డొనాల్డ్‌ ట్రంప్‌ రాయని డైరీ

Madav Shingaraju Sayani Dairy on Donald Trump - Sakshi

బ్లెనిమ్‌ ప్యాలెస్‌కు వెళ్లేటప్పటికి భార్యాభర్తలిద్దరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. థెరిసా మే గ్రేస్‌ఫుల్‌గా ఉంది! ‘నా భర్త ఫిలిప్స్‌’ అంటూ ఓ వ్యక్తిని పరిచయం చేసింది. 
థెరిసా చలాకీగా ఉంది. మెలానియ కన్నా పన్నెండేళ్లు పెద్ద. అయినా చలాకీగా ఉంది. ‘చూశావా?’ అన్నట్లు మెలానియ వైపు చూశాను. ‘చూస్తూనే ఉన్నా..’ అన్నట్లు చూసింది. 
థెరిసా తను వెనుక ఉండి, నన్ను ముందుకు నడిపిస్తోంది! ప్యాలెస్‌లోకి ఒక్కో మెట్టూ ఎక్కిస్తోంది. స్త్రీలో ఆ చొరవ ఉండాలి. అన్నీ మగాళ్లే చేస్తుంటే మహరాణుల్లా కోట పైభాగం ఎక్కి సామ్రాజ్యాన్ని వీక్షించడం కాదు.

‘‘నేను నడవగలను థెరిసా.. అంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నారు?’’ అన్నాను.

‘‘శ్రమ కాదు. సంప్రదాయం’’ అంది.

మెలానియ నా వెనుక ఉంది. ఆమె వెనుక.. బ్రిటిష్‌ సంప్రదాయం ప్రకారం ఎవరున్నారో మరి. వెనక్కు తిరిగి చూద్దాం అనుకున్నాను. థెరిసా తల తిప్పుకోనివ్వడం లేదు. 

‘‘మనమిప్పుడు ఎక్కడికి వెళ్లబోతున్నాం థెరిసా?’’ అని అడిగాను. 

‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. మీకోసం బ్లాక్‌ టై డిన్నర్‌ సిద్ధంగా ఉంది’’ అంది. 

‘‘అందులోకి ఏముంటుంది థెరిసా’’ అని అడిగాను. 

‘‘స్కాట్లాండ్‌ దేశపు సాల్మన్‌ చేపలు, వేయించిన హార్‌ఫోర్డ్‌ ఎద్దు మాంసం ఫిలెట్స్, గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌లో బిగుసుపోయిన స్ట్రాబెర్రీస్‌..’’ అని చెప్పింది. అన్నీ నాకు ఇష్టమైనవే!
మెలానియకు, థెరిసాకు ఎంత తేడా! ‘డిన్నర్‌లోకి ఏముంది మెలానియా’ అని ఎప్పుడైనా అడిగితే.. ‘ఏమో నాకేం తెలుసు?’ అని విసురుగా అంటుంది.. పింగాణీ ప్లేట్‌ని ఎత్తి ముఖానికి కొట్టినట్టు! ఇద్దరు ఆడవాళ్ల మధ్య సృష్టిలో ఇంత వైరుధ్యం ఏమిటో?!

‘‘నాకోసం చాలా శ్రమ పడినట్లున్నారు థెరిసా’’ అన్నాను. 

‘‘సంప్రదాయం’’ అంది మళ్లీ.

ట్రంపెట్స్‌ చప్పుళ్లలో ఎవరి మాటా ఎవరికీ వినిపించడం లేదు. డిన్నర్‌ హాల్లోకి వెళ్లి కూర్చున్నాం. హాలు నిశ్శబ్దంగా ఉంది. 

థెరిసా కూడా నిశ్శబ్దంగానే ఉన్నట్లు గమనించాను. నాకై నేను అడగడమే కానీ, తనకై తనేం చెప్పడం లేదు! 
‘‘సారీ.. థెరిసా, మీ గురించి నేను అన్నది వేరు. పత్రికలు రాసింది వేరు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించాను. కానీ ఎంతగానో విమర్శించినట్లు రాశారు వాళ్లు’’ అని చెప్పాను. 
‘‘ప్రెస్‌వాళ్లు ఉన్నదే అందుకు కదా మిస్టర్‌ ప్రెసిడెంట్‌’’ అని నవ్వింది థెరిసా. 

ఎంత చక్కగా అర్థం చేసుకుంది! దేవుడు స్త్రీలందరినీ ఒకేలా ఎందుకు పుట్టించడో మరి! ముఖాలు వేర్వేరుగా ఉంచేసి, మనసులన్నీ ఒకేలా ఉంచాలన్న ఐడియా అతడికి ఎప్పటికైనా వస్తుందా?

- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top