చనిపోయినా... పింఛన్‌! | pension comes after death! | Sakshi
Sakshi News home page

చనిపోయినా... పింఛన్‌!

Aug 2 2017 11:13 AM | Updated on Sep 17 2017 5:05 PM

చనిపోయినా... పింఛన్‌!

చనిపోయినా... పింఛన్‌!

ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీలోని 11113160 వృద్ధాప్య పింఛన్‌ కార్డుదారుడు 2015 అక్టోబర్‌లో మృతి చెందాడు.

► స్వాహా చేసిన అధికారులు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీలోని 11113160 వృద్ధాప్య పింఛన్‌ కార్డుదారుడు 2015 అక్టోబర్‌లో మృతి చెందాడు. ఇతను చనిపోయినా ఇటీవలి వరకు ఆయన పేరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆనందరావు పింఛన్‌ డ్రా చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్ర వేసి డబ్బు స్వాహా చేశాడు.   పది నెలలపాటు డబ్బు తీసుకున్నాడు. గ్రామ పంచాయతీలో  పలు పింఛన్‌దారులకు సంబంధించిన లక్షా 8వేల 500 రూపాయలను ఈయన డ్రా చేశారు. 
 
సోములవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని 111233820 వృద్ధాప్య పింఛన్‌దారుడికి సంబంధించిన మొత్తాన్ని వరుసగా మూడు నెలలపాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనుంజయ్‌ బాబు డ్రా చేశాడు. వాస్తవానికి కార్డుదారుడు గత ఏడాది జూలై 20న మృతి చెందాడు. ఈ ప్రకారం ఈయన రూ.13వేలు డ్రా చేశాడు. కాకిరేనిపల్లె గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జిగా ఉన్న ఆయన మరో రూ.4వేలు ఇలానే డ్రా చేశాడు.
 
చెన్నమరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని 111234080 వృద్ధాప్య పింఛన్‌ కార్డుదారునికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి కె.రవి వరుసగా మూడు నెలలు చేతివేలి గుర్తు వేసి పింఛన్‌ తీసుకున్నాడు. ఈ ప్రకారం ఈయన పలు పింఛన్‌దారులకు సంబంధించిన రూ.22వేలు డ్రా చేశాడు. ఈయన ఇన్‌చార్జిగా ఉన్న చౌటపల్లె గ్రామ పంచాయతీలో రూ.4వేలు, కామనూరు పంచాయతీలో రూ.1000 డ్రా చేశాడు.
 
తాళ్లమాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 111233429 పింఛన్‌ కార్డుదారుడికి సంబంధించిన ఆరు నెలల పింఛన్‌ను గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతులూరయ్య బయోమెట్రిక్‌ మిషన్‌లో వేలిముద్ర వేసి డ్రా చేశాడు. వాస్తవానికి కార్డుదారుడు గత ఏడాది ఆగస్టు 10న మృతి చెందాడు. ఈ ప్రకారం ఈ కార్యదర్శి పలు పింఛన్‌దారులకు సంబంధించి రూ.26వేలు డ్రా చేశాడు. సీతంపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి సాక్షరభారత్‌ మండల కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రతి నెల పింఛన్‌ పంపిణీ చేస్తున్నాడు. ఈయన రూ.2వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. 
 
ఏ దిక్కు మొక్కు లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్‌ కావాలని కోరుకుంటున్నారు. సంతానం ఉన్నా సరిగా పట్టించుకోకపోవడం, వయసు రీత్యా కనీసం తమ జబ్బులకు సంబంధించి మందులు కొనేందుకైనా డబ్బు అవసరమనే కారణంతో పింఛన్‌ కావాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ విధానం కారణంగా పింఛన్‌దారులు పలు రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు. చేతివేలి గుర్తులు పడకపోవడం, మిషన్లు పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదరవుతున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు గ్రామ కార్యదర్శులే వేలిముద్రలు వేసి డబ్బు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

దీనిని అవకాశంగా భావించిన గ్రామ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పింఛన్‌ మొత్తం రూ.1000 పెరగడంతో ప్రతి నెలా మండలానికి కోట్ల రూపాయల్లో డబ్బు వస్తోంది. ఎంత పంపిణీ చేశాము, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది అనే వివరాలను అధికారులు సరిగా సేకరించలేకపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చనిపోయిన పింఛన్‌ దారుల డబ్బును తమ వేలి ముద్రలు వేసి స్వాహా చేయడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో వీటిని గుర్తించారు. ఇంకా పూర్తిగా తవ్వితే ఎన్ని అక్రమాలు బయటపడుతాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

జిల్లాలో మొత్తం 2,60,907 మందికి ప్రతి నెల ఎన్టీఆర్‌ భరోసా కింద డీఆర్‌డీఏ అధికారులు పింఛన్‌ పంపిణీ చేస్తున్నారు. వీరిలో 1,25,905 మందికి వృద్ధాప్య పింఛన్‌ ఇస్తుండగా, 91,353 మంది వితంతువులకు, 33,893 మంది దివ్యాంగులకు పింఛన్‌ చెల్లిస్తున్నారు. అలాగే 9,619 మంది చేనేత కార్మికులతోపాటు 132 మంది కల్లు గీత కార్మికులకు ప్రతి నెలా పింఛన్‌ ఇస్తున్నారు. వీరికి ఈ ప్రకారం మొత్తం రూ.28,52,28,500 చెల్లిస్తున్నారు.

ఫోకాజ్‌ నోటీసులు జారీ
డీఆర్‌డీఏ అధికారులు సోషల్‌ ఆడిట్‌లో వెలుగు చూసిన అక్రమాలకు సంబంధించి మండల పరిషత్‌ అధికారులకు లేఖ పంపారు. ప్రొద్దుటూరు మండలంలో మొత్తం చనిపోయిన వారి పేర్లతోపాటు ఇతరులకు సంబంధించిన రూ.1,80,500 గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్వాహా చేశారని తెలిపారు. వారి సూచనల ప్రకారం త్వరలో వీరికి ఎంపీడీఓ సుబ్రమణ్యం షోకాజు నోటీసులు జారీ చేయనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement