గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై రాయలసీమను రతనాలసీమగా మార్చుకుందామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు.
అనంతపురం అర్బన్ : గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై రాయలసీమను రతనాలసీమగా మార్చుకుందామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కేటీఆర్ ఫంక‌్షన్ హాల్‌లో నీటి వినియోగ సంఘాల అధ్యక్షులు, ఇంజినీరింగ్ విద్యార్థులతో ‘నీరు ప్రగతి– ఉద్యమం– 90 రోజుల ప్రణాళిక’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధ్యక్షత జరిగిన సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడారు.
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా యువతకు విరివిగా అవకాశాలు వస్తాయన్నారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు, ఐదు లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఐదు వేలు జనాభా కలిగిన ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. 2018 నాటికి హంద్రీ–నీవా, గాలేరి–నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీటిని ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.