‘దేశీ’ దశగవ్య!

Best Desi Gir Gobi Ghee Production - Sakshi

దేశీ ఆవుల ఆలంబనగా సేంద్రియ వ్యవసాయాన్ని ఓ మహిళా రైతు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గిర్‌ ఆవుల పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయబద్ధంగా నెయ్యిని తీస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యి, పాలు, పేడ, మూత్రం తదితరాలతో పంచగవ్య మాదిరిగా ‘దశగవ్య’(సేంద్రియ పంటల పెరుగుదలకు ఉపకరించే పోషక ద్రావణం) తయారు చేస్తున్నారు. తన 25 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసాలు, ఆహార పంటలను పండిస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, దశగవ్య, ఘనజీవామృతం విక్రయిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్న ఉడుముల లావణ్యారెడ్డి ‘డాక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ డిగ్రీని అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం..

మంజీర నది తీరాన సంగారెడ్డి జిల్లా అందోలు వద్ద 25 ఎకరాల్లో కొలువైన విలక్షణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అది. హైద్రాబాద్‌కు చెందిన ఉడుముల లావణ్య రెడ్డి మక్కువతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200కు పైగా ఉత్తమ దేశీ గిర్‌ జాతి గోవులున్నాయి. పుంగనూరు, సాహివాల్‌ వంటి ఇతర దేశీ జాతుల ఆవులు సైతం ఒకటి, రెండు ఉన్నాయి. ప్రస్తుతం 40 గిర్‌ ఆవులు పాలు ఇస్తున్నాయి.  లావణ్య రెడ్డి పాలు అమ్మరు. పాలను కాచి తోడుపెట్టి, పెరుగును చిలికి సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. ప్రతి 28 లీటర్ల పాలకు కిలో నెయ్యి తయారవుతుందని, నెలకు 80–90 కిలోల నెయ్యిని తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆమె తెలిపారు.

 దీంతోపాటు.. సేంద్రియ పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదపడే దశగవ్య అనే పోషక ద్రావణాన్ని తయారు చేసి తమ పంటలకు వాడుకుంటూ, ఇతరులకూ విక్రయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, దశగవ్య, అగ్రి అస్త్రం కూడా  తయారు చేసుకొని పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి ఏడాదే జైశ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్‌ సన్న రకాల ధాన్యాన్ని ఎకరానికి 40 బస్తాలు(70 కిలోల) పండించామని ఆమె తెలిపారు. ఆమె కృషికి మెచ్చిన గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ ఇటీవల ‘డాక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ డిగ్రీని ప్రదానం చేసింది.

దశగవ్య తయారీ పద్ధతి
సేంద్రియ పంటల పెరుగుదలకు దోహదపడే గోఉత్పత్తులతో ‘పంచగవ్య’ తయారీకి తమిళనాడుకు చెందిన డా. నటరాజన్‌ ఆద్యుడు. అదే రీతిలో 10 ఉత్పాదకాలను కలిపి దశగవ్యను తయారు చేయడం వాడుకలోకి వచ్చింది. దశగవ్య తయారీపై లావణ్య రెడ్డి అందించిన వివరాలు.. 50 లీటర్ల బ్యారెల్‌ను తీసుకొని.. 40 లీటర్ల దశగవ్యను తయారు చేయాలి. 7.5 కిలోల పేడ, 7.5 లీటర్ల మూత్రం, 750 గ్రాముల నెయ్యి, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల కొబ్బరి నీళ్లు, 5 లీటర్ల చెరుకు రసం, చిన్నవైతే 24–పెద్దవైతే 18 అరటి పండ్లు, 2 కిలోల నల్ల ద్రాక్ష పండ్లు, 5 లీటర్ల తాటి కల్లుతో దశగవ్యను తయారు చేయాలి.

మొదట బ్యారెల్‌లో పేడ, నెయ్యి వేసి అరగంట నుంచి గంట వరకు కట్టెతో బాగా కలపాలి. అనంతరం దానికి మూత పెట్టకూడదు. పల్చటి గుడ్డ కట్టాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట కలియదిప్పాలి. 5వ రోజు పైన చెప్పిన మోతాదులో మిగతా 8 రకాలను కలపాలి. 18వ రోజు వరకు రోజూ ఇలాగే రోజుకు నాలుగు సార్లు కలియదిప్పుతూ ఉండాలి. 19వ రోజున వడపోస్తే.. దశగవ్య సిద్ధమవుతుంది. సీసాల్లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత కలియదిప్పాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. వడపోయగా వచ్చిన పిప్పిని పంట పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు.

15 రోజులకోసారి పిచికారీ
దశగవ్యను వివిధపంటలపై 30 లీటర్ల నీటిలో ఒక లీటరు దశగవ్యను కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయవచ్చని లావణ్యారెడ్డి తెలిపారు. డ్రిప్‌ ద్వారా కూడా పంటలకు అందించవచ్చు. ఎకరం వరి పంటకు పిచికారీకి సుమారు 200 లీటర్ల ద్రావణం అవసరమవుతుందని, అందుకు ఆరు–ఏడు లీటర్ల దశగవ్య అవసరమవుతుందని ఆమె తెలిపారు. కూరగాయ పంటలకు పిచికారీ చేసేటప్పుడు 25 లీటర్ల నీటికి ఒక లీటరు దశగవ్య కలపాలని తెలిపారు. దశగవ్య పిచికారీ చేసిన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని, మంచి దిగుబడినిస్తాయని ఆమె అన్నారు.
ఆవుపేడ, మూత్రం పుష్కలంగా ఉంది కాబట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని నెలకోసారి ఎకరానికి 5–6 క్వింటాళ్లు చల్లుతున్నామన్నారు. నీటిని అందించేటప్పుడు జీవామృతం కలిపి పారిస్తున్నామన్నారు. అగ్రి అస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా అవసరాన్ని బట్టి వాడుతున్నామని, మొత్తంగా తమ పంటలు ఆశ్చర్యకరంగా దిగుబడులు వస్తున్నాయన్నారు.

జంజుబ గడ్డి.. 18 రోజులకో కోత
లావణ్యారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 9 ఎకరాల్లో సంప్రదాయ రకం జంజుబ గడ్డితోపాటు పారాగడ్డి, సూపర్‌ నేపియర్, తీపిజొన్న రకాలను సాగు చేస్తున్నారు. అరెకరంలో కూరగాయలు, ఎకరంలో పసుపు, ఎకరంలో చెరకు, రెండెకరాల్లో సుగంధ దేశీరకం వరిని సాగు చేస్తున్నారు. జుంజుబ రకం గడ్డిని ఆవులు ఇష్టంగా తింటాయన్నారు. ఇది 18 రోజులకోసారి కోతకు వస్తుందన్నారు. కోత కోసిన తర్వాత నీటితోపాటు జీవామృతం పారిస్తామని, 5–6 రోజుల తర్వాత దశగవ్య పిచికారీ చేస్తామన్నారు. మోకాళ్ల ఎత్తుకు ఎదిగిన తర్వాత కోసి ఆవులకు వేస్తామన్నారు.
       –ఆకుల రాంబాబు, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా

సేంద్రియ సాగు వ్యాప్తే లక్ష్యం
దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి మూలాధారం. గో ఉత్పత్తుల ద్వారా వ్యవసాయంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి చెప్పటం సాధ్యమేనని రైతులకు తెలియజెప్పడం కోసం మోడల్‌ ఫామ్‌ను ఏర్పాటు చేశాను. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తికి దోహదపడే దశగవ్య, ఘనజీవామృతాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాను. సేంద్రియ సేద్యాన్ని వ్యాప్తిలోకి తేవాలన్నదే లక్ష్యం.
  
– డా. ఉడుముల లావణ్యారెడ్డి
(92468 45501), అందోలు, సంగారెడ్డి జిల్లా


దేశీ రకం వరి, వంగ మొక్కలు, చెరకు తోట, కొర్ర పంట


ప్లాస్టిక్‌ బ్యారెల్‌లో దశగవ్యను కలియదిప్పుతున్న కార్మికులు


ఆవుల కోసం దాణా


జుంజుబ గడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top