ప్రజా ప్రస్థానానికి పదకొండేళ్లు


* 2003 ఏప్రిల్ 9న పాదయాత్రకు వైఎస్ శ్రీకారం

* నాడు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో దీనావస్థలోకి ప్రజలు

* ఆ సమయంలో వారికి బతుకుపై భరోసానిస్తూ సాగిన పాదయాత్ర

* 68 రోజులపాటు 1,475 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన వైఎస్

* ఆ కష్టాలను తీర్చే దిశగానే  సంక్షేమ పథకాల రూపకల్పన


 

 సాక్షి, హైదరాబాద్:
కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్న సమయం.. నిరుద్యోగుల నిరసన గళాలు, నేతన్నల ఆక్రందనలు.. నిలువ నీడలేక నిర్భాగ్యుల్లో నైరాశ్యం.. ఆర్చేవారు లేక, తీర్చేవారు లేక రైతన్నల ఆత్మహత్యలు.. తమను ఆదుకునే నాథుడే లేడా అని ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో.. ‘మీకు నేనున్నా’ అంటూ వారికి బతుకుపై భరోసా కలిగించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. ఒక్క అడుగుతో మొదలైన ఆ పాదయాత్ర.. ప్రజల బతుకుల్లో కొత్త వెలుగులు తెచ్చింది.. రాష్ట్ర రాజకీయ చరిత్రను ఓ మలుపు తిప్పింది.. భారత దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రంలో ఐదేళ్ల సువర్ణయుగానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ పేరును దేశమంతటా చాటింది. ఆ సాహసోపేతమైన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 2003లో సరిగ్గా ఇదే రోజున-ఏప్రిల్ 9న మొదలైంది.. ఆ యాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా పదకొండేళ్లవుతోంది.

 

 చేవెళ్ల నుంచి శ్రీకాకుళం దాకా..


 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 40 డిగ్రీల తీవ్రస్థాయి ఎండను సైతం లెక్కచేయకుండా వైఎస్ చేసిన ఆ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. అప్పటికే కుదేలైన కాంగ్రెస్‌కు ఈ పాదయాత్రే మళ్లీ ప్రాణం పోసింది. వైఎస్ పాదయాత్రను ప్రారంభించే నాటికి రాష్ట్రంలో ప్రజలు అనేక బాధలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న పరిస్థితుల్లో వ్యవసాయదారులు, చేతి పనుల వారు నిరాశా నిస్పృహల్లో కొట్టు మిట్టాడుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజల బాగోగులను పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. దీన స్థితిలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడానికి మండుటెండల్లో వైఎస్ చేసిన ఈ సాహసోపేతమైన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన రీతిలో స్పందన లభించింది.

 

  వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి మొదలుపెట్టి 11 జిల్లాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 690 గ్రామాల ప్రజలను కలుసుకుంటూ మొత్తం 1,475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కరువుతో అలమటిస్తున్న ప్రజలను కలుసుకుని, వారి బాధలు తెలుసుకుని, వారిని ఓదార్చడానికే తప్ప ఓటు కోసం కాదని ప్రకటించి మరీ ఈ సాహసోపేతమైన పాదయాత్రకు ఆయన నడుం బిగించారు.

  తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర దారి పొడవునా ప్రజల ఆప్యాయత, ఆత్మీయతలను అందుకుంటూ ముందుకుసాగిన వైఎస్ వారి జీవన స్థితిగతులను లోతుగా పరిశీలించారు. కరువుకాటకాలతో అప్పటికే అతలాకుతలమవుతున్న రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే వారి సమస్యలు తీరతాయో గ్రహించడానికి ఈ పాదయాత్ర వైఎస్‌కు దోహదపడింది.

  68 రోజుల పాటు ఏక ధాటిగా, అప్రతిహతంగా సాగిన పాదయాత్ర జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఎన్ని కష్టనష్టాలొచ్చినావెరవకుండా తన సంకల్పాన్ని పూర్తి చేశారు.

  ఆ యాత్రలోనే రైతులకు తక్షణం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకున్న వైఎస్ వారికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు ఆరోగ్యం, విద్య, నీడ ఎంత అవసరమో పాదయాత్ర సందర్భంగా తెలుసుకున్న వైఎస్ ఈ మూడు అవసరాలను తీర్చడానికి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఒక కోటి ఎకరాలకు సాగునీటిని కల్పించాలనే బృహత్తరమైన ఆశయంతో జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top