సీబీఐ దురవస్థ!

Editorial On CBI Present Conditions - Sakshi

పదవి, అధికారం ముసుగులో వాస్తవాలను మసిపూసి మరుగుపరచాలని చూస్తే అంతిమంగా అది వ్యక్తి లేదా మొత్తం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, ఆ సంస్థను ధ్వంసం చేస్తుందని విఖ్యాత ఆర్థికవేత్త పాల్‌ క్రుగ్‌మాన్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పుడు పరస్పర ఫిర్యాదులతో, ఆరోపణలతో, కేసులతో, అరెస్టులతో బజా ర్నపడిన తీరు ఆ వ్యాఖ్య అక్షరసత్యమని నిరూపిస్తోంది. కేంద్రంలో అధికారం చలాయించే పాల కులు ఆడమన్నట్టు ఆడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న సీబీఐ పోకడల్ని గమనించి సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం అది ‘పంజరంలో చిలుక’గా మారిందని కొన్నేళ్లక్రితం వ్యాఖ్యానించింది. దానికి స్వయంప్రతిపత్తి ఇస్తే తప్ప అది సరిగా పనిచేయదని తేల్చింది.

కానీ దురదృష్టమేమంటే ఇంతక్రితం యూపీఏ హయాంలోనూ, ఇప్పుడు ఎన్‌డీఏ హయాంలోనూ ఆ విషయంలో పెద్దగా మారిందేమీ లేదు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నవారి ఆదేశాలకు అనుగుణంగా, వారు ఎవర్ని వేధిం చమంటే వారిని వేధిస్తూ, కేసులు పెడుతూ కాలక్షేపం చేసిన సీబీఐ తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందాన ఇప్పుడు తన కార్యాలయంలో తానే సోదాలు జరుపుకునే స్థితికి... తన ఉన్న తాధికారిపై తానే కేసు పెట్టే స్థితికి... తన ఉన్నతాధికారిని తానే అరెస్టు చేసే స్థితికి దిగజారింది. ఇందులో ‘రా’ అధికారులపై సైతం ఆరోపణలొచ్చాయి. దీన్నంతటినీ కేవలం సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ఆ సంస్థ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాల మధ్య రాజుకున్న అధికార పోరాటంగానే చూస్తే విషయం అర్థంకాదు. దీని మూలాలు అంతకన్నా లోతైనవి. 

ఇవాళ సీబీఐలో సాగుతున్న పరిణామాలు గమనించి సాధారణ పౌరులు కలవరపడటంలో అర్ధముంది. ఒక అత్యున్నతమైన దర్యాప్తు సంస్థగా, ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థగా ఉండాల్సిన సీబీఐ ఇంతటి దుస్థితిలో పడిందేమిటని బాధపడటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ పరిణామాలను చూసి గుండెలు బాదుకుని బావురుమంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ పార్టీ కేంద్రంలో అధికారం చలాయించినప్పుడు దాన్నెలా భ్రష్టు పట్టించిందీ గుర్తుకు తెచ్చు కోవాలి. ఆరోజు సుప్రీంకోర్టు సీబీఐని ‘పంజరంలో చిలుక’ని అభివర్ణించడానికి కారణం ఆ నిర్వాకం పర్యవసానమేనని గుర్తెరగాలి. ఇదే అదునుగా చంద్రబాబు నాయుడు సైతం తగుదు నమ్మా అంటూ సుద్దులు చెప్పడానికి ప్రయత్నించడం అన్నిటికన్నా విడ్డూరం. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో ఆయన్ను మించినవారు లేరు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఆ వ్యవస్థలన్నీ తన చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోగలిగిన ఘనుడాయన! ఆయన సైతం సీబీఐలోని పరిణామా లపై తెగ బాధపడిపోతున్నారు.

సీబీఐలోని ప్రస్తుత పరిణామాలు అసాధారణమైనవి. అందులో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేంద్రకుమార్‌ను ఒక అవినీతి కేసులో ఆ సంస్థే అరెస్టు చేసింది. ఆయన కార్యాలయంలో, ఆయన ఇంట్లో ఫోన్లు, ఐపాడ్లు స్వాధీనం చేసుకుంది. ఇంకా చిత్రమేమంటే ఆయన అరెస్టయిన కేసులోనే స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానా కూడా నిందితుడు! తనపై కేసు పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆస్తానా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి, వచ్చే సోమవారం వరకూ యధాతథ స్థితిని కొనసా గించమని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దేవేంద్ర ఏడురోజుల కస్టడీకి వెళ్లారు. అటు ఆస్తానా కూడా అలోక్‌ వర్మపై ఆరోపణలు చేశారు. వాటి సంగతేమవుతుందో మున్ముందు చూడాలి. దాని సంగతలా ఉంచి ఈ కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం నేతల పేర్లు ప్రస్తావనకు రావడం, కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో పైరవీలు చేసిందెవరు...ఎవరు ఎవరితో మాట్లాడారు...ఎక్కడ కలుసుకు న్నారు... ఎక్కడ డబ్బులు చేతులు మారాయి అనే అంశాలు గమనిస్తే పైకి కనిపిస్తున్న, ప్రచార మవుతున్న కథనాలను మించి వ్యవహారాలు నడిచి ఉంటాయని అర్ధమవుతుంది.

ఇదే సీబీఐ గతంలో పాలకుల రాజకీయ ప్రత్యర్థులను ఎలా వేధించిందో ఎవరూ మర్చిపోరు. అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విభేదించి బయటికొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కుమ్మక్కయి హైకో ర్టులో పిటిషన్‌లు వేయడం, సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశాలివ్వడం తడవుగా సీబీఐ ఎక్కడలేని చురుకుదనమూ ప్రదర్శించడం అందరికీ తెలుసు. ఆ ఆదేశాలు వెలువడిన కొన్ని గంట ల్లోనే వందలమంది సిబ్బందితో టీంలు ఏర్పరిచి, వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ దాడులకు దిగింది. ఆ తర్వాత పచ్చ మీడియాకు లీకుల మీద లీకులిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి పరువు ప్రతిష్టల్ని దిగజార్చే ప్రయత్నం చేసింది. ఆయన్ను అరెస్టు చేసి, బెయిల్‌ రాకుండా దీర్ఘకాలం అడ్డుపడింది.

అసలు ఆ కేసుల్లో దర్యాప్తే తల్లకిందులుగా ప్రారంభించింది. ఏడాదిన్నర గడిచాక అసలు ‘క్విడ్‌ ప్రో కో’ ఆరో పణలకు మూలాధారమైన 26 జీవోల కూపీ తీయడం లేదేమని సర్వోన్నత న్యాయస్థానం మందలించాక సీబీఐ వాటిపై దృష్టి పెట్టింది. కానీ చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌర వాధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ విషయంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే ఆ సంస్థ బాబు అప్పీల్‌కి వెళ్లి స్టే తెచ్చుకునేవరకూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది.

ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు గమనించాక ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రమే కాదు... దేశంలోని ప్రజాస్వామికవాదులు, న్యాయనిపుణులు సైతం ఆ సంస్థ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఈ ధోరణి మారనందునే సుప్రీంకోర్టు భిన్న సందర్భాల్లో సీబీఐపై నిప్పులు చెరిగింది. కనీసం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అయినా సీబీఐ ప్రక్షాళనకు కేంద్రం నడుం బిగించాలి. ఈ పరస్పర ఆరో పణల్లోని నిజానిజాలను వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పాత్రధారులు మాత్రమే కాదు... సూత్రధారుల పని కూడా పట్టాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top