
ఆగస్ట్‌లో 62.9 ∙15 ఏళ్ల గరిష్ట స్థాయి
న్యూఢిల్లీ: సేవల రంగం బలమైన వృద్ధితో దూసుకుపోతోంది. 15 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఆగస్ట్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సేవల రంగ పీఎంఐ 62.9గా నమోదైంది. జూలైలో ఇది 60.5గా ఉంది. 2010 తర్వాత సేవల రంగం పనితీరు ఒక నెలలో ఈ స్థాయిలో వృద్ధిని సాధించడం ఇదే ప్రథమం. కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం, డిమాండ్ పరిస్థితులు చెప్పుకోతగ్గ మేర మెరుగవడం బలమైన పనితీరుకు సాయపడినట్టు హెచ్‌ఎస్‌బీసీ సర్వే తెలిపింది.
2014 సెప్టెంబర్ నుంచి చూస్తే అంతర్జాతీయ అమ్మకాలు మూడో అత్యధిక గరిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొంది. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, యూఎస్ క్లయింట్ల నుంచి డిమాండ్ భారీగా ఉన్నట్టు తెలిపింది. దీంతో భారత కంపెనీలు అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు దారితీసినట్టు పేర్కొంది. సిబ్బంది పెరుగుదలతో కంపెనీలు మరిన్ని ఆర్డర్లను సొంతం చేసుకోగలవని తెలిపింది.
మానవ వనరులపై అధిక వ్యయాలు, బలమైన డిమాండ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్ట్‌లో సేవల ధరలు గణనీయంగా పెరిగినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. ఇక ఆగస్ట్ నెలలో తయారీ, సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ సైతం 17 ఏళ్ల గరిష్ట స్థాయిలో 63.2గా నమోదైంది. 400 సేవల రంగ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ‘హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ’ని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది.