
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు 17 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. మన దేశంలో చివరిసారిగా 2009లో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. పారిస్‌లో జరిగిన 2025 టోర్నీ ముగింపు సందర్భంగా వచ్చే ఏడాది వేదిక వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ అధ్యక్షురాలు ఖున్‌యింగ్ పటామా, భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కార్యదర్శి సంజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా వంద శాతం అత్యుత్తమ స్థాయిలో ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహిస్తామని మిశ్రా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో నిలకడగా విజయాలు సాధిస్తున్న జట్లలో భారత్ కూడా ఒకటి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటి వరకు 15 పతకాలు గెలుచుకుంది. 1983లో ప్రకాశ్ పడుకోన్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యంతో తొలి పతకం అందించగా... 2011 నుంచి ప్రతీ ఏటా కచ్చితంగా మన ఆటగాళ్లు ఏదైనా ఒక పతకం గెలుస్తూ వచ్చారు. అత్యధికంగా పీవీ సింధు ఒక స్వర్ణం సహా మొత్తం ఐదు పతకాలు సాధించింది.