టీజేఏసీకి ఎన్నికల తలనొప్పి | Telangana Political JAC Leaders not to decide on Political support | Sakshi
Sakshi News home page

టీజేఏసీకి ఎన్నికల తలనొప్పి

Apr 11 2014 2:08 AM | Updated on Aug 29 2018 4:16 PM

టీజేఏసీకి ఎన్నికల తలనొప్పి - Sakshi

టీజేఏసీకి ఎన్నికల తలనొప్పి

రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం కదం కలిపి పోరాడిన తెలంగాణ జేఏసీ నేతలు... రాజకీయ చదరంగంలోకి దిగాక ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు..

* ఎవరికి మద్దతివ్వాలనే అంశంలో ఎటూ తేల్చుకోలేని వైనం
* పలు స్థానాల్లో జేఏసీ నేతల మధ్యే పరస్పరం పోటీ
* ఎవరినీ కాదనకుండా.. మౌనం పాటిస్తున్న ముఖ్య నేతలు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం కదం కలిపి పోరాడిన తెలంగాణ జేఏసీ నేతలు... రాజకీయ చదరంగంలోకి దిగాక ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారిపోతున్నారు.. ఒక్కొక్కరు ఒక్కోపార్టీ నుంచి బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. 30వ తేదీన తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పలుచోట్ల జేఏసీలో కీలకంగా పనిచేసిన నేతల మధ్యే పోటీ నెలకొని ఉంది.

పలువురు జేఏసీ నేతలు వేర్వేరు పార్టీల తరఫున బరిలో ఉన్నారు. ఎవరికి వారు తమకే మద్దతివ్వాలంటూ టీజేఏసీపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కరవమంటే కప్పకు కోపం.. వదల మంటే పాముకు కోపం అన్నట్లుగా జేఏసీ పరిస్థితి తయారైంది. ఆయా చోట్ల ఎవరికి మద్దతివ్వాలనేదానిపై తెలంగాణ జేఏసీకి పాలుపోవడం లేదు. దీంతో మౌనాన్ని ఆశ్రయించడమే మేలని జేఏసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

‘తలనొప్పి’ నియోజకవర్గాలివే..
* నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, టీఆర్‌ఎస్ నుంచి గాదారి కిషోర్ పోటీపడుతున్నారు. దయాకర్ జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేయగా.. కిషోర్ ఓయూ జేఏసీలో కీలకంగా వ్యవహరించారు.

* మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్.. టీఆర్‌ఎస్ రెబెల్‌గా మరో జేఏసీ నేత అమరేందర్ బరిలో ఉన్నారు.
* కంటోన్మెంట్ స్థానం నుంచి గజ్జెల కాంతం కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయగా.. మొదట సీటు పొంది, పోగొట్టుకున్న విద్యార్థి జేఏసీ నేత కృశాంక్ కూడా పోటీకి దిగారు.

* మరోవైపు పలువురు జేఏసీ నేతలు కూడా వివిధ అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి (టీఆర్‌ఎస్), అంబర్‌పేట నుంచి నలిగంటి శరత్ (ఎంఐఎం), కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్ (టీఆర్‌ఎస్), వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి కత్తి వెంకటస్వామి (కాంగ్రెస్) బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతిచ్చిన ఇతర పార్టీల నాయకుల నుంచి పోటీ ఉంది. దాంతో ఇక్కడ కూడా ఎవరికి మద్దతివ్వాలో కూడా జేఏసీకి అంతుపట్టడం లేదు. అదేవిధంగా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్స్ జేఏసీ నేత బూర నర్సయ్యగౌడ్ (టీఆర్‌ఎస్) పోటీలో ఉన్నారు.

మౌనమే సమాధానమా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజకీయ పార్టీలకు దీటుగా పోరాడిన జేఏసీ... ఎన్నికల రాజకీయాలకు వచ్చే సరికి మౌనాన్నే ఆశ్రయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఒకవైపు టీడీపీని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ.. బీజేపీతో టీడీపీ పొత్తు అనంతరం ఆ కూటమిపై ఎటువంటి వైఖరి తీసుకుందనే విషయాన్ని వెల్లడించ లేదు. రాష్ట్రాన్ని తెచ్చింది తామేనంటున్న టీఆర్‌ఎస్, ఇచ్చింది తామేనంటున్న కాంగ్రెస్ పార్టీల విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాన్ని జేఏసీ ప్రకటించలేదు. కనీసం జేఏసీ నేతలకైనా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిద్దామంటే పరస్పరం పోటీతో కొత్త సమస్య వచ్చి పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement