‘నేను మీముందుకు రాజుగా రాలేదు. రైతుగా వచ్చాను. నన్ను ఆశీర్వదించండి’. అని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బేబీనాయన విజ్ఞప్తి చేశారు.
గంట్యాడ,న్యూస్‌లైన్: ‘నేను మీముందుకు రాజుగా రాలేదు. రైతుగా వచ్చాను. నన్ను ఆశీర్వదించండి’. అని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బేబీనాయన విజ్ఞప్తి చేశారు. గంట్యాడ మండలంలో శుక్రవారం రాత్రి పొల్లంకి,పెంటశ్రీరామపురం గ్రామాలలో గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజులుపోయారు,రాచరికాలుపోయాయి ప్రజ లకు సేవచేసినవాడే నిజమయిన నాయకుడని అన్నారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాటపై నిలబడే వాడని ప్రజలకోసం చేస్తానన్నది చేసి చూపెడతారన్నారు. రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరిగిందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రజల కష్టాలు తీరే రోజులు దగ్గరలో ఉన్నాయ న్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రైతన్న కష్టాలు తీర్చడానికి వరి, చెరుకు, అపరాలు ప్రతి పంటకు గిట్టుబాటు ధరకల్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉండడంతో ఇంతరాత్రయినా ఆడపడుచులు,వృద్ధులు తమ కోసం వేచి ఉన్నారన్నారు.
తమ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని, మీ అందరి కన్నీరు తుడుస్తానన్నారు. మీలోఒకడిగా ఉంటానని అందలమెక్కాక మరిచిపోయే వాడిని కాదన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామన్న రాజ్యం ఉండేదని,జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎం.కృష్ణబాబు,మాజీ ఎంపీపీ వర్రి నరశింహమూర్తి, ఎం.సన్యాసినాయుడు,బూడి సత్యారావు,జాగరపు సత్యారావు,బొబ్బాదినారాయణ,కోడెల ముత్యాలునాయుడు,జె.దేముడు,ఆయాగ్రామాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.