కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం జూరాల ప్రాజెక్టుకు 1615 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.
జూరాల : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం జూరాల ప్రాజెక్టుకు 1615 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలి పారు. వర్షాలు ఇలాగే కురిస్తే నెల రోజుల్లో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరి నారాయణపూర్ ద్వారా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇన్‌ఫ్లో వివరాలిలా ఉన్నాయి.
ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.06 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు వంద కి.మీ. దూరం దిగువన కర్ణాటక రాష్ర్టంలోనే ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. కాగా ప్రస్తుతం కేవలం 14.37 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4,249 క్యూసెక్కులు వచ్చిచేరుతోంది.
ఇక జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 2.54 టీఎంసీలుగా ఉంది. వర్షాలతో 1,615 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్రా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 110.86 టీఎంసీలు. కాగా ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 3.56 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 471 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నుంచి 206 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.