ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే మీడియాపై ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే
విజయనగరం కంటోన్మెంట్ : ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపితే మీడియాపై ఉక్కుపాదం మోపడం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే చూస్తున్నామని జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ధ్వజమెత్తింది. సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడం దారుణమని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం విజయనగరం జర్నలిస్టుల సంఘాల ఐక్యవేదిక పట్టణంలోని కోట జంక్షన్ వద్ద భారీ ర్యాలీ చేపట్టింది.
కోట నుంచి ర్యాలీగా డెంకాషవలీ బాబా మసీదు వద్దకు చేరుకుని అక్కడ కాసేపు మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో సాక్షి బ్యూరో ఇన్‌చార్జి కందుల శివశంకర్, సాక్షి ఛానల్ కరస్పాండెంట్ బండారు ఈశ్వరరావు, మల్లికార్జునరావు, పి.నాగరాజు, బి.నాగేంద్రప్రసాద్, ప్రయాగల రాజు, వై.సుబ్బారావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
నాటి ఎమర్జెన్సీని తలపిస్తునారు..
అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ఎంత అప్రతిష్ట పాలయ్యారో పాలకులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదేస్థాయిలో మీడియాపై అణచివేత ధోరణి కొనసాగుతోంది. ప్రసారాలను నిలిపివేసినంత మాత్రాన ప్రభుత్వ అక్రమాలు బయటకు వెళ్లబోవనుకోవడం హాస్యాస్పదం. అప్పటి కన్నా ఇప్పటిది నీచపాలనగా ప్రజలు గుర్తిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కళ్లు తెరవాలి.
- గమిడి కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమాలను నియంత్రించగలరా?
ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తోంది. ఓ చానల్‌ను నియంత్రించి తమ లోపాలను కప్పిపుచ్చుకుంటున్నామని సంబరపడిపోతున్న ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలను నిరోధించగలదా? సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ అవినీతి ప్రధానాంశాలుగా ప్రసారాలవుతున్నాయి. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చే సి అప్రతిష్ట పాలుకాకుండా ఉండాలంటే వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి.
- వి.లక్ష్మణరావు


