ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం | govt working on people issues says zilla parishad chairman Raju | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Jul 16 2016 8:06 PM | Updated on Sep 4 2017 5:01 AM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

నిజామాబాద్:  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లాపరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమం స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ లత అధ్యక్షతన కార్యక్రమం సాగింది. షాదీముబారక్ పథకంలో చేసిన సవరణలపై మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. ఇప్పటికీ పెళ్లికూతురుపై దరఖాస్తులను అందజేస్తున్నారని, తల్లి పేరుతో నేరుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాల న్నారు. కిందిస్థాయి సిబ్బంది పరిశీలించిన తర్వాతే దరఖాస్తుల జాబితాను ఎమ్మెల్యేను పంపించాలన్నారు.

జిల్లాకు ఆరు మైనారిటీ గురుకులాలు మంజూరయ్యాయని మైనారిటీ కార్పొరేషన్ అధికారులు తెలిపా రు. జిల్లాలో కళ్యాణలక్ష్మి పథకానికి 1,064 దరఖాస్తు లు వచ్చాయని, అందులో 880 మందికి కళ్యాణ లక్ష్మి నిధులు అందించామని అధికారులు పేర్కొన్నారు. 26 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని, 159 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు అందించనున్నట్లు తెలిపా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, జెడ్పీటీసీ సభ్యులు కిషన్, లక్ష్మి, సాయిరాం పాల్గొన్నారు.

ఎజెండా కాపీ లేకపోవడంపై ఆగ్రహం
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ సమావేశానికి వచ్చినా.. తన ఎజెండా కాపీ అందజేయకపోవడంపై జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా కాపీ ఇవ్వకుండా సమావేశానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నివేదికను అందించడానికే ఇంత ఇబ్బంది పడితే క్షేత్రస్థాయిలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థమౌతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకే సమాచారం ఇవ్వకుంటే మామూలు ప్రజానీకానికి ఏం ఇస్తారన్నారు. తర్వాత జరిగే సమావేశానికి ముందుగానే ఎజెండా కాపీని అందించాలని, లేకుంటే సమావేశానికి రావద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement