ఆమె ‘అన్న’ కూతురైతే...నేను జగన్ తమ్ముణ్ని

ఆమె ‘అన్న’ కూతురైతే...నేను జగన్ తమ్ముణ్ని - Sakshi


రాజంపేట: ‘ఆమె అన్న కూతురైతే, నేను జగనన్న తమ్ముణ్ని.. జగనన్నే నా బలం. ఎన్నికలయ్యాక  వెంట తెచ్చుకున్న సూట్‌కేసుతో వెళ్లిపోతారు. నేను స్థానికుడిని. ఇక్కడే ఉండి మీ సమస్యలను పట్టించుకుంటాను’ అని వైఎస్‌ఆర్ సీపీ రాజంపేట ఎంపీ  అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.  తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆయన  బి కొత్తకోట, పీటీఎం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.



ఇద్దరు కేంద్ర  మాజీ మంత్రులు పురందేశ్వరి, సాయిప్రతాప్ ఎంపీ పదవికి, డబ్బుందని వ్యాపారి శంకర్ తంబళ్లపల్లె ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారన్నారు. వారు డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని, దీనికి ఓటర్లు బలికావద్దని కోరారు. ఓటుకు రూ.500 తీసుకుని వారికి ఓటేస్తే.. ఐదేళ్లపాటు నష్టపోవాల్సివస్తుందని హెచ్చరించారు. భవిష్యత్‌లో కష్టాలు రాకుండా ఉండేందుకు వైఎస్‌ఆర్ సీపీని ఆదరించాలన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారన్నారు.



ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడారని అన్నారు. తాను పల్లెల్లో పర్యటిస్తున్నప్పుడు చికిత్సలతో ప్రాణం పోసుకున్న వారంతా తమ శరీరంపై ఆపరేషన్లు చేసిన గుర్తులను చూపిస్తున్నారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతో పాటు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసేందుకు వైఎస్.జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు.



జగన్‌ మోహన్‌ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తని అని సీఎం కాగానే మహిళా రుణాలను మాఫీ చేస్తారని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులను జైళ్లకు పంపారని, బిల్లులు కట్టలేమన్న అన్నదాతలపై కేసులు పెట్టించారని గుర్తు చేశారు.  వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే, తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చంటూ ఎగతాళిచేసిన చంద్రబాబు నేడు ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆల్‌ఫ్రీ మాటలు చెబుతున్నారని విమర్శించారు. మతతత్వ బీజేపీ ఎంపీ అభ్యర్థిని, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ అభ్యర్థులను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.



మూడన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి కనీసం నీటి సమస్యనైనా తీర్చలేకపోయాడన్నారు. నియోజకవర్గ ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని తాను, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంతోపాటు జిల్లాలో నెలకొన్న సమస్యలను జగన్‌ మోహన్‌ రెడ్డి తీరుస్తారని అన్నారు. రాజంపేట ఎంపీగా తనను, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top