ఆ వర్షంతో అల్లకల్లోలం ! | rain hulchal in august and lost crops | Sakshi
Sakshi News home page

ఆ వర్షంతో అల్లకల్లోలం !

Nov 5 2016 10:36 PM | Updated on Sep 4 2017 7:17 PM

ఆ వర్షంతో అల్లకల్లోలం !

ఆ వర్షంతో అల్లకల్లోలం !

అనంత'ను ఆగస్టు, అక్టోబర్‌లో కురిసిన వర్షాలు అల్లకల్లోలం చేశాయి.

– ఆగస్టు, అక్టోబర్‌లో 193 మి.మీ గానూ 25 మి.మీ వర్షపాతం నమోదు
– దారుణంగా దెబ్బతిన్న ఖరీఫ్, రబీ పంటలు


అనంతపురం అగ్రికల్చర్‌ : 'అనంత'ను ఆగస్టు, అక్టోబర్‌లో కురిసిన వర్షాలు అల్లకల్లోలం చేశాయి. ఈరెండు నెలల్లో వరుణుడు శీతకన్ను వేయడంతో ఖరీఫ్, రబీపై జిల్లా రైతులు పెట్టుకున్న ఆశలను అత్యంత దారుణంగా చిదిమేశాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీన వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో 'అనంత' వ్యవసాయం పెనుసంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం నెలకొంది. ఈ విపత్తు నుంచి కోలుకుని గట్టెక్కడం అంత సులభంగా కనిపించడం లేదు. ఖరీఫ్‌ ఆరంభంలో జూన్, జూలైలో వర్షాలు మురిపించడం, అదనులోనే 94 శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావడంతో పంట దిగుబడులపై రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. కానీ.. జూలై 28వ తేదీ తర్వాత వరుణుడు మొహం చాటేశాడు.

వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తుండగా రోజులు ఇట్టే గడిచిపోయాయి. చినుకు మాత్రం నేల రాలలేదు. దీంతో కీలక దశలో ఉన్న 6.09 లక్షల హెక్టార్ల వేరుశనగ పంట నిట్టనిలువునా ఎండిపోయింది. ఆగస్టులో 88.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నెలంతా కలిపి కేవలం 18.1 మి.మీ నమోదైంది. 80 శాతం తక్కువగా వర్షాలు పడటంతో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా జిల్లా అంతటా వేరుశనగ, ఇతర పంటలు కోలుకోలేకపోయాయి. సెప్టెంబర్‌ కూడా పది పన్నెండు మండలాల్లో మోస్తరుగా వర్షం పడగా తక్కిన ప్రాంతాల్లో వర్షం జాడ కనిపించలేదు. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ సాధారణ వర్షపాతానికి గానూ అతికష్టం మీద 41.9 మి.మీ నమోదైంది.

అంటే ఇక్కడ కూడా 65 శాతం తక్కువగానే వర్షాలు పడ్డాయి. దీంతో చెట్టుకు ఉన్న రెండు మూడు కాయలు కూడా అభివృద్ధి కాలేదు. మేత కూడా ఎండిపోయింది. చాలా చోట్ల కూలీ ఖర్చులు కూడా రావడం లేదని పశువులకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తుంపర వర్షం పడిన కొన్ని ప్రాంతాల్లో చెట్టుకు రెండు మూడు కాయలు దక్కాయి. ఇలా ఖరీఫ్‌ను అత్యంత పాశవికంగా కాటేసిన వరుణుడు రబీ రైతుల ఆశలపై కూడా నీళ్లు కుమ్మరించాడు. రబీలో ప్రధాన పంట పప్పుశనగ సాగుకు అక్టోబర్‌ నెలలో వర్షాలే కీలకం. కానీ.. ఆగస్టు నుంచి నెలకొన్న వర్షాభావ పరిస్థితులు అక్టోబర్‌లో కొనసాగడంతో రబీ పడకేసింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్టోబర్‌లో 104.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 7.1 మి.మీ మాత్రమే నమోదైంది.

అంటే ఏకంగా 94 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి. దీంతో 1.40 లక్షల హెక్టార్ల రబీ పంటలు విత్తుపడకుండానే ఆగిపోయింది. ఈ పాటికి లక్ష హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో రబీ పంటలు సాగులోకి రావాల్సి ఉండగా కేవలం 6 వేల హెక్టార్లకు పరిమితం కావడం చూస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. మొత్తమ్మీద చూస్తే ఆగస్టు, అక్టోబర్‌ ఈ రెండు నెలల కాలంలో 193 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 25 మి.మీ మాత్రమే కురిసింది. 193 మి.మీ ఎక్కడ... 25 మి.మీ ఎక్కడ..? ఇంత దారుణమైన వర్షాలు గతంలో ఎపుడూ చూడలేదని వ్యవసాయశాఖ, ప్రణాళికశాఖ అధికారులతో పాటు శాస్త్ర్రవేత్తలు చెబుతున్నారు.


60 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ : జూన్‌ నుంచి అక్టోబర్‌ 31వ తేదీ నాటికి 450 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 264.5 మి.మీ నమోదైంది. అంటే 41 శాతం తక్కువగా వర్షపాతం కురిసింది. అందులో ఆత్మకూరు, కూడేరు, పెద్దవడుగూరు మండలాల్లో మాత్రమే సాధారణం నమోదైంది. మిగతా 60 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement