ఆస్తిపన్ను పేరుమార్పిడిలో.. అవినీతికి పాల్పడ్డ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులపై ఆర్డీ విజయలక్ష్మికి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తానని మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఆర్డీకి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తా
ప్రొద్దుటూరు టౌన్:
ఆస్తిపన్ను పేరుమార్పిడిలో.. అవినీతికి పాల్పడ్డ బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులపై ఆర్డీ విజయలక్ష్మికి ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయిస్తానని మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ఈనెల 13న ‘ఆస్తిపన్ను పేరు మార్పిడిలో.. గోల్మాల్’ కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన చైర్మన్ శనివారం తన చాంబర్కు, అసిస్టెంట్ కమిషనర్ నటరాజన్, ఆర్ఐ గిరిధర్బాబు, పౌరసేవ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ సింగరయ్యలను పిలిపించారు.
మున్సిపాలిటీకి చెలానా కట్టకుండా, ఎలాంటి రికార్డులు లేకుండా నేరుగా ఆస్తి పన్ను పేరును ఏవిధంగా మార్పు చేశారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని పేర్లు మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి బిల్ కలెక్టర్లు మార్చారో పూర్తి నివేదికను తయారు చేయాలని అసిస్టెంట్ కమిషనర్కు చెప్పారు. మున్సిపాలిటీ జీతాలు తీసుకుంటూ మున్సిపల్ ఆదాయానికే గండి కొట్టిన బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది ఎవరు ఉన్నా ఆర్డీకి ఫిర్యాదు చేసి వారిని సస్పెండ్ చేయిస్తానని మండిపడ్డారు. సవరణ పేరుతో ఏకంగా పేర్లే మార్చేస్తే ఆస్తులు ఉన్న వారు కొట్టుకుని చావాలనా అని ప్రశ్నించారు.
8వ వార్డులో పేర్లు మార్పు చేసిన మరో బిల్ కలెక్టర్
8వ వార్డు బిల్ కలెక్టర్ రవీంద్రారెడ్డికి తెలియకుండా మరో బిల్ కలెక్టర్ నేరుగా కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో ఆస్తి పన్ను పేర్లు మార్చిన విషయం ఇప్పటికే నిర్ధారణ అయింది. సంబంధిత ఆిస్తి యజమానులను కలిసి బిల్ కలెక్టర్ రవీంద్రారెడ్డి మాట్లాడి ఏవిధంగా పేర్లు మార్చారో ప్రశ్నించగా వారు సమాధానం చెప్పలేదు. సంబంధిత యజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి పేరు మార్పును రద్దు చేసేందుకు ఫైల్ను సిద్ధం చేశారు. ఈ విధంగా మొత్తం 40 వార్డుల్లో ఎన్ని మున్సిపాలిటీకి చెలానా కట్టకుండా నేరుగా పేర్లు మార్చారన్న విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది.
ఫొటో:16పిడిటిఆర్ 101- సిబ్బందిని విచారిస్తున్న చైర్మన్ గురివిరెడ్డి