ప్రభుత్వాలపై ప్రతిఘటన తప్పదు

మాట్లాడుతున్న బీవీ విజయలక్ష్మి

  • ఐసీడీఎస్‌ను రక్షించాలి 

  • ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీవీ విజయలక్ష్మి 

  • పాల్వంచ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి బీవీ విజయలక్ష్మి హెచ్చరించారు. స్థానిక కేటీపీఎస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ హాల్లో రెండు రోజుల పాటు జరగనున్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బాలిక సంరక్షణ, శిశు సంక్షేమం కోసం నడుపుతున్న ఐసీడీఎస్‌ను నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఐసీడీఎస్‌ బడ్జెట్‌ను ఏటా పెంచాల్సింది పోయి సగానికి పైగా తగ్గించారని, పౌష్టికాహారాన్ని సరఫరా చేయక పోవడంతో పేద కుటుంబాలవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్‌వాడీ సెంటర్ల అద్దెలను, వర్కర్ల, హెల్పర్ల జీతాలను సకాలంలో ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సెంటర్లను నడపాల్సి వస్తోందన్నారు. అంగన్‌ వాడీ సెంటర్‌ ఒక్కో నిర్మాణానికి కేంద్రం రూ.5 లక్షల నిధులు విడుదల చేస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం 100 గజాల స్థలం కేటాయించలేక పోతోందని, ఇప్పటికీ సొంత ఇళ్లలో, చెట్ల కింద నడిపిస్తున్న సెంటర్లు చాలా ఉన్నాయని తెలిపారు. వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి, పోటు ప్రసాద్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శింగు నర్సింహారావు, సహాయ కార్యదర్శి ప్రసాద్, వివిధ సంఘాల నేతలు దుర్గా అశోక్, సీతామహాలక్ష్మి, విశ్వనాథం, పూర్ణచందర్‌రావు, జమలయ్య, ఆదాం, నాగేశ్వరరావు, రాహుల్, వెంకటేశ్వర్లు, నాగమణి, పద్మజ, సమ్మయ్య, రమేష్‌ పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top