
ఢిల్లీ: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని ఎన్‌డీఎంసీ వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. ఈ అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది.
వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదికయ్యాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.
దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.