ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ప్రభుత్వాలు సమర్ధవంతమైనవైతే ఆ చట్టసభలు సజావుగా సమావేశం కాగలుగుతాయి.
ప్రజాస్వామ్యంలో చట్టసభలు అత్యంత ప్రాముఖ్యమైనవి. ప్రభుత్వాలు సమర్ధవంతమైనవైతే ఆ చట్టసభలు సజావుగా సమావేశం కాగలుగుతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సభల్లో ప్రస్తావనకొచ్చి, వారి సంక్షేమానికి అవసరమైన చట్టాల రూపకల్పన సాధ్యమవుతుంది. ప్రభుత్వాలకుండే మెజారిటీయే దీన్నంతటినీ నిర్దేశించదు... అందరినీ సమన్వయం చేసుకునే నేర్పు, చిత్తశుద్ధి ఉండే నాయకత్వం మాత్రమే సభలను సక్రమంగా నిర్వహించ గలుగుతుంది. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చాక ఈ విషయంలో తీవ్రంగా విఫలమైంది. పార్లమెంటు సమావేశమైన ప్రతిసారీ ఏదో సమస్య ముంచుకు రావడం, ఆ విషయంలో అందరినీ కలుపుకొనివెళ్లే ధోరణిని ప్రభుత్వం ప్రదర్శించకపోవడం... ఉభయ సభలూ వాయిదాలతో గడిచిపోవడం సర్వసాధారణ విషయంగా మారింది. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తీరు గమనిస్తుంటే ఇవి కూడా గందరగోళ దృశ్యాలతోనే కొనసాగుతాయన్న అభిప్రాయం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు సభాధ్యక్ష స్థానాలవద్దకు దూసుకు రావడం, నినాదాలు చేయడంలాంటి ఘటనలు తొలిరోజు చోటు చేసుకున్నాయి. ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయానికి పదే పదే అంతరాయం కలిగింది. అటు తర్వాత కూడా పరిస్థితి అలాగే కొనసాగి చివరకు రేపటికి వాయిదాపడ్డాయి. సభల్లో జరిగింది సరేగానీ... వెలుపల కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న మాటలు తీవ్ర గందరగోళం కలిగిస్తున్నాయి. విభజన అంశాన్ని తమతో పార్టీ పెద్దలు అసలు చర్చించలేదని కొందరు అంటుంటే... 15 రోజులక్రితం చెప్పారని, అయితే అది జరగదన్న భరోసాతో ఉన్నామని ఒక ఎంపీ వెల్లడించారు. ఎలాగూ విభజన జరుగుతున్నది కనుక...రాయలసీమ సంగతి కూడా ఇప్పుడే తేల్చుకుంటే మంచిదని ఇంకొకాయన అన్నారు. ఇంతటితో ఆగలేదు. రాజీనామాలవల్ల ఉపయోగంలేదని, విభజన గురించి పార్లమెంటులో చర్చకొచ్చినప్పుడు గట్టిగా నిలదీయడానికి ఇది ఆటంకమవుతుందని, తాము గనుక సభలో ఉంటే శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాలని డిమాండు చేస్తామని ఒకరోజు చెబుతారు. సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది గనుక రాజీనామా చేస్తున్నామని మరుసటి రోజు ప్రకటిస్తారు. ఇలా గత నాలుగైదురోజులుగా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఈ ఎంపీలంతా ఇప్పటికే ప్రజల్లో కావలసినంత అయోమయాన్ని సృష్టించారు. అది చాలదన్నట్టు ఇప్పుడు పార్లమెంటుకూ దాన్ని తీసుకెళ్లారు. తెలుగుదేశం ఎంపీల పరిస్థితి కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు. తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికే ఒక ప్రకటన చేసివున్నారు. హైదరాబాద్ తరహాలో రాజధానిని ఏర్పాటుచేసుకోవడానికి సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు మంజూరుచేయాలని ఆయన సూచించారు. బాబును ఈ విషయమై నిలదీయడంగానీ, ఆయన ప్రకటనతో విభేదిస్తున్నామని చెప్పడంగానీ చేయని సీమాంధ్ర టీడీపీ ఎంపీలుకూడా పార్లమెంటును స్తంభింపజేయడంలో కాంగ్రెస్ ఎంపీలతో చేతులు కలిపారు.
రోజుకో మాటగా, పూటకో వేషంగా సాగుతున్న ఈ వ్యవహారంవల్ల ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతారని, ఉద్రేకాలకు లోనవుతారని ఈ రెండు పార్టీల నాయకులూ మరిచిపోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమూ, ప్రభుత్వపరంగా దానికి సంబంధించిన లాంఛనాలు పూర్తిచేయడానికి అది చురుగ్గా కదులుతున్న తీరూ బహిరంగంగా కనబడుతూనే ఉన్నది. ఈ నిర్ణయం సంగతి తమకు ముందుగానే చెప్పివుంటే దాని పర్యవసానాలెలా ఉంటాయో పార్టీ పెద్దలకు వివరించడం...విభజనకు ముందు చేయాల్సిందేమిటో, తేల్చవలసిన సమస్యలేమిటో వారి దృష్టికి తీసుకెళ్లడం ఈ ఎంపీల, మంత్రుల బాధ్యత. ఈ విస్తృతమైన సమస్యను కేవలం పార్టీలో చర్చించడం కాక... భిన్న ప్రాంతాల, భిన్నవర్గాల ప్రజల్లో చర్చకుపెట్టి వారిని ఒప్పించాలని చెప్పాలి. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇందులో ఏమైనా చేశారా? పోనీ, కాంగ్రెస్ పెద్దలు తమను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అయినా బహిరంగంగా ప్రకటించారా? ఇవేమీ చేయలేదు.
ఎవరినీ సంప్రదించకుండా, ఏమీ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుని... అందువల్ల వచ్చే క్రెడిట్ తమకే దక్కాలన్న దురాశతో కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించడంవల్ల పరిస్థితి క్లిష్టంగా మారింది. కనీసం నాలుగేళ్లక్రితం తెలంగాణ ఏర్పాటు ప్రకటనచేసి, వెనక్కు తీసుకున్నాకైనా... పారదర్శకంగా వ్యవహరించి అన్ని ప్రాంతాల ప్రజలనూ విశ్వాసంలోకి తీసుకుని, విభజనకు సంసిద్ధుల్ని చేసివుంటే ఇప్పుడున్న ఉద్రిక్తతలు ఏర్పడేవి కాదు. కొత్త రాష్ట్రానికి రాజధాని నగరం ఏర్పాటు, కృష్ణా జలాల సమస్య, ఉద్యోగుల బదలాయింపు, ఉపాధి వంటి ఎన్నో అంశాలపై పరిశీలన జరిపి, ప్రజల్లో తలెత్తే సవాలక్ష సందేహాలకు జవాబిచ్చి విభజన ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కాంగ్రెస్ అనాలోచిత వైఖరివల్ల ఇప్పుడు పరస్పర అపోహలు, ఉద్వేగాలు పెరుగుతున్నాయి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సి అంశాలను ఇప్పుడు తలకెత్తుకుని, వాటి పరిష్కారానికి కమిటీలను ఏర్పాటుచేస్తామని దిగ్విజయ్‌సింగ్‌లాంటి వారు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలకు అభయం ఇస్తున్నారు. కుంభకోణాలతో అన్నివిధాలా భ్రష్టుపట్టిన యూపీఏ మరోసారి అధికారంలోకి రావడం అసాధ్యమని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి హామీలకు విలువేమిటి? స్వరాష్ట్రాల్లో తిరస్కృత నేతలుగా ముద్రపడిన వీరంద రూ చేతికి ఎముక లేకుండా హామీలిచ్చేందుకు ఎగబడటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు విస్మయం చెందుతున్నారు. ఇన్నేళ్ల పాలనానుభవం నుంచి వీరు నేర్చుకున్నది ఇదా అని విస్తుపోతున్నారు.