breaking news
Ghee manufacturing center
-
నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ వ్యాపారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లపై ఆహార భద్రత, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లోని నెయ్యి తయారీ కేంద్రాలను, బీసెంట్ రోడ్డులోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత విభాగం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే ముడి సరకు నమూనాలను సేకరించారు. సేకరించిన 14 నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నామని, ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ దాడుల్లో రూ.5.45 లక్షల విలువైన పామాయిల్, రూ.3.81 లక్షల విలువైన నెయ్యి, రూ.27,000 వేలు విలువైన వేరుశనగ నూనెను సీజ్ చేశామన్నారు. రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు మంగళవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. విజయవాడ పటమట డివిజన్లోని సాయినగర్‌లో ఉన్న పారడైజ్ ఫుడ్ కోర్టును ఆహార భద్రతాధికారి టి.శేఖర్‌రెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్, తహసీల్దార్ డీవీఎస్ ఎల్లారావు తనిఖీ చేశారు. నాణ్యత సరిగా లేవన్న అనుమానంతో కారం పొడిని, మటన్ దమ్ బిర్యానీ నమూనాలను సేకరించారు. రెండో బృందానికి ఆహార భద్రతాధికారి ఎన్.రమేష్‌బాబు నేతృత్వం వహించారు. ఈ బృందం గవర్నర్‌పేటలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. రూ.4,225 విలువ చేసే నాణ్యత లేని 65 కిలోల వేరుశనగ గుండ్లను సీజ్ చేశారు. కిచెన్ రూం పరిశుభ్రంగా లేదని, రిఫ్రిజిరేటర్ కూడా సరిగా లేదని, తక్షణమే వాటిని సరిచేసుకోవాలంటూ హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఇదే బృందం కొత్త రాజరాజేశ్వరి పేటలోని శ్రీలక్ష్మి దివ్య బాబు డెయిరీని తనిఖీ చేసింది. అక్కడ తయారు చేస్తున్న ఆవు నెయ్యి, గేదె నెయ్యిలను పరిశీలించింది. 193.4 కిలోల ఆవు నెయ్యి, 700.4 కిలోల గేదె నెయ్యిని సీజ్ చేసి వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని మూడో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని ఇందిరానాయక్ నగర్లో శ్రీకృష్ణా వెగాన్ ఘీ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. అక్కడ ఇతర బ్రాండ్లను పోలిన ప్యాకింగ్ లేబుల్స్‌ను వినియోగిస్తుండటంతో 2,500 నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 70 కిలోల నకిలీ పామాయిల్‌ను అధికారులు గుర్తించి నమూనాను సేకరించారు. అనంతరం గవర్నర్‌పేటలోని బర్కత్ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వింగ్స్‌లో అధికంగా కలర్ వాడినట్టు గుర్తించారు. వాటిన నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి పి.శ్రీకాంత్ నేతృత్వంలోని నాలుగో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని వెంకటేశ్వర జనరల్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసింది. ఇందులో నాణ్యతపై అనుమానం రావడంతో విజయ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ నమూనాను సేకరించి.. 9 ఆయిల్ టిన్నులను సీజ్ చేశారు. 58 టిన్నుల్లో నిల్వ ఉంచిన 3,600 కిలోల పామాయిల్‌ను సీజ్ చేశారు. అనంతరం వన్‌టౌన్‌లోని ఇస్లాంపేటలోని మిలాప్స్ పంజాబీ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత సరిగా లేవన్న కారణంతో బిర్యానీ, పెరుగు నమూనాలను సేకరించారు. -
‘దేశీ’ దశగవ్య!
దేశీ ఆవుల ఆలంబనగా సేంద్రియ వ్యవసాయాన్ని ఓ మహిళా రైతు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గిర్ ఆవుల పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయబద్ధంగా నెయ్యిని తీస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యి, పాలు, పేడ, మూత్రం తదితరాలతో పంచగవ్య మాదిరిగా ‘దశగవ్య’(సేంద్రియ పంటల పెరుగుదలకు ఉపకరించే పోషక ద్రావణం) తయారు చేస్తున్నారు. తన 25 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసాలు, ఆహార పంటలను పండిస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, దశగవ్య, ఘనజీవామృతం విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్న ఉడుముల లావణ్యారెడ్డి ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. మంజీర నది తీరాన సంగారెడ్డి జిల్లా అందోలు వద్ద 25 ఎకరాల్లో కొలువైన విలక్షణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అది. హైద్రాబాద్‌కు చెందిన ఉడుముల లావణ్య రెడ్డి మక్కువతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200కు పైగా ఉత్తమ దేశీ గిర్ జాతి గోవులున్నాయి. పుంగనూరు, సాహివాల్ వంటి ఇతర దేశీ జాతుల ఆవులు సైతం ఒకటి, రెండు ఉన్నాయి. ప్రస్తుతం 40 గిర్ ఆవులు పాలు ఇస్తున్నాయి. లావణ్య రెడ్డి పాలు అమ్మరు. పాలను కాచి తోడుపెట్టి, పెరుగును చిలికి సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. ప్రతి 28 లీటర్ల పాలకు కిలో నెయ్యి తయారవుతుందని, నెలకు 80–90 కిలోల నెయ్యిని తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆమె తెలిపారు. దీంతోపాటు.. సేంద్రియ పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదపడే దశగవ్య అనే పోషక ద్రావణాన్ని తయారు చేసి తమ పంటలకు వాడుకుంటూ, ఇతరులకూ విక్రయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, దశగవ్య, అగ్రి అస్త్రం కూడా తయారు చేసుకొని పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి ఏడాదే జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్ సన్న రకాల ధాన్యాన్ని ఎకరానికి 40 బస్తాలు(70 కిలోల) పండించామని ఆమె తెలిపారు. ఆమె కృషికి మెచ్చిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఇటీవల ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని ప్రదానం చేసింది. దశగవ్య తయారీ పద్ధతి సేంద్రియ పంటల పెరుగుదలకు దోహదపడే గోఉత్పత్తులతో ‘పంచగవ్య’ తయారీకి తమిళనాడుకు చెందిన డా. నటరాజన్ ఆద్యుడు. అదే రీతిలో 10 ఉత్పాదకాలను కలిపి దశగవ్యను తయారు చేయడం వాడుకలోకి వచ్చింది. దశగవ్య తయారీపై లావణ్య రెడ్డి అందించిన వివరాలు.. 50 లీటర్ల బ్యారెల్‌ను తీసుకొని.. 40 లీటర్ల దశగవ్యను తయారు చేయాలి. 7.5 కిలోల పేడ, 7.5 లీటర్ల మూత్రం, 750 గ్రాముల నెయ్యి, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల కొబ్బరి నీళ్లు, 5 లీటర్ల చెరుకు రసం, చిన్నవైతే 24–పెద్దవైతే 18 అరటి పండ్లు, 2 కిలోల నల్ల ద్రాక్ష పండ్లు, 5 లీటర్ల తాటి కల్లుతో దశగవ్యను తయారు చేయాలి. మొదట బ్యారెల్‌లో పేడ, నెయ్యి వేసి అరగంట నుంచి గంట వరకు కట్టెతో బాగా కలపాలి. అనంతరం దానికి మూత పెట్టకూడదు. పల్చటి గుడ్డ కట్టాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట కలియదిప్పాలి. 5వ రోజు పైన చెప్పిన మోతాదులో మిగతా 8 రకాలను కలపాలి. 18వ రోజు వరకు రోజూ ఇలాగే రోజుకు నాలుగు సార్లు కలియదిప్పుతూ ఉండాలి. 19వ రోజున వడపోస్తే.. దశగవ్య సిద్ధమవుతుంది. సీసాల్లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత కలియదిప్పాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. వడపోయగా వచ్చిన పిప్పిని పంట పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు. 15 రోజులకోసారి పిచికారీ దశగవ్యను వివిధపంటలపై 30 లీటర్ల నీటిలో ఒక లీటరు దశగవ్యను కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయవచ్చని లావణ్యారెడ్డి తెలిపారు. డ్రిప్ ద్వారా కూడా పంటలకు అందించవచ్చు. ఎకరం వరి పంటకు పిచికారీకి సుమారు 200 లీటర్ల ద్రావణం అవసరమవుతుందని, అందుకు ఆరు–ఏడు లీటర్ల దశగవ్య అవసరమవుతుందని ఆమె తెలిపారు. కూరగాయ పంటలకు పిచికారీ చేసేటప్పుడు 25 లీటర్ల నీటికి ఒక లీటరు దశగవ్య కలపాలని తెలిపారు. దశగవ్య పిచికారీ చేసిన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని, మంచి దిగుబడినిస్తాయని ఆమె అన్నారు. ఆవుపేడ, మూత్రం పుష్కలంగా ఉంది కాబట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని నెలకోసారి ఎకరానికి 5–6 క్వింటాళ్లు చల్లుతున్నామన్నారు. నీటిని అందించేటప్పుడు జీవామృతం కలిపి పారిస్తున్నామన్నారు. అగ్రి అస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా అవసరాన్ని బట్టి వాడుతున్నామని, మొత్తంగా తమ పంటలు ఆశ్చర్యకరంగా దిగుబడులు వస్తున్నాయన్నారు. జంజుబ గడ్డి.. 18 రోజులకో కోత లావణ్యారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 9 ఎకరాల్లో సంప్రదాయ రకం జంజుబ గడ్డితోపాటు పారాగడ్డి, సూపర్ నేపియర్, తీపిజొన్న రకాలను సాగు చేస్తున్నారు. అరెకరంలో కూరగాయలు, ఎకరంలో పసుపు, ఎకరంలో చెరకు, రెండెకరాల్లో సుగంధ దేశీరకం వరిని సాగు చేస్తున్నారు. జుంజుబ రకం గడ్డిని ఆవులు ఇష్టంగా తింటాయన్నారు. ఇది 18 రోజులకోసారి కోతకు వస్తుందన్నారు. కోత కోసిన తర్వాత నీటితోపాటు జీవామృతం పారిస్తామని, 5–6 రోజుల తర్వాత దశగవ్య పిచికారీ చేస్తామన్నారు. మోకాళ్ల ఎత్తుకు ఎదిగిన తర్వాత కోసి ఆవులకు వేస్తామన్నారు. –ఆకుల రాంబాబు, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా సేంద్రియ సాగు వ్యాప్తే లక్ష్యం దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి మూలాధారం. గో ఉత్పత్తుల ద్వారా వ్యవసాయంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి చెప్పటం సాధ్యమేనని రైతులకు తెలియజెప్పడం కోసం మోడల్ ఫామ్‌ను ఏర్పాటు చేశాను. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తికి దోహదపడే దశగవ్య, ఘనజీవామృతాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాను. సేంద్రియ సేద్యాన్ని వ్యాప్తిలోకి తేవాలన్నదే లక్ష్యం. – డా. ఉడుముల లావణ్యారెడ్డి (92468 45501), అందోలు, సంగారెడ్డి జిల్లా దేశీ రకం వరి, వంగ మొక్కలు, చెరకు తోట, కొర్ర పంట ప్లాస్టిక్ బ్యారెల్‌లో దశగవ్యను కలియదిప్పుతున్న కార్మికులు ఆవుల కోసం దాణా జుంజుబ గడ్డి -
కల్తీ నెయ్యి గుట్టురట్టు
120 టిన్ల డూప్లికేట్ నెయ్యి స్వాధీనం అబిడ్స్: కల్తీ నెయ్యి తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్ డీసీపీ టీమ్ పోలీసులు, షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా బుధవారం డూప్లికేట్ నెయ్యి తయారీ కేంద్రం, గోడౌన్లపై దాడులు చేసి రూ.3 లక్షల విలువైన కల్తీని నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. షాహినాయత్‌గంజ్ ఇన్స్పెక్టర్ ఎం. రామకృష్ణ కథనం ప్రకారం... షాహినాయత్‌గంజ్, బేదర్వాడీలతో పాటు మంగళ్‌హాట్ సీతారాంపేటలో నారాయణగూడకు చెందిన సచిన్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్ నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నారు. 15 కిలోల టిన్‌ల్లో 1.5 కిలోల ఒరిజినల్ నెయ్యి, 13.5 కిలో డాల్డా, పామాయిల్ కలిసి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. ప్యాకెట్లు, డబ్బాలకు విజయ, కృష్ణ, మహదేవ్ తదితర బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి అసలు కంపెనీల నెయ్యిగా విక్రయిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నెయ్యిని షాహినాయత్‌గంజ్, బేదర్వాడి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గోడౌన్లకు తరలించి అక్కడి నుంచి షాపులకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు 120 టిన్‌ల్లో గల 2 వేల లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకొని సచిన్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు సంజయ్ అగర్వాల్ కోసం గాలిస్తున్నారు. షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.