చెల్లని చెక్కు కేసులో నిందితునికి జరిమానా | defendant fine in Check bounce case | Sakshi
Sakshi News home page

చెల్లని చెక్కు కేసులో నిందితునికి జరిమానా

Aug 24 2016 7:01 PM | Updated on Mar 28 2018 11:26 AM

చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు.

చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ఎల్‌బీనగర్ కాకతీయకాలనీకి చెందిన గోవర్ధన్, నల్లగొండ జిల్లా పానగల్‌కు చెందిన యాదయ్యలు పరిచయస్తులు. తన కుటుంబ అవసరాల నిమిత్తం 2013లో యాదయ్య లక్ష రూపాయలను అప్పుగా గోవర్ధన్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.
 
 
గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని యాదయ్యను కోరగా ఇందుకు గాను ఎస్‌బీఐ రవీంద్రనగర్‌బ్రాంచికి చెందిన లక్ష రూపాయల చెక్కును గోవర్ధన్ పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును ఎస్‌బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ యాదయ్య స్పందించకపోవడంతో గోవర్ధన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. మరో కేసులో... రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి సంవత్సరం జైలుశిక్ష, రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు.
 
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు, షాద్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణలు పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2014లో లక్ష్మీనారాయణ రూ.15 లక్షలను అప్పుగా శ్రీనివాసరావు నుంచి తీసుకుని మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని లక్ష్మీనారాయణను కోరగా అందులకు గాను తన ఖాతాకు చెందిన 15 లక్షల రూపాయల చెక్కును శ్రీనివాసరావు పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును బ్యాంకులో జమచేయగా లక్ష్మీనారాయణ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ లక్ష్మీనారాయణ డబ్బులు చెల్లించకపోవడంతో శ్రీనివాసరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement