పీఎఫ్‌ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం | IDBI's objection to PF counter | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం

Jul 1 2017 12:37 AM | Updated on Sep 2 2018 3:34 PM

పీఎఫ్‌ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం - Sakshi

పీఎఫ్‌ కౌంటర్‌పై ఐడీబీఐ అభ్యంతరం

సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మికులకు సంబంధించిన భవిష్య నిధి (పీఎఫ్‌) డబ్బులు చెల్లించేందుకు మిల్లులో ఏర్పాటు చేసిన పీఎఫ్‌ కౌంటర్‌ నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

► క్రెడిట్‌ సొసైటీకి తాళం వేసిన అధికారులు
► డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎస్పీఎం కార్మికులు
► డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన వివాదం


కాగజ్‌నగర్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మికులకు సంబంధించిన భవిష్య నిధి (పీఎఫ్‌) డబ్బులు చెల్లించేందుకు మిల్లులో ఏర్పాటు చేసిన పీఎఫ్‌ కౌంటర్‌ నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ కౌంటర్‌ నిర్వహణపై ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) అధికారులు అభ్యంతరం తెలపడంతో ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ దరఖాస్తులు స్వీకరించేందుకు స్టాఫ్‌ గేట్‌ పక్కన గల క్రెడిట్‌ సొసైటీ కార్యాలయంలో పీఎఫ్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసి ఎస్పీఎం డీజీఎం రమేశ్‌రావు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తుండగా శుక్రవారం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఐడీబీఐ అధికారుల ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఉదయం 9 గంటలకు క్రెడిట్‌ సొసైటీ కార్యాలయానికి తాళం వేయడంతో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన కార్మికులు ఒక్కసారిగా ఆగ్రహానికి   గురయ్యారు. తాము పీఎఫ్‌ కోసం శాంతియుతంగా దరఖాస్తు చేసుకుంటే పీఎఫ్‌ కౌంటర్‌కు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్మికులు దీనిపై ఎస్పీఎం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రమేశ్‌రావుకు సమాచారం అందించారు. దీంతో రమేశ్‌రావు అక్కడికి చేరుకొని సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్మికులు సైతం అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా రమేశ్‌రావు కార్మికులతో వెళ్లి స్థానిక డీఎస్పీ హబీబ్‌ఖాన్‌కు విషయాన్ని వివరించారు. పీఎఫ్‌ కార్యాలయాన్ని శాంతియుంగా కొనసాగిస్తున్నా ఐడీబీఐ అధికారులు తాళం వేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో డీఎస్పీ ఐడీబీఐ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎస్పీఎం కార్మికులకు సంబంధించిన పీఎఫ్‌ దరఖాస్తులు క్రెడిట్‌ సొసైటీ కేంద్రంగా స్వీకరిస్తే బ్యాంక్‌ అధికారులకు ఎటువంటి నష్టం జరగదని, ఈ విషయంలో సహకరించాలని సూచించారు.

డీఎస్పీ జోక్యంతో సొసైటీకి వేసిన తాళాన్ని సిబ్బంది తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా రమేశ్‌రావు మాట్లాడుతూ పీఎఫ్‌ దరఖాస్తులు స్వీకరించడానికి మాత్రమే క్రెడిట్‌ సొసైటీని వినియోగిస్తున్నామని, ఇందులో అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 11గంటలకు క్రెడిట్‌ సొసైటీ తాళం తీయడంతో కార్మికులు తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం 70 మంది కార్మికులు పీఎఫ్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు రమేశ్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement