మల్లన్నపై లొల్లి | discussion on mallannasagar project | Sakshi
Sakshi News home page

మల్లన్నపై లొల్లి

Aug 16 2016 10:37 PM | Updated on Sep 4 2017 9:31 AM

సమావేశంలో వాడివేడి చర్చ

సమావేశంలో వాడివేడి చర్చ

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన జిల్లా పరిషత్తు సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది.

  • వాడివేడిగా జడ్పీ సమావేశం
  • ‘వ్యవసాయం దండగ’ ధోరణిలో సర్కారు
  • కాంగ్రెస్‌ జడ్పీటీసీల ఆరోపణ
  • మండిపడిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • మల్లన్నసాగర్‌తో జిల్లాకు మేలన్న సోలిపేట
  • ప్రాజెక్టులను అడ్డుకోవద్దని వినతి
  • చర్చకు సిద్ధమా అని సవాల్‌
  • పాఠశాల సమస్యలపై పీఓ తీరు బాగా లేదు: ఎమ్మెల్యే ప్రభాకర్‌
  • సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన జిల్లా పరిషత్తు సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి.. ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగగా భావిస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయటం లేదని అనడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యులు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్‌ ఒక్కసారిగా మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు.

    ‘కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఒక్క ప్రాజెక్టయినా కట్టిందా?, 60 ఏళ్లలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరిచ్చారా? సింగూరు ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వని ఘనత మీది’ అంటూ కాంగ్రెస్‌ జెడ్పీటీసీలపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్‌ను కుట్రపూరితంగా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందన్నారు. ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని.. మీరు వస్తారా అని ఆయన సవాల్‌ చేశారు.

    మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీయాదవ్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రాములునాయక్, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సీఈఓ వర్షిణి, జెడ్పీటీసీలు, ఎంపీపీ, అధికారులు పాల్గొన్నారు.

    బాధే.. అయినా పుష్కలంగా సాగునీరు
    ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో తన నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఇది బాధాకరమైనా జిల్లాలోని 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ సభ్యులను జెడ్పీలో మాట్లాడనివ్వలేదని, కానీ తాము మాత్రం కాంగ్రెస్‌ సభ్యులకు ఎంతో స్వేచ్ఛ, గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు. పార్టీలకతీతంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

    సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ అప్పుడు తెలంగాణను అడ్డుకున్న వారే ఇప్పుడు ప్రాజెక్టులు వద్దని ఆమరణదీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగూరు కాల్వల భూసేకరణలో భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2.60 లక్షలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే బాబూమోహన్‌- సింగూరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించలేదని, ఒక్క ఎకరాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదన్నారు.

    ఈ వ్యాఖ్యలపై జెడ్పీటీసీ ప్రభాకర్, నారాయణఖేడ్‌ ఎంపీపీ సంజీవరెడ్డి అభ్యంతరం తెలిపారు. వైస్‌చైర్మన్‌ సారయ్య, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై ధ్వజమెత్తారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని అయితే నిర్వాసితులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. చివరకు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో వివాదం సద్దుమణిగింది.

    సీఎం చదివిన స్కూల్‌ అభివృద్ధిపై నిర్లక్ష్యమా?
    దుబ్బాకలో సీఎం కేసీఆర్‌ చదువుకున్న స్కూల్‌ అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. సీఎం చదివిన స్కూల్‌ పరిస్థితే ఇలా ఉంటే మిగతా పాఠశాలల పరిస్థితేంటని ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జెడ్పీ సీఈఓ వర్షిణి కలుగజేసుకుని పనులు సత్వరం ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సైతం ఎస్‌ఎస్‌ఏ అధికారుల తీరు సరిగ్గా లేదన్నారు. పాఠశాలల్లో సమస్యలు చెబుతామంటే పీఓ ఫోన్‌ కూడా ఎత్తదని ఆరోపించారు. సీఈఓ వర్షిని.. తను గుడ్‌ ఆఫీసర్‌ అంటూ సర్ది చెప్పబోగా ‘మీరు ఆమె తరపున వకాల్తా పుచ్చుకోవద్ద’ని ప్రభాకర్‌ సూచించారు.

    మిషన్‌ భగరీథ పథకం అమలుపై సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అధికారులు సమాచారం చెప్పటం లేదని, ఇంతవరకు సమావేశం నిర్వహించలేదని ఆయన ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్‌ఈ విజయప్రకాశ్‌ తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్‌లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీర్ల పోస్టులను, గురుకుల పాఠశాలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

    ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నాన్‌ సీఆర్‌ఎఫ్‌లో ప్రతిపాదించిన పనులు ఇంకా చేపట్టడంలేదని, ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి బిల్లులు మంజూరు చేయలేదన్నారు. దీనిపై కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ స్పందిస్తూ ట్రెజరీలో ప్రీజ్‌ ఉన్నందున జాప్యమైందని త్వరలో బిల్లులు అందుతాయన్నారు. అలాగే ఆర్‌ఓ ప్లాంట్ల బిల్లులు అంశాన్నీ పరిశీలిస్తానని చెప్పారు.

    లక్ష్యం మేరకు మొక్కలు నాటుదాం
    హరితహారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అన్నారు. హరితహారం అమలులో పలు మండలాలు ముందుండగా కొన్ని వెనకబడి ఉన్నట్లు చెప్పారు. లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో రూ.40వేల మొక్కలు నాటాలని సూచించారు. పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ గుంతులు తీసినందుకు బిల్లులు చెల్లించటంలేదన్నారు. మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌ బిల్లులును చెల్లించేలా చూస్తామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement