గోవిందుడు బహుదూరం

గోవిందుడు బహుదూరం


 సామాన్యులకు ఏడాదిగా

 మహాలఘు దర్శనమే

 రద్దీ తక్కువగా ఉన్నా దూరంనుంచే దర్శనం

 వీఐపీలకు 10 అడుగులు నుంచే...


 

తిరుమల: సామాన్య భక్తులకు దేవదేవుడైన వేంకటేశ్వరుడి దర్శనం దుర్లభమవుతోంది. వీఐపీలకు పది అడుగులు, సామాన్యులకు మాత్రం 70 అడుగుల దూరం ను ంచి శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పిస్తున్నారు. ఏడాదిగా ఇదేతంతు. దేవదేవుని ముందు భక్తులందరూ సమానమనే చెప్పే ధార్మిక సంస్థ స్వామి దర్శనంలో తారతమ్యం ప్రదర్శిస్తూ అపవాదు మూటకట్టుకుంటోంది.




సామాన్యులకు కులశేఖరపడి, లఘు దర్శనం లేదు


2004 ముందు వరకు ఆలయంలో కుల శేఖరపడి (పది అడుగులు), రాములవారి మేడ (35 అడుగులు) నుంచి భక్తులకు దర్శనం కల్పించేవారు. కులశేఖరపడి (గంటకు 1,500 మందితో రోజుకు  27 వేలు), రాములవారి మేడ నుంచి లఘు దర్శనం (గంటకు 2,500 మందితో రోజుకు 45 వేలు) కల్పించేవారు. ప్రస్తుతం భక్తుల రద్దీ సగటున 60 వేల నుంచి  80 వేలకు పెరిగింది. దీంతో శ్రీవారి కైంకర్యాలకు కనిష్టంగా కేటాయించాల్సిన 6 గంటల సమయం పోను మిగిలిన 18 గంటలపాటు ఏకధాటిగా స్వామి దర్శనం కల్పిస్తున్నారు.


2004లో తిరుమల ప్రత్యేకాధికారిగా వచ్చిన ఏవీ ధర్మారెడ్డి దర్శనం విషయంలో సంస్కరణలు ప్రవేశ పెట్టి మహాలఘు (70 అడుగుల దూరంలోని  జయవిజయులు నుంచి) దర్శనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో గంటకు 5 వేల చొప్పున రోజుకు 90 వేల మందికి దర్శనం కల్పించేవారు. ప్రారంభంలో విమర్శలు వచ్చినా పెరుగుతున్న రద్దీకి అదే మహద్భాగ్యంగా మారింది. వీఐపీలకు మాత్రమే స్వామిని దగ్గరగా దర్శించుకునే అవకాశం కల్పించి, సామాన్య భక్తులకు దూరం చేస్తున్నారన్న విమర్శలపై మూడేళ్లకు ముందు అప్పటి ఈవో ఎల్‌వీ సుబ్రమణ్యం ఆదేశాలతో రద్దీ తక్కువగా ఉంటే కులశేఖరపడి, కొంత పెరిగితే రాములవారిమేడ నుంచి, మరింత పెరిగితే జయవిజయులు నుంచి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కలిగింది. తర్వాత షరా మామూలే.


శాశ్వతంగా మహాలఘు దర్శనం...

ఆలయంలో ఏడాదికాలంగా మూడు క్యూల విధానం అమలవుతోంది. రద్దీ తగ్గినా, పెరిగినా 70 అడుగుల దూరంలోని బంగారు వాకిలి వద్ద మహాలఘు దర్శనంతో భక్తులు స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల భక్తుల మధ్య తోపులాటలు తగ్గినా దర్శనం చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. అయినప్పటికీ ఇదే విధానాన్నే శాశ్వతంగా అమలు చేయాలని టీటీడీ సంకల్పించింది.


వీఐపీలకు పది అడుగుల నుంచే శ్రీవారి దర్శన భాగ్యం


దేవదేవుడి దర్శన భాగ్యాన్ని సామాన్య భక్తులకు 70 అడుగుల దూరంనుంచి కల్సిస్తున్న టీటీడీ వీఐపీల విషయంలో మాత్రం భక్తి చాటుకుంటోంది. రూ. 500 టికెట్లతో వీఐపీలకు ఎర్రతివాచీ స్వాగతం పలుకుతూ 10 అడుగుల దూరం నుంచే వారికి హారతి, తీర్థం, శఠారి మర్యాదలతో కూడిన ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. దీనిపై సామాన్య భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top