లేదు) కొబ్బరి పొట్టు, సేంద్రియ ఎరువులతో కూడిన మిశ్రమాన్ని నింపి.. ప్రతి బెడ్లోనూ చెట్టు జాతి కూరగాయలు లేదా ఆకుకూరలతోపాటు కనీసం ఒక తీగజాతి కూరగాయలను పెంచుతూ చక్కని ఉత్పాదకత సాధిస్తున్నారు. నెలకోసారి చదరపు అడుగుకు అర కిలో చొప్పున (బెడ్‌కు 10 కిలోల వరకు) మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును వేయడం ద్వారా పంటలకు పోషకాల లోపం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. నెలకు రెండు సార్లు వేప నూనెను పిచికారీ చేస్తున్నామని, చీడపీడల సమస్య అంతగా లేదని రాజశేఖర్ వివరించారు. పురుగులు టమాటాలను ఆశిస్తున్నప్పుడు వాట్సాప్‌లో ఫొటో పంపి సలహా తీసుకొని, జీవన క్రిమిసంహారిణిని వాడామన్నారు. ఎర్ర చీమల సమస్య వచ్చినప్పుడు వీరి సలహా మేరకు 50 ఎం.ఎల్. నాన్ ఫ్రూట్ వెనిగర్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేశామని రాజశేఖర్ తెలిపారు. ఒక పూటే తగుమాత్రంగా నీరు చల్లుతున్నామన్నారు. మట్టి లేకుండా సాగు చేసినప్పటికీ ఆయన ఇంటిపంటలు చక్కని దిగుబడులనిస్తున్నాయి. బయటి కూరలు తిన్నప్పుడు రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది! ఇంటిపంటల సాగును ప్రారంభించడానికి తొలుత ఖర్చయినప్పటికీ తదనంతరం పెద్దగా ఖర్చులేమీ లేవు. రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంది. ఎప్పుడైనా బయటి కూరలు తిన్నప్పుడు వాటిలో రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది. బయట మార్కెట్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు లభిస్తున్నప్పటికీ.. అవి ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని స్థితి నెలకొంది. నగరవాసులు ఎవరికి వారు ఇంటిపంటలు పండించుకోవడమే ఉత్తమం. – పొట్లూరి రాజశేఖర్ (98490 94575), శ్రీనికేతన్ కాలనీ, రోడ్డు నంబర్ 3, బంజారాహిల్స్, హైదరాబాద్ కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు.. 40% కొబ్బరి పొట్టు + 40% వర్మీ కంపోస్టు+ 10% జీవన ఎరువులను కలిపిన మిశ్రమంలో ఇంటిపంటలను సాగు చేయిస్తున్నాం. దీని వల్ల మేడపైన బరువుతోపాటు నీటి ఖర్చు కూడా తగ్గుతుంది. బెడ్స్, వర్టికల్ ప్లాంటర్స్, గ్రోబాగ్స్‌ను ఇంటిపంటల సాగుదారులకు అందుబాటులోకి తెచ్చాం. నలుగురున్న కుటుంబానికి 100 నుంచి 125 చదరపు అడుగుల్లో ఇంటిపంటలు సాగు చేసుకుంటే సరిపోతాయి. ఏయే మొక్కల పక్కన ఏయే మొక్కలు వేయాలి? మొక్కల బాగోగులు ఎలా చూసుకోవాలి? వంటి విషయాలను ఇంటిపంటలను కొత్తగా చేపట్టే వారికి తొలి దశలో మా సిబ్బంది నేర్పిస్తారు. మేలైన విత్తనాలూ ఇస్తాం. ఆ తర్వాత కూడా వాట్సాప్, ఫోన్ ద్వారా తోడ్పాటునందిస్తున్నాం. రెండు, మూడు వారాలకోసారి అవసరాలకు తగినట్లు విత్తనాలు వేసుకుంటే ఏడాదంతా ఇంటిపంటలకు కొరత ఉండదు. – ఎల్లు షర్మిలా రెడ్డి (81799 82232),హోమ్‌క్రాప్ డైరెక్టర్ – ఆపరేషన్స్ (homecrop.in) – ఫొటోలు: తూనుగుంట్ల దయాకర్, సాక్షి, ఫొటో జర్నలిస్టు -
శెహభాష్ సాంబిరెడ్డి
వంగా సాంబిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం. కూరగాయల దగ్గర్నుంచి బియ్యం, పసుపు, కందుల వరకు ఇంటికి అవసరమైన చాలా రకాల ఆహార పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఏ రోజైనా మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా రైతు ధరకే తీసుకెళుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి వ్యాపారులు చేను వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి పుట్టెడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగంలో ఈ రైతు సాధించిన విజయం అద్భుతం. అదెలాగో ఆయన మాటల్లోనే... బీటెక్ చదివి ఎంబెడెడ్ ఇంజనీరుగా చెన్నైలో మూడు దశాబ్దాలు సాఫ్ట్వేర్ సంస్థను నడిపాను. స్వస్థలం వల్లభాపురంలో పెద్దల్నుంచి వచ్చిన భూమి కౌలుకిస్తే ఫలసాయం పెద్దగా లేకపోగా, రసాయనాల వాడకంతో ఏటికేడాది సారం తగ్గిపోతోంది. బాధనిపించింది. కంపెనీని కుటుంబసభ్యుల కప్పగించి వచ్చేశాను. భూమి ఆరోగ్యం మెరుగుపడితేనే ఏదైనా సాధించగలం అనిపించింది. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాను. ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయ సూత్రాలను అధ్యయనం చేస్తూ, సాగుకు ఉప్రకమించాను. అయిదేళ్లుగా కష్టనష్టాలకోర్చి చేసిన వ్యవసాయానికి తగ్గ ఫలితాలను ఏడాదిగా చవిచూస్తున్నా.. సహజసిద్ధంగా పంటల సాగు... టూత్‌పేస్ట్‌తో సహా తయారీ రంగంలోని ఏ వస్తువుకైనా గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)ను ఆయా కంపెనీలే నిర్ణయిస్తున్నపుడు.. పండించిన పంట ధరను నిర్ణయించటానికి రైతులకు అవకాశం ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న నా మనసును వేధిస్తుండేది. ఆరోగ్యకరంగా పండించిన నాణ్యత కలిగిన పంటను తీసుకురాగలిగితే, అమ్మకానికి ఢోకా ఉండదు, పైపెచ్చు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందని భావించాను. ఇందుకు ప్రకృతి వ్యవసాయం భేషైన పరిష్కారంగా తోచింది. చిక్కుడు పొలంలో సాంబిరెడ్డి మాకున్న 30 ఎకరాల పొలంలో బిందు సేద్య పద్ధతిలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగుకు ఐదేళ్ల క్రితం ఉప్రకమించాను. రసాయనాల ప్రభావం తగ్గిపోయి, భూమి పూర్తిస్థాయి సహజ స్వభావాన్ని సంతరించుకోవటానికి నాలుగేళ్లు పట్టింది. తెగుళ్లు, పురుగు రాకుండా భూమి నిరోధకశక్తి పెరిగింది. ఏడాది నుంచి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, కుంచనపల్లి నుంచి వ్యాపారులు మా పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలేవైనా కిలో ధర రూ. 30..ఏడాది మొత్తం ఒకటే ధర మరో ఆరు ఎకరాలు తీసుకుని మొత్తం 36 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. పోషకాలు ఎక్కువగా ఉండే బ్లాక్ రైస్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే రకం ఆర్ఎన్ఆర్ 15048, సన్నాలు (005), ప్రగతి రకం (కుర్కుమిన్ 4.62 శాతం) పసుపు, మినుములు, పెసలు, కందులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, శెనగ, ఉలవలు సాగు చేస్తున్నాను. వీటికి తోడు బొప్పాయి, కూర అరటి, దానిమ్మ సాగు చేయబోతున్నాను. సీజనువారీగా చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం వంకాయ, టొమాటో, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, పండుమిర్చి, కాప్సికం, బీట్రూట్, క్యారట్, ముల్లంగి, దోస, సొరకాయ ఉన్నాయి. తర్వాతి సీజనులో బీర, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వేస్తాం. ఏ కూరగాయ అయినా కిలో రూ.30 ధర నిర్ణయించాను. మార్కెట్లో కిలో రూ.10 అయినా, రూ.60కి పెరిగినా నా ధరలో మార్పుండదు. పండించే పంటకు కనీస ధర ఎంతన్నది ముందు తెలిస్తే భరోసా ఉంటుంది కదా! ఎర పంటలతో సమగ్ర సస్య రక్షణ.. మన భూమి ఎంత ఆర్గానిక్ అయినా పరిసరాల్లోని పొలాల్లోంచి తెగుళ్లు, పురుగు వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సస్య రక్షణ చేస్తున్నాం. క్యాబేజి, కాలీఫ్లవర్‌ను ఆశించే పురుగులను ఆకర్షించేందుకు చేను మధ్యలో అక్కడక్కడా ఆవాలు పంట వేస్తున్నా. వాటికి ఆహారంగా ఆవాలు పంటను ఇచ్చి, ప్రధాన పైరును నిరపాయకరంగా తీసుకుంటున్నా. తులసి, కొత్తిమీర, సోంపు, జీలకర్ర, వాము వంటి మొక్కలు తమ వాసనతో పురుగులను నిరోధిస్తాయి. ఇవి పంట నివ్వటమే కాదు, ఇతర పంటల రక్షణకు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎర పంటలు... టొమాటోకు బంతి, వంగకు బెండ.. ఇలా ఒక్కో పంటకు ఒక్కో ఎర పంటను ఉంచుతూ పంట సరిహద్దుల్లో ప్రధాన పైరుకన్నా ఎక్కువ ఎత్తులో ఉండే జొన్న/ మొక్కజొన్న, మొత్తం చేను చుట్టూ అవిశె తోటను పెంచుతూ వస్తున్నా. మిత్ర, శత్రు పురుగులనూ పట్టించుకుంటున్నా. శత్రు పురుగులను అశక్తులను చేసేందుకు పసుపు, నీలిరంగు, నీటిరంగు తరహాలో రకరకాల ట్రాప్స్‌ను చేలో వాడుతున్నాం. మిత్ర పురుగులకు పొలంలో చోటు కల్పిస్తున్నాం. పంటను దెబ్బతీసే శత్రు పురుగుల గుడ్లను ఇవి ఆహారంగా తీసుకుంటూ పంటకు రక్షణ కల్పిస్తుంటాయి. భూమి ఉత్పత్తి శక్తిని పెంచేందుకు... భూమి ఉత్పత్తి శక్తిని పెంచుకొనేందుకు బాక్టీరియా, సేంద్రియ ఎరువు, పొలం వ్యర్ధాలు (కంది పొట్టు, మినప పొట్టు, కాల్చని చెత్తయినా సరే), ఫ్యాక్టరీ వ్యర్ధాలు (వేరుశెనగ పొట్టు, నూనె తీసిన నువ్వుల చెక్క, చెరకు పిప్పిని రెండేళ్లకోసారి వేస్తున్నాం. కానుగ పిండి, వేప పిండి, విప్ప పిండి, ఆముదం పిండిని వాడుతున్నాం. ఉదజని సూచిక(పీహెచ్) స్థాయి, పోషకాలను పరిశీలించుకుని పైన చెప్పిన వాటిలో తగినవి భూమిలో దున్నేశాం. ఆ విధంగా భూమిని ‘సకల పోషకాల గని’గా చేసుకోగలిగాం. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు పోషకాలు అందేలా చూస్తున్నాం. ఇందుకు బాక్టీరియా తోడ్పడుతోంది. వచ్చే ఏడాది వరి సాగుకు బిందు విధానం వాడదలిచాను. పసుపులో 4.62% కుర్కుమిన్‌తో విప్లవం కీలకమైన పసుపు పంటను ఏటా సాగు చేస్తూ 50 శాతం విత్తనాభివృద్ధికి వినియోగిస్తున్నా. ఈసారి 8 ఎకరాల విస్తీర్ణంలో వేశా. దున్నటం అయిపోయింది. ప్రగతి రకంలో 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 4.62 శాతం కుర్కుమిన్ సాధిస్తున్నా. గతేడాది నంద్యాల, విశాఖ ఉద్యాన శాఖల అధికారులు తీసుకెళ్లారు. సాధారణంగా పసుపు వేసిన చేలో పోషకాలు సరిపోవని మరుసటి సంవత్సరం మళ్లీ పసుపు వేయరు. మేం వాడే విత్తనంతో డిసెంబరులో పంట తీసి, జనవరిలో మిర్చి, టొమాటో, వంగ వేశాం. వీటి తర్వాత జూన్‌లో మళ్లీ పసుపు సాగు చేయబోతున్నా. పసుపును వండకుండా, రెండేళ్లుగా నిల్వ చేయడంలోనూ సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నా. సాంబిరెడ్డి పొలంలో పసుపు కొమ్ముల గ్రేడింగ్ పచ్చి పసుపు వినియోగంపై ప్రచారం... పసుపు పంటను ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టగా వచ్చిన కొమ్ముల నుంచి తీసిన పసుపు పొడిని ఇళ్లలో వినియోగిస్తుండటం సాధారణంగా జరుగుతుంది. ఇందుకు బదులుగా అల్లం పేస్ట్‌లాగా పచ్చి పసుపును కచ్చాపచ్చాగ నూరి కూరల్లో వాడుకొంటే పసుపు ప్రయోజనం పూర్తిగా అందుతుంది. దీనినే ప్రచారం చేస్తూ ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలకు శాంపిల్‌గా కొన్ని కిలోలు పంపా. అనుకున్నట్టే ఆదరణ బాగా ఉంది. కిలో రూ.50కి నేను ఇస్తుంటే రూ.80 నుంచి రూ.160లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం విజయానికి నిదర్శనం.. (సాంబిరెడ్డిని 97044 13596 నంబరులో సంప్రదించవచ్చు) సాంబిరెడ్డి తోటలో టొమాటోలు పండుతాయి. తను మార్కెట్‌కు వెళ్లడు. మార్కెట్ తన దగ్గరకు వస్తుంది. తన తోటలో గట్టుమీద కిలోకు 30 రూపాయలు ఇచ్చిపోతున్నారు. టొమాటో కుళ్లిపోయిందని రైతుని పీడించే కుళ్లిపోయిన మార్కెట్ వ్యవస్థను జయించిన మన సూపర్ హీరో రైతు సాంబిరెడ్డి రైతులందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. టొమాటో ఒక్కటే కాదు. చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట ఏదైనా ఆయన చెప్పిందే ధర. అదే ఫైనల్. ప్రకృతి వ్యవసాయదారుడు సాంబిరెడ్డి వల్ల రైతుకు, వ్యవసాయానికి, దిగుబడికి డబ్బే కాదు.. గౌరవం దక్కింది. శెహభాష్ సాంబిరెడ్డి. ఈ పచ్చటి కథ మీదాకా తేవడానికి ‘సాక్షి’ కూడా చాలా గర్వపడుతోంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
సేంద్రియ ఆహారంపై జైవిక్ ముద్ర!
సేంద్రియ వ్యవసాయ/ఆహార ఉత్పత్తుల ప్యాకెట్‌ను షాపు/మాల్లో చేతిలోకి తీసుకునే వినియోగదారులకు ‘ఇది నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించినదేనా?’ అన్న సందేహం కలగడం సహజం. ఈ గందరగోళానికి ఒక ప్రధాన కారణం.. ప్యాకెట్‌పై ఒక్కో కంపెనీ వారు ఒక్కో రకంగా ఉండే సేంద్రియ లోగోను ప్రచురించడమే. సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులకు వచ్చే జూలై నుంచి ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ‘జైవిక్ భారత్’ అనే లోగోను విధిగా ప్యాకెట్‌పై ముద్రించాలని నిర్దేశించింది. జూలై నుంచి ఈ లోగో ముద్రించకుండా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు శిక్షార్హులని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు లేదా రైతు బృందాలు(ఎఫ్.పి.ఓ.లు) తాము పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేటప్పుడు ఈ నిబంధన వర్తించదు! రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్మే దుకాణదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే, దేశ విదేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయించదలచుకునే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్. లేదా థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. మన దేశంలో సేంద్రియ ఆహార నాణ్యతా ప్రమాణాల నియంత్రణకు రంగం సిద్ధమైంది. దుకాణాలు, మాల్స్‌లో విక్రయించే సేంద్రియ వ్యవసాయోత్పత్తుల ప్యాకెట్లపై ఉత్పత్తిదారులు ‘జైవిక్ భారత్’ లోగోను జూలై నుంచి విధిగా ముద్రించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.)’ సేంద్రియ ఆహారానికి సంబంధించి రూపొందించిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 2న గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముసాయిదా ప్రకటించిన ఏడాది తర్వాత గత ఏడాది నవంబర్ 9న ప్రపంచ సేంద్రియ మహాసభల సందర్భంగా విడుదలైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు మాత్రమే జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందేవారు. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్.పి.ఓ.పి. ధృవీకరణ పొందవచ్చు. ఎన్.పి.ఓ.పి. ధృవీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్లిష్టమైనదే కాక, అత్యంత ఖరీదైనది కూడా. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధృవీకరణ వ్యవస్థల్లో(ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పి.జి.ఎస్.) ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్.సి.ఓ.ఎఫ్.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. 2011 నుంచి ఉంది. ఆన్లైన్ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్ సదుపాయం 2015 జూలై నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో సేంద్రియ రైతులే బృందంగా ఏర్పడి సర్టిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ ధ్రువీకరణకు రైతులు ఎటువంటి ఫీజునూ చెల్లించనక్కరలేదు. ఎన్.పి.ఓ.పి./ పి.జి.ఎస్. ఇండియా సర్టిఫికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్ చేస్తాం’ అని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. సీఈఓ పవన్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు.సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేకపోవడం విశేషం. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్.పి.ఓ.పి. ప్రకారం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లోగో లేదా పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. జైవిక్ భారత్ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్లో ఉన్న సేంద్రియ ఉత్పత్తిని పండించిన రైతు ఎవరో ఏమిటో తెలిపే వివరాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు ఉండాలి. పి.జి.ఎస్. ఇండియా «ధ్రువీకరణతో విశ్వసనీయత! వివిధ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతుల బృందాలు పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ పొందితే వారి ఉత్పత్తులకు మార్కెట్లో విశ్వసనీయత, రైతుల నికరాదాయం పెరుగుతుంది. 100కు పైగా రైతు బృందాల బ్రాండ్స్ పి.జి.ఎస్. ఇండియా ద్వారా మార్కెట్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రీజినల్ కౌన్సిళ్ల ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వివరాలకు ఈ వెబ్సైట్ చూడండి: pgsindia-ncof.gov.in ఘజియాబాద్(ఉ.ప్ర.)లోని మా కార్యాలయాన్ని సంప్రదించండి: 0120 2764906, 2764212 – డా. కృషన్ చంద్ర, సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్) సేంద్రియ పశు, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ! జడ్.బి.ఎన్.ఎఫ్. రైతులకూ పి.కె.వి.వై.! పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పి.జి.ఎస్.) ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణను సంపూర్ణంగా సేంద్రియ/ప్రకృతి పద్ధతులను అనుసరించే రైతులందరూ ఉచితంగా పొందవచ్చు. కనీసం ఐదుగురు రైతులు బృందంగా ఏర్పడి, అధీకృత రీజినల్ కౌన్సిళ్ల ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని పీజిఎస్ ఇండియా సేంద్రియ ధ్రువీకరణను పొందవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయడానికైతే ఒక రైతు లేదా కనీసం 50 మంది గల రైతు బృందాలు ఎన్.పి.ఓ.పి. థర్డ్ పార్టీ ధ్రువీకరణను పొందవచ్చు. సేంద్రియ పశుపోషణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు ‘అపెడా’ ద్వారా థర్డ్ పార్టీ ధ్రువీకరణ పొందవచ్చు. ఆహార ధాన్యాలు, కూరగాయ పంటలను పూర్తిగా సేంద్రియ/పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులతో పాటు.. ఆక్వా సాగులో పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే రైతులు సైతం ఉచితంగా పి.జి.ఎస్. ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. దేశవ్యాప్తంగా 722 సంస్థలు(రీజినల్ కౌన్సిల్స్) పి.జి.ఎస్. ధ్రువీకరణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే 2.5 లక్షల మంది రైతులు పి.జి.ఎస్. ఇండియా ధ్రువీకరణ పొందారు. వీరు జూలై నుంచి తమ రైతు బృందం సొంత లోగోతో పాటు.. పి.జి.ఎస్. ఇండియా లోగో, జైవిక్ భారత్ లోగోలను ప్యాకెట్లపై ముద్రించాల్సి ఉంటుంది. – డాక్టర్ టి. కె. ఘోష్, ప్రాంతీయ సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్. సొంత బ్రాండ్‌తో అమ్ముకోవచ్చు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్. ఇండియా వ్యవస్థ ద్వారా ఉచిత సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జె.డి.ఎ.ల ద్వారా లేదా ఎన్.సి.ఓ.ఎఫ్. వద్ద రీజినల్ కౌన్సిళ్లుగా నమోదైన ప్రైవేటు సంస్థల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పి.కె.వి.వై. పథకం అమలు ప్రారంభం కానందున జె.డి.ఎ.ల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందలేరు. అయితే, ప్రైవేటు రీజినల్ కౌన్సిళ్ల ద్వారా ఆంధ్రా రైతులు పి.జి.ఎస్. ధ్రువీకరణ పొందే వీలుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులైనా కనీసం ఐదుగురు బృందంగా ఏర్పడి ధ్రువీకరణ పొందవచ్చు. దుకాణంలో అమ్మినప్పుడు మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ధ్రువీకరణ లోగోతో పాటు, జైవిక్ భారత్ లోగోనూ ముద్రించాలి. – డాక్టర్ వి. ప్రవీణ్‌కుమార్ (092478 09764), శాస్త్రవేత్త, ఎన్.సి.ఓ.ఎఫ్. ఘజియాబాద్ సేంద్రియ/ప్రకృతి సేద్యంపై దృష్టి! పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్.బి.ఎన్.ఎఫ్.), ఛత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల్లోని సేంద్రియ వ్యవసాయ నమూనాలు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం – ధ్రువీకరణ సంబంధిత అంశాలపై రెండేళ్లుగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం నిపుణులతో వివిధ రాష్ట్రాల ఆత్మా పీడీలు, శాస్త్రవేత్తలు, మత్స్య, పశుసంవర్థక శాఖల అధికారులకు పి.జి.ఎస్. ధ్రువీకరణ పద్ధతిపై శిక్షణ ఇప్పించాం. రెండో విడతగా ఇటీవల 3 రోజల పాటు శిక్షణ ఇప్పించాం. వేస్ట్ డీ కంపోజర్‌తో సులభంగా సేంద్రియ సేద్యాన్ని చేపట్టే పద్ధతులను అధ్యయనం చేస్తున్నాం. రైతుకు భవితపై ఆశ కల్పించాలన్న లక్ష్యంతో లాభనష్టాలు చూసుకొని తగిన సేద్య పద్ధతులను అనుసరించాలని చెబుతున్నాం. విస్తరణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రాష్ట్రాల వారీగా వర్కింగ్ పేపర్లు తయారు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నాం. 2019 మార్చి నాటికి అన్ని రాష్ట్రాల వర్కింగ్ పేపర్లూ సిద్ధం చేస్తాం. – వి. ఉషారాణి, డైరెక్టర్ జనరల్, జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్ అతి తక్కువ అవశేషాల పరిమితి! రసాయనిక ఆహారోత్పత్తుల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన రసాయనిక పురుగుమందుల అవశేషాల స్థాయిలో 5%కు మించి సేంద్రియ ఆహారోత్పత్తుల్లో ఉండకూడదని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.) తాజా నిబంధనావళి నిర్దేశిస్తోంది. ఉదాహరణకు.. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగైన బియ్యంలో కార్బరిల్ అనే పురుగుల మందు అవశేషాలు 2.5 పార్ట్ పర్ మిలియన్ (పీపీఎం)కు మించి ఉండకూడదన్నది నిబంధన. ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. తాజా నిబంధనావళి ప్రకారం.. సేంద్రియ బియ్యంలో ఈ అవశేషం 0.125 పీపీఎంకు మించి ఉండకూడదు. ప్రపంచస్థాయి అత్యున్నత సేంద్రియ సేద్య ప్రమాణాలకు అనుగుణంగా ఇంత తక్కువ అవశేషాల మోతాదును నిర్దేశించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్: సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న భూసార పరీక్షలు, భూసార కార్డులు, సేంద్రియ వ్యవసాయ పథకాల పరిశీలనకు నీరజాశాస్త్రి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొం డ, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నా రు. నీరజాశాస్త్రి మాట్లాడుతూ మార్కెటింగ్ సదుపాయాల అనుసం ధానం కోసం మార్కెట్ యాజమాన్య నిపుణుల సహకారాన్ని తీసుకోవ డానికి యోచిస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్న రైతులను పథకాల్లో భాగస్వాములను చేస్తే అమలు మరింత మెరుగ్గా జరుగుతుందన్నారు. భూసార కార్డులు, పీకేవీవై పథకాల అమలు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి జిల్లా వ్యవసాయ అధికారులు సమావేశంలో వివరించారు. భూసార పరీక్షా కార్డులు రైతులకు సక్రమం గా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె కీసర మండలం గోధుమకుంట గ్రామంలో జీరో బడ్జెటింగ్ పద్ధతిలో సహజ వ్యవసాయం చేస్తున్న రైతు వెంకటరెడ్డి చేనును పరిశీలించారు. ఆయన నేల ఉప పొరల్లోని మట్టిని ఉపయోగించి చేస్తున్న సాగు విధానాన్ని అడిగి తెలుçసుకు న్నారు. అలాగే రాజేంద్రనగర్‌లోని భూసార పరీక్షా కేంద్రాన్ని, జీవఎరువుల ప్రయోగ శాలను సందర్శించారు. భూసార పరీక్షలు చేస్తున్న పద్ధతులు, క్షేత్రస్థాయిలోని ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు. -
సేంద్రియ సాగుతో రైతులకు మేలు
అందరి బాగుకు సేంద్రియ సాగు ∙ఏఓ బాబూ నాయక్ సదాశివపేట రూరల్:రైతులు సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలని, దీనివల్ల అటు రైతులకు లాభాలతో పాటు సేంద్రియ ఉత్పత్తుల ను వినియోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని సదాశివపేట మండల వ్యవసాయశాఖ అధికారి బాబూనాయక్ తెలిపారు. బుధవారం నిజాంపూర్ గ్రామంలో 50 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు భూ సంజీవనిపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సేం ద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి రైతులకు వివరించారు. మహిళా రైతులకు సేంద్రియ పద్ధతిలో వరినాటే విధానం గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సేం ద్రియ వరి సాగు చేసే ప్రతి రైతు భూ సారాన్ని, భూమి సమతుల్యతను పాటిం చేందుకు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువు, జనుము, జీలుగను సాగు చేయాలని సూచిం చారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసే రైతులు తమ భూమిలో తప్పకుండా మిష¯ŒS కాకతీయ కింద తవ్వుతున్న చెరువులోని మట్టి వేసుకోవాలన్నారు. వర్మి కంపోస్టు వాడటం వల్ల రైతులకు కలిగే లాభాల గురించి ఆయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, సేంద్రియ రైతులు సత్యనారాయణ, శ్రీనివాస్, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఎకో రక్షతి రక్షితః
- మార్కెట్ మంత్రం.. పర్యావరణ హితం - నగరవాసుల్లో ‘ఆర్గానిక్’ క్రేజ్ - అన్ని రకాల ఉత్పత్తులకూ డిమాండ్ - నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కల్తీలతో బేజారవుతున్న నగరవాసి ఇప్పుడు ‘ఆర్గానిక్’ వస్తువుల వైపు పరుగులు పెడుతున్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ సహజ సిద్ధమైన జీవనశైలి బాట పడుతున్నాడు. ప్రతి వస్తువు వినియోగంలోనూ ప్రకృతి జపం కన్పిస్తోంది. రసాయనాలు లేని, కల్తీ కాని సరుకులు కొనేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడడం లేదు. వినియోగదారుల ఆసక్తి మేరకు నగరంలో పర్యావరణ హిత ఉత్పత్తుల వెల్లువ కూడా ఊపందుకుంది. మాల్స్..షాప్స్.. ఎక్కడ చూసినా ఆర్గానిక్ వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటి కోసమే ప్రత్యేక స్టోర్స కూడా ఉన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: రసాయనాలు, కృత్రిమమైనవి ఏమీ మేళవించకుండా తయారైన ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన పెరగడంతో గత నాలుగైదేళ్లుగా సిటీలో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం విపరీతంగా పెరిగింది. ఆహారం నుంచి అలవాట్ల దాకా అన్నీ సహజంగా ఉత్పత్తి అయినవే కావాలనే ఆకాంక్ష బాగా వ్యక్తమవుతోంది. దాదాపు పదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని 24 లెటర్డ్ మంత్ర అనే ఒకే ఒక్క షాప్ ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయ కేంద్రంగా ఉండగా ఇప్పుడు నగరవ్యాప్తంగా పదుల సంఖ్యలో వచ్చేశాయి. ఇక లామకాన్, అవర్ సేక్డ్ ్రస్పేస్, సప్తపర్ణి తదితర చోట్ల జరిగే వారాంతపు ఆర్గానిక్ బజార్లకు జనం క్యూ కడుతున్నారు. పతంజలి, మంతెన సత్యనారాయణ రాజు, యేల్చూరి వంటి ఆరోగ్య ప్రచారకులతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక షాప్‌లు సైతం మంచి విక్రయాలు సాధిస్తున్నాయి. ఆర్గానిక్ బైట్స్ తదితర రెస్టారెంట్స్ పూర్తి స్థాయి ఆర్గానిక్ వంటకాలనే వడ్డిస్తూ ఆదరణ పొందుతున్నాయి. వైట్‌కు గుడ్‌బై.. ‘బ్రౌన్’కు సై.. మెరుపులకు లొంగిపోతే ఆరోగ్యం పాడవుతుందని అర్థం చేసుకున్న సిటీజనులు వైట్ రైస్‌కు బైబై చెప్పేస్తున్నారు. దీంతో ముడి బియ్యానికి డిమాండ్ ఊపందుకుంది. పదేళ్లక్రితం పాలిష్ పెట్టని బియ్యం కోసం ఎక్కడో ఓ షాప్ ఉండేది. ఇప్పుడు ఈ తరహా బియ్యం విక్రయించని షాపింగ్ మాల్ అంటూ లేదు. బియ్యంతో మొదలైన బ్రౌన్ క్రేజ్ మరిన్ని ఉత్పత్తులకు విస్తరించింది. వైట్ బ్రెడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్‌కు జై కొడుతున్నారు. ఇదే క్రమంలో తెల్ల పంచదారను పక్కనబెట్టి ‘బ్రౌన్ షుగర్’ (మత్తు పదార్థం కాదు) కావాలంటూ తీసుకుంటున్నారు. గోధుమల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుందని, డయాబెటిస్, ఒబెసిటీ తదితర దీర్ఘకాల వ్యాధులు రావని వైద్యులు చేస్తున్న ప్రచారం అద్భుతమైన ఫలితాలనిస్తోంది. దీంతో గోధుమ గడ్డి కూడా ప్రత్యామ్నాయంగా సహజాహార ప్రేమికులను ఆకట్టుకుంటోంది. రేటెక్కువైనా.. రూట్ మార్చం.. చూపులకు అందంగా కనపడే వాటికన్నా ఆరోగ్యాన్ని అందించేవే మేలని నమ్ముతున్న నగరవాసులు ఎకో ఉత్పత్తులు మిగిలిన వాటికంటే ఖరీదు ఎక్కువైనా లెక్క చేయడం లేదు. ఉదాహరణకి తెల్లబియ్యం కిలో రూ.25 నుంచి మొదలై విభిన్న ధరల్లో లభిస్తుంటే.. ముడిబియ్యం ప్రారంభ ధరే రూ.50 దాకా ఉంటోంది. ఇక క్వినోవా వంటి ప్రత్యేకమైన రకమైతే కిలో రూ.1500 వరకూ పలుకుతున్నాయి. అయినా వీటికి డిమాండ్ బాగానే ఉంది. ఫ్యాబ్ ఇండి యా వంటి షోరూమ్స్ పూర్తిస్థాయిలో ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌తో తయారైన దుస్తులను విక్రయిస్తుంటే సిటీజనులు ధరించేందుకు సై అంటున్నారు. ఈ ట్రెండ్ దాదాపు అన్ని ఉత్పత్తులకూ విస్తరించే స్తూ త్వరలోనే హైదరాబాద్‌ని ఎకో ఉత్పత్తుల హబ్‌గా మార్చేసినా ఆశ్చర్యం లేదు. బాత్రూమ్తో ‘పీచు’ చుట్టరికం బోర్ నీటితో చేసే స్నానం మన శరీరాన్ని శుభ్రపరిచే మాటేమోగాని క్లోరిన్ పుణ్యమాని లేనిపోని చర్మవ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఇక స్నానానికి వాడే కెమికల్ ఆధారిత సబ్బులతో చర్మపు ఆరోగ్యం పాడవుతుందంటున్నారు చర్మవైద్య నిపుణులు. వట్టివేరు స్క్రబ్ వంటివాటితో రుద్దుకుంటే అది స్కిన్ లోపల ఉండే మట్టిని సైతం తొలగిస్తుందని నమ్ముతున్నారు. ఒక్క స్క్రబ్ రెండు నెలల వరకూ వాడవచ్చు. అయితే ఒకరిది మరొకరికి మార్చకూడదు. అలాగే బీరకాయ పీచు కూడా ఇప్పుడు విరివిగా వాడకంలోకి వచ్చింది. ఇవి రూ. 25 నుంచి రూ.150 దాకా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎర్రచందనం పొడితో చేసే రెడ్ శాండల్ స్క్రబ్ కేక్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. మాల్స్ కూడా వచ్చేశాయ్ సహజ ఉత్పత్తులను అక్కడొక రాక్ ఇక్కడొక రాక్ పెట్టి అమ్మే షాపింగ్ మాల్స్ ఇప్పటిదాకా చూస్తే.. ఇటీవల పూర్తిస్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే విక్రయించే సికింద్రాబాద్‌లోని ‘ఎకో బాస్కెట్’ లాంటి షాపింగ్ మాల్స్ సైతం వెలుస్తుండడం సిటీలో ఈ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతోంది. ‘గత కొంత కాలంగా వ్యక్తిగతంగా ఈ తరహా ఉత్పత్తులను వినియోగిస్తున్నా. అలాగే ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌కి హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గానూ ఉన్నాను. సిటీలో వీటికి ఉన్న డిమాండ్ చూసి అనేకంటే వీటి అవసరం నగర జీవనంలో చాలా ఉందని గుర్తించే ఈ మాల్ నెలకొల్పాం’ అని చెప్పారు ఎకో బాస్కెట్ నిర్వాహకులు విజయ్. ఆయన నెలకొల్పిన మాల్ ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల నుంచి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్.. అన్నీ అందిస్తోంది. -
సామాన్యునికి సేంద్రియ ఉత్పత్తులు
సందర్భం శుభ్రమైన పరిసరాలు, ఆరో గ్యవంతమైన ఆహారాలను ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి తీసుకురావడం ప్రభు త్వాల బాధ్యత. సాగుకు ఉప యోగిస్తున్న రసాయనాల కార ణంగా నేల, నీరు, పరిసరాలు విషపూరితం అయిపోయా యన్నది నేడు రుజువైన వాస్తవం. 30 ఏళ్ల క్రితం మన మధ్యలో మెసిలిన వేలాది జీవరాసులు అంతరించి పోవడం వేదనతో మనం గమనిస్తున్న దృశ్యం. ఈ పరిస్థితి మారి తీరాలన్నది ప్రపంచ దేశాల, కోట్లాది ప్రజల అభిమతం. సేంద్రియ విధానంలో సాగును అమలు చేయడం ఇందుకు పరిష్కార మార్గమనేది అందరూ ఆమోదించిన అంశం. అయితే జరుగుతున్నదేమిటి? సేంద్రియ ఎరు వులు, పురుగు మందులు, విత్తనాలు ఇబ్బడిముబ్బడిగా బజారులో ప్రత్యక్షమయ్యాయి. రసాయనిక ఎరువులు, మందులతో నడుం విరిగిన రైతుకు ఊరట లభించక పోగా మరింత భారం పెరిగింది. ఆరోగ్యవంతమైన ఉత్పత్తులతోబాటు రైతు సౌభాగ్యం కూడా అత్యంత అవసరం అనే అంశాన్ని మనం మరువకూడదు. సుభాష్ పాలేకర్ విధానం ఇందుకు పరిష్కారాన్ని చూపింది. రసాయనాల వినియోగంతో నిర్జీవమైన మట్టికి, జీవరాసులకు నాటు ఆవు పేడ, మూత్రాలతో తిరిగి జీవం పోయవచ్చు అనేది వారి మొదటి సూత్రం. అదనపు ఎరువులు వేయకపోయినా ప్రకృతి పరిణా మాల కారణంగానే నేల సారాన్ని పొంది, పంటలకు అందించగలుగుతుంది. అందుబాటులోని వనరుల నుండి తయారు చేసుకునే కషాయాల ద్వారా పంటలకు పట్టే చీడపీడలను వదిలించుకోవచ్చు. ఇది వారి రెండవ సూత్రం. రైతు తన ఉత్పత్తులను అమ్మాలి తప్ప, విత్త నాలతో సహా ఏ వస్తువును బయటి నుండి కొనకూడదు అన్నది వారి మూడవ సూత్రం. అయితే గత 30 ఏళ్లుగా రసాయన ఎరువులతో సేద్యానికి అలవాటుపడిన రైతుకు ఈ కొత్త దారికి రావడం అంత సులువేమీ కాదు. సేంద్రియ వ్యవసాయం సమగ్ర అమలుకోసం గ్రామాల్లో కులాలు, పార్టీలకు అతీతంగా రైతు సంఘాలు నిర్మాణం కావాలి. శాస్త్ర సాంకేతిక పద్ధతుల అవగాహనతో నేల పరీక్షలు, పంటల ఎంపికలు, విత్తనాల తయారీలు ఈ సంఘాల ద్వారా జరగడం మొదటి మెట్టు. కొన్ని రైతు సంఘాలు కలసి ఒక రైతు సమాఖ్యగా ఏర్పడాలి. వ్యవసాయ పరిశోధనలను గ్రామాల్లోని రైతుకు అందజేసే బాధ్యతలను ఇవి చేపడ తాయి. రైతు తప్పనిసరి అని భావించే ఎరువులు, పురుగుమందుల తయారీలను కూడా ఇవి చేయగలు గుతాయి. వీలైనంత వరకు రైతు తన అవసరాలను తానే తీర్చుకోగలగాలి. తప్పనిసరైతే తాను సభ్యునిగా ఉన్న రైతు సమాఖ్య నుండే సరుకులను కొనుగోలు చేయాలి. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం మరొక టున్నది. రైతు కాని, గ్రామంలోని రైతు సంఘం కాని చేయలేని పనిని రైతు సమాఖ్య సమర్థతతో నిర్వహించ గలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను కొని, టోకు గాను, చిల్లరగాను వ్యాపారులకు అమ్ముతుంది. అవస రాన్ని బట్టి బజారులో అమ్మక కేంద్రాలను నిర్వహి స్తుంది. ఇంటింటికీ సరుకులను అందజేసే వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల మెరుగుదల, అమ్మకాలను రైతు సమాఖ్య నిర్వహిం చడం ద్వారా, దళారీ వ్యవస్థను పరిమితం చేస్తుంది. అయితే గ్రామాల్లో రైతు సంఘాలను, ఆపై రైతు సమాఖ్యలను స్వచ్ఛంద సంస్థలే నిర్మాణం చేయాలి. ఒక మున్సిపాలిటీలోని ప్రజలకు ఆరోగ్యకరమైన తిండి గింజలను, కూరగాయలను అందించే లక్ష్యంతో చుట్టుపక్కల గ్రామాల రైతులను సంఘటితపరిచే బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టాలి. మూడు నుండి ఐదేళ్ల సమయంలో ఈ లక్ష్యాన్ని అది చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లోని 109 మున్సిపాలిటీలలో ఈ బాధ్యతలను చేపట్టడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా 2% ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఎలాగూ ఉన్నది. వారు ఇందులో కనీసం 50% మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కేటాయిం చడం ద్వారా ఈ ఉద్యమానికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కేంద్రాలలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మక కేంద్రాలకు ఉచితంగా దుకాణాలను కేటాయించాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయాలలోను, పరిశోధనా కేంద్రాలలోను రుజువైన ఫలితాలను పేటెంట్ చేయకుండా బహిరంగ పరచాలి. సాంకేతిక పరంగా యోగ్యమైన గిడ్డంగులను రైతు ఫెడరేషన్లకు ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వాలి. సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలకు అవసరమైన ల్యాబ్ లను జిల్లాస్థాయి రైతు సమాఖ్యలకు ఉచితంగా ప్రభుత్వం అందజేయాలి. సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం ప్రకటించుకున్నది. మరో ఐదేళ్లలో తాము కూడా అదే స్థానంలో నిలుస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దేశమంతటా ఇది ఆచరణ యోగ్యం కావడానికి ప్రతి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను ‘సేంద్రియ వ్యవ సాయం’ ఒక ప్రధాన విభాగంగా ప్రారంభం కావాలి. కేవలం సేంద్రియ వ్యవసాయ శిక్షణ కోసమే కొన్ని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలి. ఒక గింజను విత్తితే పదివేల గింజలను అంది స్తుంది నేలతల్లి. అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందజేయడమే సేంద్రి య వ్యవసాయ లక్ష్యం కావాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు, తన పంటలకు అదనపు ధర కావాలని రైతు కోరడు. ప్రస్తుతం శ్రీమం తులకే అందుతున్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు సామాన్యులకు కూడా సరసమైన ధరలకు అందు బాటులోకి రావాలి. అందుకు రైతులు సమాయత్తం కావాలి; స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టుకోవాలి; వ్యాపార, పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలి. (మార్చి 19-20న హైదరాబాద్‌లో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అంశంపై జాతీయ సదస్సు సందర్భంగా) - పి. వేణుగోపాల్‌రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ మొబైల్: 94904 70064 -
ఇంట్లోనే తయారీ...
హోమ్మేడ్ ప్రస్తుతం మనం తీసుకునే ఆహారమే కలుషితమైందని బాధపడుతుంటే మరోవైపు బ్యూటీ ప్రాడక్ట్స్, హెల్త్ ప్రాడక్ట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా ఆరోగ్యం మరింత చెడిపోతోంది. దానికి పరిష్కారంగా ఇంట్లో కొన్ని వస్తువులను తయారు చేసుకోవచ్చు. అలా ఆర్గానిక్ ప్రాడక్ట్స్‌ను నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు.. టూత్ పేస్ట్: మార్కెట్లో దొరికే టూత్‌పేస్ట్‌లలో సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఉండటం వల్ల దీర్ఘకాలం వాటిని వాడితే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ఇంట్లోనే ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్‌ను తయారు చేసుకోండి. కావాల్సినవి: బేకింగ్ సోడా-1 టీ స్పూన్, మెత్తని ఉప్పు- 1/2 టీ స్పూన్, పెప్పర్మెంట్ ఆయిల్- 1 చుక్క, లవంగ నూనె- 1 చుక్క, శుద్ధమైన నీరు- కొన్ని చుక్కలు తయారీ: పైన పదార్థాలన్నింటినీ ఒక ప్లాస్టిక్ గిన్నెలో వేయాలి. వాటిని మెత్తగా అయ్యేవరకు బాగా కలపాలి. నీళ్లు సరిపోకపోతే మరి కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. అంతే! ఆరోగ్యవంతమైన టూత్ పేస్ట్ రెడీ.. హెయిర్ డై: ఇప్పుడు చిన్నా పెద్దా అని వయసుతో పరిమితం లేకుండా అందరికీ జుట్టుకు తెల్లగా మారుతోంది. దాంతో చాలామంది హెయిర్ డై వేసుకుంటున్నారు. ఆ డైలోని అమోనియా కారణంగా జుట్టు రాలడం, డ్రై స్కాల్ప్ కావడం లాంటివి జరుగుతాయి. వాటిని దూరం చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే హెయిర్ డైను తయారు చేసుకోండి. కావాల్సినవి: బ్లాక్ వాల్నట్ పౌడర్- 1/4 కప్పు, నీళ్లు- 3 కప్పులు, బ్లాక్ టీ బ్యాగులు- 2-3, ఖాళీ టీ బ్యాగ్-1 తయారీ: ఒక ప్లాస్టిక్ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఖాళీ టీ బ్యాగ్‌లో బ్లాక్ వాల్నట్ పౌడర్‌ను నింపి దాన్ని ఓ ఆరు గంటల పాటు నీళ్ల గిన్నెలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటితో జుట్టును కడుక్కొని ఆరే వరకు గాలికి కూర్చోండి. తర్వాత మరో నీళ్ల గిన్నెలో నానబెట్టిన బ్లాక్ టీ బ్యాగ్‌లను తీసుకోవాలి. ఆ ఆరిన జుట్టును ఇప్పుడు రెండో గిన్నెలోని నీళ్లతో కడుక్కోవాలి. అంతే! మీ జుట్టు డార్క్ గ్రే కలర్లోకి మారుతుంది. ఇలా తరచూ చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఇందులో ఏ రసాయనాలు లేకపోవడం వల్ల అవసరమైతే వారానికి మూడుసార్లైనా ఈ నేచురల్ హెయిర్ డై వేసుకోవచ్చు. షేవింగ్ క్రీమ్: కొన్ని షేవింగ్ క్రీముల కారణంగా చాలా మందికి సున్నితమైన చర్మంపై ర్యాషెస్ అవుతుంటాయి. అలాగే రేజర్ బర్న్స్‌ను కొన్ని క్రీములు రెట్టింపు చేస్తాయి. అదే ఆర్గానిక్ షేవింగ్ క్రీమ్ ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుంది. కావాల్సినవి: కాస్టైల్ సోప్ (ఆలివ్ ఆయిల్, సోడాతో చేసింది)-1/4 కప్పు, కరిగించిన కోకో బట్టర్-1/4 కప్పు, ఆల్మండ్ ఆయిల్- 1/2 కప్పు, ఎస్సెన్షియల్ ఆయిల్ ఏదైనా..ఉదా: లావెండర్ ఆయిల్-5 చుక్కలు, తేనె-1/4 కప్పు, గోరు వెచ్చని నీళ్లు-3/4 కప్పు తయారీ: ఒక మూకుడులో కొన్ని నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. దానిపైన మరో మూకుడు పెట్టి అందులోనూ కొన్ని నీళ్లు పోయాలి. తర్వాత ఆ పైన మూకుడులో కోకో బట్టర్ వేయాలి. అది కరుగుతున్నప్పుడు అందులో ఆల్మండ్ ఆయిల్, సోప్, తేనె వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎస్సెన్షియల్ ఆయిల్‌తో కలిపి ఓ ప్లాస్టిక్ గిన్నెలో తీసుకోవాలి. తర్వాత అది క్రీమ్‌లా కావడానికి కొన్ని నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపితే నేచురల్ షేవింగ్ క్రీమ్ రెడీ అవుతుంది.