ప్రమాదకర ప్రయాణం | danger journey | Sakshi
Sakshi News home page

ప్రమాదకర ప్రయాణం

Aug 31 2016 6:25 PM | Updated on Sep 4 2017 11:44 AM

ఆర్టీసీ బస్సు టాపుపై ప్రయాణికులు

ఆర్టీసీ బస్సు టాపుపై ప్రయాణికులు

‘ఆటోల్లో ప్రయాణించడం ప్రమాదకరం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

  • పల్లెలకు వెళ్లని ప్రగతి రథచక్రాలు
  • ఇబ్బందుల్లో గ్రామీణులు, విద్యార్థులు
  • ప్రమాదమని తెలిసినా ప్రైవేటు వాహనాల ఆశ్రయం
  • జోగిపేట: ‘ఆటోల్లో ప్రయాణించడం ప్రమాదకరం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం’ అంటూ ప్రచారం చేస్తున్న ఆర్టీసీ ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. జోగిపేట పట్టణంలోని కళాశాలలు, పాఠశాలలకు అందోలు, పుల్కల్, రేగోడ్, టేక్మాల్,  అల్లాదుర్గం, కౌడిపల్లి, హత్నూర మండలాల నుంచి 600 మంది వరకు విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు.

    అందోలు మండలం పరిధిలోని కన్‌సాన్‌పల్లి, నేరడిగుంట, రాంసానిపల్లి, చింతకుంట, అన్నాసాగర్, అల్మాయిపేట, డాకూర్, తాలెల్మ, బ్రాహ్మణపల్లి, అక్సాన్‌పల్లి, సంగుపేట, అందోలు గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటకు వచ్చి చదువుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోవాల్సి ఉండగా సకాలంలో బస్సులు లేకపోవడంతో ఉదయం 10.30 గంటల వరకు కూడా చేరుకోలేని పరిస్థితి.

    ఉదయం పూట ముస్లాపూర్, పెద్దాపూర్‌ రూట్‌లో ఒక బస్సును నడుపుతారు. ఆ బస్సులోనే వందకుపైగా విద్యార్థులు ఎక్కుతున్నారు. ప్రాణాలకు తెగించి మరీ అందుటో ప్రయాణిస్తున్నారు. బస్సుటాపు, ఫుడ్‌బోర్డుపై ప్రయాణించాల్సి వస్తోంది. ఆ బస్సు కూడా 9.30 నుంచి 10 గంటల ప్రాంతంలో జోగిపేటకు చేరుకుంటుంది.

    ప్రైవేటు వాహనాలే దిక్కు
    జోగిపేట పట్టణంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐలకు ప్రతి రోజూ వందల సంఖ్యలో వస్తుంటారు. బస్‌పాస్‌లు తీసినప్పటికి విద్యార్థులకు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. సమయానికి బస్సులు రావడం లేదు. ఒకటి, రెండు బస్సులే ఉండటంతో అవి దొరకకపోతే ఏదో ఓ వాహనాన్ని ఆశ్రయించి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు.

    చింతకుంట, కన్‌సాన్‌పల్లి , రాంసానిపల్లి, అన్నాసాగర్‌ గ్రామాలకు చెందిన విద్యార్థులకు సకాలంలో బస్సులు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అన్నాసాగర్, అందోలు ప్రాంతాలకు చెందిన వారు కాలినడకనే రావాల్సి వస్తోంది.

    • అల్లాదుర్గం మండలానికి చెందిన ముస్లాపూర్, పెద్దాపూర్‌ గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా బస్సు టాప్‌పై ఎక్కి ప్రయాణించి వస్తున్నారు. గంటలకొద్దీ బస్సులు కోసం నిరీక్షిస్తున్నారు.
    • టేక్మాల్‌ మండలానికి చెందిన పల్వంచ, ధన్నారం గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా జోగిపేటకు రావడానికి నరకయాత పడుతున్నారు. బస్సులు సమయానికి లేకపోవడంతో కొద్ది దూరం కాలినడకన వచ్చి ఆటోల్లో వెళ్తున్నారు.
    • కౌడిపల్లి మండలానికి చెందిన చండూర్, చిలప్‌చెడ్, సిలాంపల్లి, చిట్కుల్‌ గ్రామాలకు చెందిన విద్యార్థులు జోగిపేటలోని కళాశాలల సమయానికి బస్సులు లేకపోవడంతో ఉదయం 10 గంటలు దాటిన తరువాత వస్తున్నారు. అప్పటికే తరగతులు ప్రారంభం కావడంతో నష్టపోతున్నారు.
    • ఉదయం పూట బస్సులు లేకపోవడంతో రేగోడ్‌ మండలానికి చెందిన ఖాదిరాబాద్, రేగోడ్, నిర్జప్ల,  దేవ్‌నూర్, గజ్వాడ, గట్‌పల్లి, ఉసిరికపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

    బస్సులను నడపాలి
    విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపాలి. ఉదయం 8.30 గంటల వరకు ముస్లాపూర్‌ నుంచి బయలుదేరే విధంగా బస్సును నడిపించాలి. చింతకుంట, చండూర్‌ ప్రాంతాల విద్యార్థులకు సమయానికి బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  - టి.నరేష్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు

    ఆందోళన చేపడతాం
    విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులను నడపకుంటే ఆందోళన చేపడతాం. సంగారెడ్డి, మెదక్‌ డిపోలకు చెందిన బస్సులను నడపాలి. ఆలస్యంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. - పి.మొగులయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

    సమస్యను పరిష్కరించాలి
    బస్సుల కోసం రాస్తారోకోలు చేయడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. విద్యార్థులు రాస్తారోకోలు చేయకుండా ఆర్టీసీ అధికారులు స్పందించాలి. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి సమస్యను పరిష్కరించాలి. ప్రయానికులను ఇబ్బంది పెట్టొద్దు. - వెంకటయ్య, సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement