
పగటి పూట మాత్రమే కాదు రాత్రి సమయంలోనూ మేని నిగారింపుకు తగినంత సంరక్షణ తీసుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల ఎన్నో చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
►పాదాలే కాదు పెదాలు కూడా రాత్రి సమయంలో మాయిశ్చరైజర్ కోల్పోయి పొడిబారతాయి. పడుకునే ముందు బాదం నూనె లేదంటే లిప్ క్రీమ్ రాసుకోవాలి. రెండు–మూడు వారాలు ఇలా చేస్తే పెదవుల అందం మీరే గమనిస్తారు.
►ఉదయాన్నే నిద్రలేచాక అద్దంలో చూసుకుంటే మీ ముఖంపైన చర్మం ముడతలుగా, నొసలు మీద, బుగ్గలకు ఇరువైపులా లైన్స్‌లా ఏర్పడటం తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే రాత్రి మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ లభించడం లేదు. అందుకని మీరు పడుకునేముందు విటమిన్–ఇ ఉన్న నైట్ టైమ్ మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే చర్మ కాంతిమంతంగా అవడం మీరే గమనిస్తారు.
►కొంతమందికి గోళ్లు పెళుసుబారి విరిగిపోతుంటాయి. రాత్రి పడుకునేముందు గోరు చుట్టూ ఉండే క్యుటికల్స్‌లో మురికి లేకుండా శుభ్రం చేయండి. తర్వాత చేతి, కాలి గోళ్లకి మాయిశ్చరైజర్ లేదా బాదం నూనెతో బాగా మర్దనా చేయండి. కొన్ని రోజుల్లోనే గోళ్లు మెరుస్తూ మీకు మరింత అందాన్నిస్తాయి.
►మేకప్ లేదా పొల్యూషన్ వల్ల కనురెప్పలు నిస్తేజంగా అవడం, పలచబడటం అవుతుంటాయి. బాగా శుభ్రం చేసిన మస్కారా ట్యూబ్‌లో ఆముదం పోసి, ఆ మస్కారా బ్రష్‌కి అంటిన ఆముదాన్ని కనురెప్పలకు ఐ లాష్‌లా వేయండి. రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కనురెప్పల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
►పాదాల చర్మం పొడిబారి, పగుళ్లు లేకుండా ఉండాలంటే సులువైన పద్ధతి ఉంది. పడుకునేముందు పాదాలను శుభ్రంగా కడిగి, వాసలిన్ లేదా ఏదైనా మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేయాలి. తర్వాత కాటన్ సాక్స్ ధరించండి. దీని వల్ల పాదాల చర్మం మృదువుగా, అందంగా తయారవుతుంది.
►రాత్రి పడుకునేముందు రోజూ ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు బ్యూటీపార్లర్‌కి పెట్టే ఖర్చు బాగా తగ్గిపోతుంది. చర్మం యవ్వనకాంతితో మెరిసిపోతుంది.