
'సీఎం ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా బెదిరించారు'
చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు.
విజయవాడ : చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలో పీసీసీ కార్యాలయంలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ... కృష్ణాజిల్లా ఎమ్మార్వో వనజాక్షిని కేసు విత్ డ్రా చేసుకోమని సీఎం చంద్రబాబు ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా బెదిరించారని ఆరోపించారు.
చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు మైనార్టీ మహిళను వేధించాడని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇవే నిదర్శనం అని రఘువీరా పేర్కొన్నారు.