
టెండర్ బాక్సులో దరఖాస్తులు వేస్తున్న మద్యం వ్యాపారులు
మద్యం దుకాణాలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. సోమవారం త్రయోదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేశారు.
♦ మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ
♦ 138 దుకాణాలకు 1466 దరఖాస్తులు
♦ 13 దుకాణాలకు సింగిల్ టెండర్లు
♦ 5 దుకాణాలకు సున్నా దరఖాస్తులు
♦ అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52
♦ దరఖాస్తుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.14.66 కోట్లు
♦ నేటితో దరఖాస్తుల స్వీకరణ ఆఖరు
నల్లగొండ :
మద్యం దుకాణాలు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. సోమవారం త్రయోదశి మంచి రోజు కావడంతో భారీ సంఖ్యలో దరఖాస్తు చేశారు. జిల్లాలో 138 దుకాణాలకు సోమవారం ఒక్క రోజే 875 దరఖాస్తులు రావడం విశేషం. దీంట్లో అత్యధికంగా నిడమనూరు మండలం తుమ్మడం దుకాణానికి 52 మంది పోటీ పడుతున్నారు. రెండో స్థానంలో కనగల్ మండలం దర్వేశిపురం దుకాణానికి 31మంది పోటీలో ఉన్నారు. సింగిల్ టెండర్లు వచ్చిన దుకాణాలు 13 ఉన్నాయి. వీటిల్లో నల్లగొండ మున్సిపాలిటీ, దేవరకొండ నగర పంచాయతీ దుకాణాలే ఉన్నాయి. అసలు దరఖాస్తులు రాని దుకాణాలు 5 ఉన్నాయి. ఇవి కూడా నల్లగొండ మున్సిపాలిటీలోనే చెందినవే. ఈ నెల 13నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా తొలిరోజు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకాగా, ఆదివారం నాటికి 591 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం వచ్చిన 875 దరఖాస్తులతో కలిపి ఇప్పటివరకు 138 దుకాణాలకు 1466 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో దరఖాస్తు రుసుము రూ.లక్షలు కాగా...ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో ఇప్పటి వరకు రూ.14.66 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారంతో ముగియనుంది.
అంచనాలకు మించి...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మూడు వేలకుపైగా దరఖాస్తులు రాగా దాంట్లో కేవలం నల్లగొండ జిల్లాలోనే 1700 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఈ దఫా 1300 దరఖాస్తులు వస్తాయని అధికారలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డు స్థాయిలో వ్యాపారుస్తుల నుంచి పోటీ రావడంతో అధికారులు బిత్తరపోయారు. సూర్యాపేట జిల్లాలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన వారు కూడా నల్లగొండ జిల్లాలోని దుకాణాలకు పోటీ పడుతున్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారులు కూడా మిర్యాలగూడ, దామరచర్ల ప్రాంతంలోన దుకాణాలకు టెండర్లు వేస్తున్నారు. ఆంధ్రాలో లిక్కర్ మాఫియాకు అడ్డుకట్టపడటంతో అక్కడి వ్యాపారులు నల్లగొండ జిల్లా పై కన్నేశారు. దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా ఉండటం విశేషం.