
పోలీసుల అదుపులో సయ్యద్ జఫార్ మొయినుద్దీన్
నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఓ అక్రమ మ్యాన్‌పవర్ కన్సెల్టెన్సీ గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల్లో ఉద్యోగులు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బు దండుకొని.. నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఓ అక్రమ మ్యాన్‌పవర్ కన్సెల్టెన్సీ గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ర ట్టుచేశారు. డీసీపీ బి.లింబారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ జఫార్ మొయినుద్దీన్ టోలిచౌకిలోని డీలక్స్ కాలనీలో ‘ట్రావెల్ అబ్రాడ్’ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. ఇతగాడు ట్రావెల్స్ ముసుగులో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే మాన్‌పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు.
ఈ తరహా కన్సల్టెన్సీలు నిర్వహించాలంటే భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. దుబాయ్‌లో సూపర్‌వైజర్, ప్లంబర్, మెకానిక్, కుక్, హెల్పర్, లేబర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని చెప్తూ నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష జీతం వస్తుందని వల వేసేవాడు. ఆసక్తి చూపిన వారి నుంచి పాస్‌పోర్ట్‌తో పాటు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసే వాడు. కొన్నాళ్లు మ«భ్యపెట్టి చివరకు వీసా రిజెక్ట్ అయిందని మోసం చేసేవాడు.
నిజామాబాద్ జిల్లాలో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న జఫార్ అక్కడ దాదాపు 70 నుంచి 80 మందిని మోసం చేశాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి శుక్రవారం దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు. డాక్యుమెంట్లు, స్టాంపులు తదితరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం గోల్కొండ పోలీసులకు అప్పగించారు.