సేంద్రియ ఆహారంపై జైవిక్‌ ముద్ర! | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఆహారంపై జైవిక్‌ ముద్ర!

Published Tue, Jan 9 2018 4:35 AM

FSSAI launches logo for organic food products  - Sakshi

సేంద్రియ వ్యవసాయ/ఆహార ఉత్పత్తుల ప్యాకెట్‌ను షాపు/మాల్‌లో చేతిలోకి తీసుకునే వినియోగదారులకు ‘ఇది నిజంగా సేంద్రియ పద్ధతుల్లో పండించినదేనా?’ అన్న సందేహం కలగడం సహజం. ఈ గందరగోళానికి ఒక ప్రధాన కారణం.. ప్యాకెట్‌పై ఒక్కో కంపెనీ వారు ఒక్కో రకంగా ఉండే సేంద్రియ లోగోను ప్రచురించడమే. సేంద్రియ ఉత్పత్తుల వినియోగదారులకు వచ్చే జూలై నుంచి ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ‘జైవిక్‌ భారత్‌’ అనే లోగోను విధిగా ప్యాకెట్‌పై ముద్రించాలని నిర్దేశించింది.

జూలై నుంచి ఈ లోగో ముద్రించకుండా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు శిక్షార్హులని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రకటించింది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు లేదా రైతు బృందాలు(ఎఫ్‌.పి.ఓ.లు) తాము పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేటప్పుడు ఈ నిబంధన వర్తించదు! రైతుల నుంచి కొని వినియోగదారులకు అమ్మే దుకాణదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే, దేశ విదేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయించదలచుకునే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్‌. లేదా థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది.

మన దేశంలో సేంద్రియ ఆహార నాణ్యతా ప్రమాణాల నియంత్రణకు రంగం సిద్ధమైంది. దుకాణాలు, మాల్స్‌లో విక్రయించే సేంద్రియ వ్యవసాయోత్పత్తుల ప్యాకెట్లపై ఉత్పత్తిదారులు ‘జైవిక్‌ భారత్‌’ లోగోను జూలై నుంచి విధిగా ముద్రించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ  (ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ.)’ సేంద్రియ ఆహారానికి సంబంధించి రూపొందించిన నియమావళిని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 2న గెజెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ముసాయిదా ప్రకటించిన ఏడాది తర్వాత గత ఏడాది నవంబర్‌ 9న ప్రపంచ సేంద్రియ మహాసభల సందర్భంగా విడుదలైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వస్తుంది.

దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. ఇప్పటి వరకు విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు మాత్రమే జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్‌.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్‌ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందేవారు. ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్‌.పి.ఓ.పి. ధృవీకరణ పొందవచ్చు. ఎన్‌.పి.ఓ.పి. ధృవీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఈ సర్టిఫికేషన్‌ ప్రక్రియ క్లిష్టమైనదే కాక, అత్యంత ఖరీదైనది కూడా.  

కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్‌ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధృవీకరణ వ్యవస్థల్లో(ఎన్‌.పి.ఓ.పి./ పి.జి.ఎస్‌. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పి.జి.ఎస్‌.) ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్‌.సి.ఓ.ఎఫ్‌.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ. 2011 నుంచి ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌ సదుపాయం 2015 జూలై నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో సేంద్రియ రైతులే బృందంగా ఏర్పడి సర్టిఫికేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఈ ధ్రువీకరణకు రైతులు ఎటువంటి ఫీజునూ చెల్లించనక్కరలేదు.

 ఎన్‌.పి.ఓ.పి./ పి.జి.ఎస్‌. ఇండియా సర్టిఫికేషన్‌ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్‌ చేస్తాం’ అని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. సీఈఓ పవన్‌ అగర్వాల్‌ హెచ్చరిస్తున్నారు.సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేకపోవడం విశేషం. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్‌.పి.ఓ.పి. ప్రకారం థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌ లోగో లేదా పి.జి.ఎస్‌. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. జైవిక్‌ భారత్‌ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటుంది. ఆ ప్యాకెట్‌లో ఉన్న సేంద్రియ ఉత్పత్తిని పండించిన రైతు ఎవరో ఏమిటో తెలిపే వివరాలు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు ఉండాలి.

పి.జి.ఎస్‌. ఇండియా «ధ్రువీకరణతో విశ్వసనీయత!
వివిధ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే రైతుల బృందాలు పి.జి.ఎస్‌. ఇండియా ధ్రువీకరణ పొందితే వారి ఉత్పత్తులకు మార్కెట్‌లో విశ్వసనీయత, రైతుల నికరాదాయం పెరుగుతుంది. 100కు పైగా రైతు బృందాల బ్రాండ్స్‌ పి.జి.ఎస్‌. ఇండియా ద్వారా మార్కెట్‌లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా రీజినల్‌ కౌన్సిళ్ల ద్వారా రైతులు రిజిస్టర్‌ చేసుకోవచ్చు. వివరాలకు ఈ వెబ్‌సైట్‌ చూడండి:  pgsindia-ncof.gov.in  ఘజియాబాద్‌(ఉ.ప్ర.)లోని మా కార్యాలయాన్ని సంప్రదించండి: 0120 2764906, 2764212
– డా. కృషన్‌ చంద్ర, సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్‌(ఉత్తరప్రదేశ్‌)

సేంద్రియ పశు, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ!
జడ్‌.బి.ఎన్‌.ఎఫ్‌. రైతులకూ పి.కె.వి.వై.!
పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పి.జి.ఎస్‌.) ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణను సంపూర్ణంగా సేంద్రియ/ప్రకృతి పద్ధతులను అనుసరించే రైతులందరూ ఉచితంగా పొందవచ్చు. కనీసం ఐదుగురు రైతులు బృందంగా ఏర్పడి, అధీకృత రీజినల్‌ కౌన్సిళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకొని పీజిఎస్‌ ఇండియా సేంద్రియ ధ్రువీకరణను పొందవచ్చు. విదేశాలకు ఎగుమతి చేయడానికైతే ఒక రైతు లేదా కనీసం 50 మంది గల రైతు బృందాలు ఎన్‌.పి.ఓ.పి. థర్డ్‌ పార్టీ ధ్రువీకరణను పొందవచ్చు. సేంద్రియ పశుపోషణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు ‘అపెడా’ ద్వారా థర్డ్‌ పార్టీ ధ్రువీకరణ పొందవచ్చు. ఆహార ధాన్యాలు, కూరగాయ పంటలను పూర్తిగా సేంద్రియ/పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులతో పాటు.. ఆక్వా సాగులో పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే రైతులు సైతం ఉచితంగా పి.జి.ఎస్‌. ఇండియా ద్వారా సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. దేశవ్యాప్తంగా 722 సంస్థలు(రీజినల్‌ కౌన్సిల్స్‌) పి.జి.ఎస్‌. ధ్రువీకరణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే 2.5 లక్షల మంది రైతులు పి.జి.ఎస్‌. ఇండియా ధ్రువీకరణ పొందారు. వీరు జూలై నుంచి తమ రైతు బృందం సొంత లోగోతో పాటు.. పి.జి.ఎస్‌. ఇండియా లోగో, జైవిక్‌ భారత్‌ లోగోలను ప్యాకెట్లపై ముద్రించాల్సి ఉంటుంది.
– డాక్టర్‌ టి. కె. ఘోష్, ప్రాంతీయ సంచాలకులు, జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్‌.


సొంత బ్రాండ్‌తో అమ్ముకోవచ్చు
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు పి.జి.ఎస్‌. ఇండియా వ్యవస్థ ద్వారా ఉచిత సేంద్రియ ధ్రువీకరణ పొందవచ్చు. తెలంగాణ  రాష్ట్రంలో జె.డి.ఎ.ల ద్వారా లేదా ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. వద్ద రీజినల్‌ కౌన్సిళ్లుగా నమోదైన ప్రైవేటు సంస్థల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పి.కె.వి.వై. పథకం అమలు ప్రారంభం కానందున జె.డి.ఎ.ల ద్వారా రైతులు ధ్రువీకరణ పొందలేరు. అయితే, ప్రైవేటు రీజినల్‌ కౌన్సిళ్ల ద్వారా ఆంధ్రా రైతులు పి.జి.ఎస్‌. ధ్రువీకరణ పొందే వీలుంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులైనా కనీసం ఐదుగురు బృందంగా ఏర్పడి ధ్రువీకరణ పొందవచ్చు. దుకాణంలో అమ్మినప్పుడు మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ధ్రువీకరణ లోగోతో పాటు, జైవిక్‌ భారత్‌ లోగోనూ ముద్రించాలి.
– డాక్టర్‌ వి. ప్రవీణ్‌కుమార్‌ (092478 09764), శాస్త్రవేత్త, ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. ఘజియాబాద్‌

సేంద్రియ/ప్రకృతి సేద్యంపై దృష్టి!
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం (జడ్‌.బి.ఎన్‌.ఎఫ్‌.), ఛత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల్లోని సేంద్రియ వ్యవసాయ నమూనాలు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం – ధ్రువీకరణ సంబంధిత అంశాలపై రెండేళ్లుగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం నిపుణులతో వివిధ రాష్ట్రాల ఆత్మా పీడీలు, శాస్త్రవేత్తలు, మత్స్య, పశుసంవర్థక శాఖల అధికారులకు పి.జి.ఎస్‌. ధ్రువీకరణ పద్ధతిపై శిక్షణ ఇప్పించాం. రెండో విడతగా ఇటీవల 3 రోజల పాటు శిక్షణ ఇప్పించాం. వేస్ట్‌ డీ కంపోజర్‌తో సులభంగా సేంద్రియ సేద్యాన్ని చేపట్టే పద్ధతులను అధ్యయనం చేస్తున్నాం. రైతుకు భవితపై ఆశ కల్పించాలన్న లక్ష్యంతో లాభనష్టాలు చూసుకొని తగిన సేద్య పద్ధతులను అనుసరించాలని చెబుతున్నాం. విస్తరణ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రాష్ట్రాల వారీగా వర్కింగ్‌ పేపర్లు తయారు చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నాం. 2019 మార్చి నాటికి అన్ని రాష్ట్రాల వర్కింగ్‌ పేపర్లూ సిద్ధం చేస్తాం.
– వి. ఉషారాణి, డైరెక్టర్‌ జనరల్,
జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ(మేనేజ్‌), రాజేంద్రనగర్, హైదరాబాద్‌

అతి తక్కువ అవశేషాల పరిమితి!
రసాయనిక ఆహారోత్పత్తుల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన రసాయనిక పురుగుమందుల అవశేషాల స్థాయిలో 5%కు మించి సేంద్రియ ఆహారోత్పత్తుల్లో ఉండకూడదని ‘భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ  (ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ.) తాజా నిబంధనావళి నిర్దేశిస్తోంది. ఉదాహరణకు.. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగైన బియ్యంలో కార్బరిల్‌ అనే పురుగుల మందు అవశేషాలు 2.5 పార్ట్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎం)కు మించి ఉండకూడదన్నది నిబంధన.
ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. తాజా నిబంధనావళి ప్రకారం.. సేంద్రియ బియ్యంలో ఈ అవశేషం 0.125 పీపీఎంకు మించి ఉండకూడదు. ప్రపంచస్థాయి అత్యున్నత సేంద్రియ సేద్య ప్రమాణాలకు అనుగుణంగా ఇంత తక్కువ అవశేషాల మోతాదును నిర్దేశించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

  – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement