
ఎముక మజ్జ కణజాలాన్ని కృత్రిమంగా సృష్టించడంలో బేసల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. గతంలోనూ ఇలాంటి కృత్రిమ మజ్జను సృష్టించినప్పటికీ దానికి సహజమైన మజ్జకు ఉన్న లక్షణాలు తక్కువగా ఉండేవి. ఉదాహరణకు మజ్జ ద్వారానే రక్తకణాలు పుడతాయన్నది మనకు తెలుసు. ఈ లక్షణం కృత్రిమ మజ్జకూ అలవడితే లుకేమియా వంటి కేన్సర్‌లకు మెరుగైన చికిత్స అందించవచ్చు. రక్తం ఏర్పడేందుకు వెనుక ఉన్న యంత్రాంగాన్ని అర్థం చేసుకునేందుకు బేసల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఉపయోగపడుతుంది.
తద్వారా రక్త సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స లభిస్తుందని అంచనా. పింగాణీతో చేసి త్రీడీ చట్రానికి మెసెన్‌కైమల్ స్టోమల్ కణాలను చేర్చి తాము ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని తయారుచేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇవాన్ మార్టిన్ తెలిపారు. మూలకణాల్లాంటి వాటిని చేర్చడం ద్వారా ఈ కణజాలం రక్తకణాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిందని, మరిన్ని పరిశోధనల తరువాత ఈ కృత్రిమ మజ్జ కణజాలాన్ని వాస్తవ పరిస్థితుల్లో వాడటం సాధ్యమవుతుందని ఇవాన్ వివరించారు.