సార్.. అప్పులు చేసి వేలకు వేలు పెట్టుబడులో సాగు చేసిన వేరుశనగ కళ్లముందే మాడి మసైపోతోం ది.
అనంతపురం అగ్రికల్చర్: సార్.. అప్పులు చేసి వేలకు వేలు పెట్టుబడులో సాగు చేసిన వేరుశనగ కళ్లముందే మాడి మసైపోతోం ది.. ఎలాగైనా ఒక రక్షకతడి ఇచ్చి కాపాడండి.. అంటూ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు అధికారులను వేడుకున్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో రెయిన్‌గన్ల ద్వారా ఇస్తున్న రక్షకతడులు, సమస్యల గురించి ఉదయం గంటపాటు ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇన్‌చార్జి జేడీఏ చంద్రానాయక్, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏడీఏ ఆర్.శ్రీనివాసులు, ఏఈవో జి.ఆదినారాయణ రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పంట ఎండుతున్నా రక్షకతడులు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కొందరు, అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారని మరికొం దరు, రాయితీతో ఇవ్వాలని ఇంకొందరు అధికారులను వేడుకున్నారు. సాధ్యమైనంత వరకు పంటను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు జవాబిచ్చారు.